Tuesday, February 09, 2016


Untitled Document
Comments
0
Recommend
0
Views
232
పరీక్షమార్హం.. కాదు
జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రయోగశాలలు
వైద్యులకు వాటాలతో రూ.లక్షల్లో లాభార్జన
చోద్యం చూస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ
నగరంలోని గాయిత్రీ ఎస్టేట్‌లో మూడు సంవత్సరాల క్రితం వెలిసిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు నగరంలోని సింహభాగం పరీక్షలు రాస్తుంటారు. కారణం ప్రతి వైద్యునికి వారి క్లినిక్‌ను బట్టి నెలకు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ ‘కానుక’లు ఇస్తుంటారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం పొందే ఈ కేంద్రానికి మూడు నెలల తాత్కాలిక అనుమతే ఉంది. వీరికి నంద్యాలలో మరో కేంద్రం ఉండగా దీనికి అనుమతే లేకపోవడం గమనార్హం.

* జిల్లాలో 290 ప్రైవేటు నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు ఉన్నాయి. ఇందులో 26 ప్రయోగశాలలు కేంద్రాలకే అనుమతి ఉంది. వీటిలోనూ చాలా వరకూ నిబంధనల ప్రకారం రిజిస్టర్‌ చేయించుకున్నా.. అనుమతి పునరుద్ధరణ చేసుకోలేదు.

కర్నూలు (వైద్యాలయం), న్యూస్‌టుడే : మందుల కంపెనీల నుంచి కానుకలు అందుకునే వైద్యులపై కఠినంగా వ్యవహరించడానికి భారత వైద్యమండలి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రయోగశాలల విషయంలోనూ చర్యలకు ఉపక్రమించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటి నుంచి కమీషన్లు, వాటాలు కలిగి ఉన్న వైద్యులపై నిఘా ఉంచాల్సి ఉందని చెబుతున్నారు. జిల్లాలో వీటి పరిస్థితి ఎలా ఉందో చూడండి...

నగరానికి చెందిన వెంకటేశ్వర్లకు చిన్న జ్వరం, తలనొప్పి వస్తే ప్రైవేటు వైద్యుని దగ్గరకి వెళ్లారు. వెంటనే రక్త పరీక్షలు, సీటీ స్కానింగ్‌ రాయించారు. ఎందుకు సార్‌ అంటే... మీకే మంచిది. చెక్‌ చేస్తే దేనికి చికిత్స చేయాలో అర్థం అవుతుంది కదా అన్నాడు వైద్యుడు. దీంతో సీటీ స్కానింగ్‌కు రూ. 2500, పరీక్షలకు రూ.1500 ఖర్చు అయ్యాయి. స్కానింగ్‌ చూసి తలలో ఏమీ లేదమ్మ వైరల్‌ జ్వరమని మందులు రూ. 750 రాసి, ఫీజు రూ. 250 తీసుకొన్నాడు. రోగులకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. వైద్యం ఖర్చు ఒకటైతే.. పరీక్షల ఖర్చు పదింతలు అవుతోంది. అవసరం ఉన్నా.. లేకున్నా ప్రై‘వేటు’ వైద్యులు సవాలక్ష పరీక్షలు రాసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రత్యేకించి తమ ఆసుపత్రుల్లోనే వాటిని ఏర్పాటు చేసి, పరోక్ష దోపిడీకి తెరతీస్తున్నారు. ఇంత చేస్తున్నా ఈ కేంద్రాలకు ప్రభుత్వ పరంగా అనుమతులు లేకపోవడం ప్రస్తావనార్హం. దీంతోపాటు నిపుణులు లేని వ్యక్తులు చేసే ఈ పరీక్షల్లో నిర్ధారణ సామర్థ్యం ఎంతో ఆలోచించాలి.

దోచుకున్న వారికి దోచుకున్నంత
జిల్లాలో ప్రైవేటు వైద్యాలయాల్లో పరీక్షల పేరుతో బహిరంగంగా దోపిడీ జరిగిపోతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు వైద్యాలయాల్లో అనుమతి లేకుండా సీటీ స్కానింగ్‌లు, డయోగ్నోస్టిక్‌ కేంద్రాలు, వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా వీటివైపువైద్యశాఖ దృష్టి సారించడం లేదు. వాస్తవానికి నెల నెలా అధికారులు 10 నుంచి 15 శాతం వరకు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి, నిబంధనలు పాటిస్తున్నాయో? లేదో? పర్యవేక్షించాలి. నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రులు, కేంద్రాలపై కేసులు నమోదు చేయాలి. జిల్లాలో రెండుసంవత్సరాలనుంచి ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్‌ సెంటర్‌, డయాగ్నస్టిక్‌, ప్రయోగశాలలపై దాడులు చేసిన దాఖలాలు లేవు. రిజిస్టర్‌ సంగతి దేవుడెరుగు.. ఇందులో నిపుణులైన వారు పరీక్షలను చేస్తున్నారో లేదో తెలిసే పరిస్థితి లేదు. ఇందువల్ల వివిధ పరీక్షలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు
* చట్టప్రకారం ఒక చిన్న ఇంజెక్షన్‌ ఇవ్వాలన్నా.. ప్రభుత్వ పరంగా అనుమతి పొంది ఉండాలి. రిజిస్ట్రేన్‌, గుర్తింపు లేకుండా కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో ఏకంగా ప్రయోగశాలలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు రోగుల నుంచి గుంజేస్తున్నాయి.

* కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించే కొన్ని నర్సింగ్‌ హోంలు అనుమతి లేకుండా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు నడుపుతున్నాయి.

* ఇటీవల జిల్లా విజిలెన్సు అధికారులు అనుమతులు లేకుండా వైద్యం కొనసాగిస్తున్న నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల వివరాలు ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు ఇవీ
* నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు నెలకొల్పాలంటే సంబంధిత వ్యక్తులు అందులో నిపుణులై ఉండాలి. ప్రభుత్వం నుంచి రిజిస్టర్‌ పొందిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. ఆయా పరిధుల అనుసారంగా అగ్నిమాపక, గ్రామ పంచాయతీ, పుర, నగరపాలక సంస్థల నుంచి అనుమతి పొంది ఉండాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకుంటే వారు 3 నెలలు తాత్కాలిక అనుమతి ఇస్తారు. అన్ని ఉన్న తరువాత వారికి 5సంవత్సరాల అనుమతి ఇస్తారు.

* నిర్వాహకులు ఆయా పరీక్షలకు తీసుకునే ఫీజు బోర్డుపై రాసి పెట్టాలి.
* ప్రభుత్వ అనుమతి పత్రం, నిపుణుల అర్హత పత్రం అందుబాటులో ఉంచాలి.
* ఆపైన అధికారులు తనిఖీ చేసి, అన్ని సదుపాయాలు ఉన్నట్లు ధ్రువీకరించుకొని ఐదేళ్లు అనుమతి ఇస్తారు.
* ప్రతి ల్యాబ్‌, క్లినిక్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ కచ్చితంగా అనుమతి, గుర్తింపులను పునరుద్ధరించుకోవాలి.
* అనర్హులను గుర్తిస్తే అధికారులు వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది. అలాగే సంబంధిత కేంద్రాలను సీజ్‌ చేస్తారు.

అనర్హులు వైద్య పరీక్షలు చేస్తే నష్టాలివీ..
* నిపుణత లేకుండా వివిధ రకాల పరీక్షలు చేయడం నేరం. ఇంకా వారిచ్చే వ్యాధి నిర్ధారణ ఏమేరకు నిజమైందో చెప్పలేం.
* అనుమతి లేకుండా ఇతరులు పరీక్షలు చేసి ఇచ్చే నివేదికలు భవిషత్తులో ఆరోగ్య పరంగా తీరని నష్టం కలిగించవచ్చు.
* వైద్య పరీక్షలు ఇచ్చే నివేదికల ఆధారంగా చేసే చికిత్సల వల్ల రోగులు మరణించినా చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు.
* ప్రభుత్వ పరంగా అందాల్సిన పరిహారం అందకపోవచ్చు.

అనుమతి ఉంటే లాభాలివీ..
* వైద్య సేవల్లో మనకు నష్టం జరిగిందని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
* అర్హులే పరీక్షలు, చికిత్సలు అందిస్తారు.
* ఫీజులు, వైద్య సదుపాయాల విషయంలో ప్రభుత్వ నిబంధనలతో పోల్చి చూసుకోవచ్చు.
* వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వాన్ని తెలుసుకోవచ్చు.

చర్యలు తీసుకుంటాం
- శారద, వైద్యాధికారిణి
నేను కొత్తగా వచ్చాను. అనుమతి లేని వాటిని పరిశీలించి రెండు నెలల్లో చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా పరీక్షలు చేయడం నేరం. ఇలాంటి వాటిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం.

Untitled Document
గొలుసు దొంగలు అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాత
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
అప్పు ఇవ్వలేదని దాడి
సార్వత్రిక సమ్మెపై అభిప్రాయ సేకరణ
మహిళా సంఘాలతోనే సాధికారత సాధించాం
ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించారు
అక్రమ లీజు రిజిస్ట్రేషన్‌ రద్దు
10న నులిపురుగుల నివారణ మందుల పంపిణీ
డీఎస్సీ జాబితా మరింత ఆలస్యం
ఐటీఐ బ్రిడ్జి కోర్సులకు దరఖాస్తులు
ఇక్కడి సంపద దోచుకెళ్తున్నారు
ఆలయాల ఆస్తులు పరిరక్షించాలి
తక్కువ వ్యవధిలో పశుగ్రాసం
కొత్త రేషన్‌కార్డుల్లో పేర్ల నమోదు
మనస్సు తల్లడిల్లింది..కర్తవ్యం బోధపడింది
హెచ్‌వీడీఎస్‌ గుత్తేదారులకు తాఖీదులు
అన్నదానానికి విరాళం
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి: ఈఓ
మల్లన్నసేవలో దేవాదాయశాఖ ఆర్థిక సలహాదారు
అరుదైన పాము కాదు: ఏసీఎఫ్‌
శ్రీశైలంలో జలమట్టం 825.6 అడుగులు
మల్లన్నకు వెండి రథోత్సవం
అన్ని గ్రామాలకు తాగునీరు అందేలా చర్యలు
పంటలకు ప్రాణం పోశారు
18,143 మంది కార్డుదారులకు వూరట
పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్‌ సమీక్ష
రెండు ఇసుక రేవులకు వేలం
అధికారే లేరు..వ్యవ‘సాయం’ ఎక్కడ
నేత అనుచరులు.. ఇసుకాసురులు
మల్లన్న బాట.. ముళ్లన్నమాట
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net