గురువారం, జనవరి 19, 2017

జనరల్

వైద్యఆరోగ్యశాఖ ఒప్పంద ఉద్యోగులకు తీపి కబురు
క్రమబద్ధీకరణ దిశగా అడుగులు
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే : ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మొదట వైద్య ఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కొంత మంది సిబ్బంది ధ్రువపత్రాలను పరిశీలించాలని పేర్కొంది. జిల్లాలో 2001లో ప్రభుత్వ ఉత్తర్వు 16 ప్రకారం పలువురు సిబ్బంది నియమితులయ్యారు. వీరిలో ల్యాబ్‌ టెక్నీషియన్లు 26, ఫార్మసిస్టులు 24, అప్థాల్మిక్‌ సహాయకుడు 1, ఏఎన్‌ఎంలు 18 మంది ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలతో ఈ నెల 20న హైదరాబాద్‌కు రావాలని సూచించారు. దీంతో వారి ధ్రువపత్రాలను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పరిశీలించారు. ఇంకా వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్‌ అసిస్టెంట్లు, వైద్యులు, స్టాఫ్‌నర్సులతోపాటు వివిధ పోస్టుల్లో చాలా మంది పని చేస్తున్నారు. వారిని కూడా విడతల వారీగా రెగ్యులరైజ్‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒప్పంద ఉద్యోగుల ధ్రువపత్రాలను పరిశీలించాలని ఉన్నతాధికారులు చెప్పారని, వారిని క్రమబద్ధీకరించే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.