close

శుక్రవారం, అక్టోబర్ 19, 2018

తాజా వార్తలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి
భైంసాలో రాహుల్‌గాంధీ సభాస్థలిని పరిశీలించిన కేంద్ర అధికారులు
భైంసా పట్టణం, న్యూస్‌టుడే : భైంసాలో ఈ నెల 20న నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభలో లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని కేంద్ర ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) ఏఐజీ సుబేసింగ్‌యాదవ్‌ సూచించారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ భైంసాలో భారీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సభ నిర్వహణకు పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి వద్ద ఎంపిక చేసిన సభాస్థలాన్ని ఎస్పీజీ ఏఐజీ సుబేసింగ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం భైంసా చేరుకుంది. సభ నిర్వహణకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, స్థానిక అధికారులు భైంసా పట్టణంలోని పార్డి(బి) బైపాస్‌ రహదారి పక్కన స్థలాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు వివిధ శాఖల జిల్లా, స్థానిక అధికారులు, కాంగ్రెస్‌పార్టీ నేతలతో సభావేదిక, సభా ప్రాంగణం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు, భద్రతా చర్యలు, సౌకర్యాలు తదితరాలపై చర్చించారు. మూడంచెల భద్రత ఉంటుందన్నారు. సభకు ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 19న మధ్యాహ్నం 1.30కే ఏర్పాట్లు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి కేంద్ర రక్షణ అధికారుల బృందం ఇక్కడ తనిఖీలు చేపడుతుందన్నారు. సభావేదికపై పరిమితికి మించి ఎవరినీ అనుమతించొద్దన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులకు సబంధిత బాధ్యతలను అప్పగిస్తూ తగిన సూచనలు, సలహాలు చేశారు. సమావేశంలో ఎస్పీజీ దిల్లీ అధికారులు మణీష్‌పారిక్‌, పి.నర్సిరెడ్డి, ఎన్వీసిమ్‌, జేసీ భాస్కరరావు, ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణమూర్తి, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, మాజీ శాసన సభ్యుడు బి.నారాయణరావు పటేల్‌, ముథోల్‌ నియోజకవర్గ నాయకులు రామారావు పటేల్‌, మోహన్‌రావు పటేల్‌ ఆర్డీవో రాజు, డీఎస్పీ రాజేశ్‌భల్లా, ఆర్‌అండ్‌బీ డీఈఈ రవీందర్‌రెడ్డి, డిస్కం ఎస్‌ఈ జాడేఉత్తం, ఎంవీఐలు అజయ్‌కుమార్‌రెడ్డి, రాంచందర్‌రావు, డీఎంహెచ్‌వో జలపత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.