Sunday, February 14, 2016


Untitled Document
వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి పోటీ: తమ్మినేని
బూర్జువా పార్టీలతో పొత్తుల్లేవ్‌
ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరపాలక ఎన్నికలలో వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి పోటీ చేస్తామని.. కాంగ్రెస్‌, తెదేపా వంటి బూర్జువా పార్టీలతో పొత్తు ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలన్న ఉద్దేశం మంచిది కాదన్నారు. ఎదురనేదే లేకుండా దోపిడీ చేయాలన్నదే అధికార పార్టీ ఆలోచన అని విమర్శించారు.

ప్రస్తుతం నగరపాలక ఎన్నికలలో రూ.40-50లక్షలు ఖర్చు చేస్తారా అంటున్నారని, ఎక్కడైనా ఇదే చర్చ జరుగుతోందన్నారు. ఖమ్మం, వరంగల్లు, ఇతర మున్సిపల్‌ ఎన్నికలలో వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి పోటీ చేస్తామని తమ్మినేని అన్నారు. కాంగ్రెస్‌, తెదేపా పార్టీలతో పొత్తు సమస్యే లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వామపక్షాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దేశ, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలనే గెలిపించాలని, మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్థానిక సంస్థలకు విధులు, నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెరాసది అవకాశవాద రాజకీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదేపాలు బలహీనపడుతున్నాయన్నారు. ఖమ్మంలో నీతివంతమైన పాలన అందించిన చరిత్ర సీపీఎందేనన్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతతత్వ వాదాన్ని పెంచి పోషిస్తోందని, తద్వారా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోందని తమ్మినేని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు లౌకిక శక్తులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. దిల్లీలోని జేఎన్‌టీయూలో జరుగుతున్న సంఘటనలపై తమ్మినేని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం పర్యటనను స్వాగతిస్తున్నామని.. కానీ నిధులివ్వకుండా వాగ్దానాలతో మభ్యపెట్టాలని చూస్తే ఒరిగే లాభం ఏమీ లేదన్నారు. నగర పాలక ఎన్నికలలో సీపీఐతో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్డీ కూడా తమతో కలిసివస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, ఏజే రమేశ్‌, యర్రా శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.ఖమ్మం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా పోట్ల
కార్పొరేషన్‌ ఎన్నిక నేపథ్యం
ఈనాడు, ఖమ్మం
ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్‌ నేత పోట్ల నాగేశ్వరరావుకు ఖమ్మం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

కామేపల్లి మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగుతున్నారు.ఎన్‌.టి.ఆర్‌. పార్టీ పెట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి యువజన విభాగం రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం పోట్లకు ఉంది. అనంతర కాలంలో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ప్రకటించిన తెదేపా రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు లభించింది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోట్ల కొనసాగుతున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పోట్ల నాగేశ్వరరావుకు ఖమ్మం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా నగరంలోని పలు డివిజన్‌లలో పార్టీ శ్రేణులను కలుపుకొంటూ ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సూటిగా మాట్లాడే పేరున్న పోట్ల ఆధ్వర్యంలోనే రానున్న కార్పొరేషన్‌ ఎన్నికకు పార్టీ సన్నద్ధం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మృతి
కొత్తగూడెం నేరవార్తలు, న్యూస్‌టుడే
కొత్తగూడెం మండల పరిధిలోని బృందావనం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలోరైల్వే అధికారి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం...వీఆర్‌.పురం మండలం పెద్దమట్టపల్లి గ్రామానికి చెందిన జి.లక్ష్మణరావు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే నివశిస్తున్న అతను తన తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కారులో వీఆర్‌.పురానికి వస్తున్నారు. బృందావనం సమీపంలో వేగంగా వస్తున్న తన కారు మొదట సైకిల్‌ను ఢీకొట్టి అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న పత్తిట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ఇంజిన్‌భాగం పూర్తిగా ఛిద్రమైంది. కారు సైతం కుడిభాగం నుజైపోయింది. డ్రైవింగ్‌సీటులో ఉన్న లక్ష్మణరావు అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సీఐ మడత రమేష్‌, ఎస్సై శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని కొంతమంది సాయంతో బయటికి తీయించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దమట్టపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి గుంపనపల్లి మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఆగి ఉన్న కారును... ఆపబోయిన వ్యక్తిని ఢీకొన్న లారీ
ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారి పక్కన ఆగి ఉన్న కారును ఓ లారీ ఢీకొన్న సంఘటన చూసి ఆ లారీని ఆపబోయిన వ్యక్తిని అదే లారీ ఢీకొట్టిన సంఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. కామేపల్లి మండలం వూట్కూరు గ్రామానికి చెందిన తుమ్మలపల్లి బుచ్చయ్య శుక్రవారం మండలంలోని నాయుడుపేట గ్రామంలోని పీవీఆర్‌గార్డెన్‌లో ఓ శుభ కార్యానికి వచ్చారు. అక్కడే బైపాస్‌రోడ్డులో రహదారి పక్కనే ఆగి ఉన్న ఓ కారును లారీ ఢీకొని వెళ్తుండగా ఆ లారీని ఆపే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్‌ వేగం పెంచారు. దీంతో లారీ ఢీకొని బుచ్చయ్య రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై గోపి గాయపడ్డ వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేసి అతన్ని చికిత్స కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్సై గోపి తెలిపారు.


వివాహితకు వేధింపులు.. కేసు నమోదు
మధిర, న్యూస్‌టుడే: తనను అత్త, మామతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు మానసికంగా చంపుతానని బెదిరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గూడా అశోక్‌ తెలిపారు. రాయపట్నం గ్రామానికి చెందిన మార్నీడి పాపయ్య భార్య విష్ణుప్రియ ఫిర్యాదుతో సెక్షన్‌ 498 (ఎ), 506 ఐపీసీ కింద నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే
మండలంలోని ఆసుపాకలో శనివారం రాత్రి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. రహదారిపై వెళ్తున్న అంకతగంగయ్య, బిర్రం రమేశ్‌, దుర్గయ్యపై కుక్కలు దాడిచేశాయి. ముగ్గురికి కాళ్లపై చేతులపై పలుచోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల దాడులు తీవ్రం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఘనంగా అనాథాశ్రమంలో వార్షికోత్సవం
ములకలపల్లి, న్యూస్‌టుడే: అనాథాశ్రమంలో వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ స్వర్ణ మాట్లాడారు. చిన్నారుల పసి హృదయాలు ఎలాంటి కల్మషం లేకుండా దేవుని మనస్తత్వం కలిగి ఉంటారని ఆమె పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి జీవితంలో అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటున్నారనీ, వారికి ఈ ఆశ్రమం చేయూతనందించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందన్నారు. అనంతరం కేక్‌ కత్తిరించి చిన్నారులందరికీ మిఠాయిలు, స్వీట్లు పంచారు. ఈ ఆశ్రమానికి కొందరు దాతలు పెట్టెలు, మంచాలు వితరణ చేశారు. మండల జిప్రాని సభ్యులు అంజి, ఆశ్రమ నిర్వాహకులు శ్యాంకుమార్‌, కరుటూరి కృష్ణ, చెన్నయ్య, నబీసాహెబ్‌, నాగరాజు, వేణు, బుజ్జి, రామ్మూర్తి, శేఖర్‌,తదితరులు పాల్గొన్నారు.


స్తంభాన్ని ఢీకొన్న పత్తి లారీ
ములకలపల్లి, న్యూస్‌టుడే: పాల్వంచ-దమ్మపేట ప్రధాన రహదారిపై మాదారం వద్ద శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో అదుపు తప్పి ఓ పత్తి లారీ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఉజ్జినేని శ్రీనివాసరావు శుక్రవారం గుండాల మండలం ఆల్లపల్లిలో లారీలో పత్తి లోడ్‌ చేసుకొని వస్తుండగా శనివారం తెల్లవారుజామున మాదారం వద్ద అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపోయి విద్యుత్తు లైనులు తెగిపోయాయి. స్తంభం ఉండడంతో లారీ ఓ ఇంటి పక్కనే నేలకూలింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సంవత్సరం క్రితం ఇదే ప్రదేశం వద్ద ఓ లారీ ఉప్పునూరి రమణ ఇంట్లోకి దూసుకుపోవడంతో ఆ ఇళ్లు కూలిపోయి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్‌ నిర్మించాలని గ్రామస్థులు అధికారులకి విన్నవించినప్పటికి పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.


అటవీ జంతువుల వేట కేసులో ఆరుగురి అరెస్టు
అశ్వారావుపేట గ్రామీణం : అటవీ జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి యువకుడు మృతి చెందిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐరవికుమార్‌ అరెస్టు వివరాలను వివరించారు. 4వ తేదీ తెల్లవారుజామున మూడున్నర సమయంలో తిరుమలకుంట కాలనీకి చెందినమడకం మహేశ్‌(21)తోపాటు మరో ముగ్గురు రెడ్డిగూడెం ప్రాంతంలోఉన్న తమ పొలాల వద్దకు వెళ్లారు. రెడ్డిగూడేనికి చెందిన ఉమ్మల బుచ్చిరెడ్డి, ఉమ్మల శ్రీనివాసరరెడ్డి, యాట్ల లచ్చిరెడ్డి, ఉమ్మల ఏసురెడ్డి, యాట్ల వెంకటరెడ్డి, ఉమ్మల దాసిరెడ్డి అటవీ జంతువులను వేటాడేందుకు అదే గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతుకు చెందిన మిరప చేను చుట్టూ విద్యుత్తు తీగలు అమర్చారు. ఇదే క్రమంలో ఇంటికి వస్తున్న మహేశ్‌కు విద్యుత్తు తీగలు తాకి అక్కడిక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో విద్యుత్తు తీగలు అమర్చిన ఆరుగురు వ్యక్తులే మహేశ్‌ మృతికి కారణమన్నారు. జంతువులను వేటాడటం నిషేధమైనప్పటికీ విద్యుత్తు తీగలు అమర్చి యువకుడి మృతికి కారణమైన ఆరుగురిని శనివారం అరెస్ట్‌ చేసి సత్తుపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు. ఎస్‌ఐ కె.శ్రీను, ఏఎస్‌ఐ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


హుండీ చోరీకి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు
కామేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్త లింగాల కోట మైసమ్మతల్లి దేవాలయంలో అయిదు రోజుల కిందట హుండీ చోరీకి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లికి చెందిన అంతర్‌ జిల్లాల దొంగ ఎ. సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


పురపాలకంలోని వార్డుల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే
23వ వార్డులో రూ.18 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: పురపాలకంలోని వార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగాగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఛైర్‌పర్సన్‌ మడత రమ పేర్కొన్నారు. పట్టణంలోని 23వ వార్డులో శనివారం అంతర్గత రహదారులు, పైపులైన్‌, మురుగు కాలువల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా మంజురైన రూ.18 లక్షల అభివృద్ధి పనుల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం కౌన్సిలర్‌ రవినాయక్‌ అధ్యక్షతన ఏర్పాటైన సభలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌అంజన్‌కుమార్‌, డీఈ సంజయ్‌కుమార్‌, మడత వెంకట్‌గౌడ్‌, బాసశ్రీనివాస్‌ అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఏటీడబ్ల్యూవో
టేకులపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని గంగారం పంచాయతీ సంపత్‌నగర్‌ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఇల్లెందు ఏటిడబ్లు్యవో జి.అశోక్‌ శనివారం తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో వంటగది, స్టోర్‌, గార్మెంటరీని పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయులు దినచర్య విధిగా రాస్తున్నారో లేదో పరిశీలించారు. పదోతరగతిలో వంద శాతం ఫలితాల కోసం నిరంతర కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు బీల్యాను ఆదేశించారు.


రోళ్లపాడు జలాశయంపై పునరాలోచించాలి
టేకులపల్లి, న్యూస్‌టుడే: శ్రీరామ ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు చెరువును జలాశయంగా మార్చే ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆదివాసీ సంఘాల ఐకాస, తుడుందెబ్బ, నంగారభేరి సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో డిమాండ్‌ చేశారు. శనివారం రోళ్లపాడు గ్రామంలో రోళ్లపాడు, బీల్యాతండా, రుక్మాతండా గ్రామాలకు చెందిన ప్రజలతో అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస జిల్లా అధ్యక్షుడు వాసం రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాలను, ఆదివాసీలను నిరాశ్రయులుగా ప్రభుత్వం మార్చుతుందని అన్నారు. రోళ్లపాడు జలాశయం వల్ల మూడు గ్రామాలలో నివశించే 400 కుటుంబాలు ఆదివాసీలు, లంబాడీలే కాకుండా 2 వేల ఎకరాల పోడు భూములు, అసైన్డ్‌, పట్టా భూములు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. సమావేశంలో నాయకులు గొగ్గల రామస్వామి, కల్తి సత్యనారాయణ, పూనెం కోటయ్య, సనపా కోటేశ్వరరావు, శివనాయక్‌, ఎన్డీ నాయకులు కె.వెంకటేశ్వర్లు, ఎస్‌.వెంకటేశ్వర్లు, ఇ.వెంకటేశ్వర్లు, వీరభద్రం పాల్గొన్నారు.


శంకుస్థాపనకు ముందే నిర్వాసితుల విషయం తేల్చాలి
ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందే ఆయకట్టు రైతులు, నిర్వాసితుల విషయంలో స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బయ్యారం జడ్పీటీసీ గౌని ఐలయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాట చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మన్యం మండలాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా ప్రాజెక్టు రూపకల్పన చేయాలని డిమాండ్‌ చేశారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం సమీప మన్యం ప్రాంతాలను విస్మరించిందని విమర్శించారు. ఈ సమావేశంలోజె.సీతారామయ్య, నాయిని రాజు, టి.నాగేశ్వరరావు, సారంగపాణి పాల్గొన్నారు.


ప్రభుత్వ వైద్యశాల ఎదుట ధర్నా
ఇల్లెందు పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతమైన ఇల్లెందు ఏరియా 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఎన్డీ, పీడీఎస్‌యూ, పీవైఎల్‌ డివిజన్‌ నాయకులు రవి, ప్రభంజన్‌ ఆరోపించారు. ఈ మేరకునాయకులు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ప్రదర్శన నిర్వహించి వైద్యశాల ఎదుట శనివారం ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో వైద్యచికిత్సల కోసం వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండకుండా ఇష్టానుసారంగా వచ్చిపోతున్నారని పేర్కొన్నారు. గణేశ్‌, ప్రశాంత్‌, ఈశ్వర్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


సీతంపేటలో శ్రీరామ హోమం
సీతంపేట(గార్ల), న్యూస్‌టుడే: సీతంపేటలోని రామాలయం నిర్మించి పదమూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆదివారం ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో శ్రీరామ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు తిర్నగరి స్వామి వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. సర్పంచి లావణ్య, మంప్రాని సభ్యురాలు వూరుకొండ ఉమ, ఆలయకమిటీ చైర్మన్‌బి.వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


మిత్రసేన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు
టేకులపల్లి, న్యూస్‌టుడే: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు వగ్గెల మిత్రసేన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆయన మృతికి కాంగ్రెస్‌ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నియోజకవర్గ నాయకుడు భుక్యా దళ్‌సింగ్‌, మండల నాయకులు కాలె ప్రసాదరావు, కళత్తూరి మునుస్వామి, గుండా నర్సింహారావు, బండ్ల శ్రీనివాసరావులు సంతాపం వ్యక్తం చేశారు. మిత్రసేన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.


పరిహారం చెల్లించాకే నిర్మాణం చేపట్టాలి
టేకులపల్లి, న్యూస్‌టుడే: టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు జలాశయం నిర్మాణం ముంపునకు గురయ్యే రోళ్లపాడు, రుక్మాతండా, బీల్యాతండా గ్రామాలకు చెందిన గిరిజనులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దేవులపల్లి యాకయ్య, మండల కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం నాయకులు రోళ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. పీసా చట్టం ప్రకారం గ్రామ సభ జరిపకుండా, హడావిడిగా శంకుస్థాపన చేపట్టడం సరైంది కాదని అన్నారు. నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, సరైన ప్యాకేజి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న, భాస్కర్‌, రమేశ్‌, రాము, కోటేశ్వరి పాల్గొన్నారు.

బీ ప్రజల అభిప్రాయం మేరకే రోళ్లపాడు జలాశయం నిర్మించాలని జేఎంబి గిరిజన సేవా సంఘ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల అధ్యక్షుడు రవికుమార్‌, రాంబాబు, బాబూరావు, రవి, దళ్‌సింగ్‌లు పాల్గొన్నారు.పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన
కామేపల్లి, న్యూస్‌టుడే: పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికిగాను శనివారం కొత్తలింగాలలో స్థలాన్ని కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్‌ పరిశీలించారు. తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ డివిజన్‌ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 12 పెట్రోల్‌ బంక్‌ స్థలలను పరిశీలించడం జరిగిందన్నారు. వీఆర్‌వోలు విధిగా స్థానిక రెవెన్యూ గ్రామాల్లో ఉండాలన్నారు. చౌక దుకాణాలను సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. దృవీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహశీల్దారు కె. లక్ష్మణస్వామి, ఆర్‌ఐలు సుధీర్‌, లక్ష్మీనారాయణ, వీఆర్‌వోలు సత్యం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


ఉపాధ్యాయుని మృతికి సంతాపం
టేకులపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని సంపత్‌నగర్‌ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బాడిశ ఎర్రయ్య (39) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గేటు కారేపల్లి ఏజీహెచ్‌ఎస్‌లో క్రాఫ్ట్‌ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆకాల మరణం మృతి చెందారు. సంపత్‌నగర్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, అక్కడే తొమ్మిదేళ్లపాడు క్రాఫ్ట్‌ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఎర్రయ్యకు భార్య నాగమణి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఎర్రయ్య మృతికి సంపత్‌నగర్‌ ఏహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు బీల్యా, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. ఏటీఎఫ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మోకాళ్ల శ్రీనివాసరావు, మండల నాయకులు పాయం ఆనందరావు, నాగేశ్వరరావులు సంతాపం వ్యక్తం చేశారు.


 
Untitled Document
వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి పోటీ: తమ్మినేని
ఖమ్మం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా పోట్ల
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
ఆగి ఉన్న కారును... ఆపబోయిన వ్యక్తిని ఢీకొన్న లారీ
వివాహితకు వేధింపులు.. కేసు నమోదు
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
ఘనంగా అనాథాశ్రమంలో వార్షికోత్సవం
స్తంభాన్ని ఢీకొన్న పత్తి లారీ
అటవీ జంతువుల వేట కేసులో ఆరుగురి అరెస్టు
హుండీ చోరీకి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు
పురపాలకంలోని వార్డుల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఏటీడబ్ల్యూవో
రోళ్లపాడు జలాశయంపై పునరాలోచించాలి
శంకుస్థాపనకు ముందే నిర్వాసితుల విషయం తేల్చాలి
ప్రభుత్వ వైద్యశాల ఎదుట ధర్నా
సీతంపేటలో శ్రీరామ హోమం
మిత్రసేన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు
పరిహారం చెల్లించాకే నిర్మాణం చేపట్టాలి
పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన
ఉపాధ్యాయుని మృతికి సంతాపం
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net