గురువారం, జనవరి 19, 2017

జనరల్

అమ్మనాన్నలకు పాఠాలు
8, 9 తరగతి విద్యార్థులకు గురుతర బాధ్యత
సాక్షరభారత్‌లో నూతన ప్రక్రియకు శ్రీకారం
న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట
నిరక్షరాస్యులైన తమ తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం కల్పించేందుకు అమ్మానాన్నలకు చదువు పేరిట సాక్షరభారత్‌ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో విద్యార్థులే వారి తల్లిదండ్రులకు చదువు నేర్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకునే 8, 9 వ తరగతుల విద్యార్థులకు ఈ గురుతర బాధ్యతను అప్పగిస్తున్నారు. సాక్షరభారత్‌ ద్వారా చేపడుతున్న అమ్మనాన్నకు చదువు అనే కార్యక్రమంపై ‘న్యూస్‌టుడే’ కథనం..

పిల్లలే గురువులుగా..
చిన్నతనంలో చదువుకోవడానికి ఎలాంటి ప్రోత్సాహం లేకుండా నిరక్షరాస్యులుగా మిగిలిపోయి వారికి ప్రభుత్వం అక్షరజ్ఞారం కల్పించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిది, తొమ్మిది తరగతి విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రుల్లో ఎంత మంది నిరక్షరాస్యులో ఉన్నారో గుర్తించి వారి ద్వారానే పాఠాలు బోధించే కార్యక్రమాలు అమలు చేయడానికి నిర్ణయించింది. దీనికోసం సాక్షరభారత్‌ సిబ్బంది విద్యాశాఖ సాయంతో విద్యార్థుల వివరాలు సేకరించి వారిలో నిరక్షరాస్యులను గుర్తించారు. సాక్షరభారత్‌ కార్యక్రమంలో అయిదో విడతలో అభ్యసకులకు విద్యనందిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో దశలో ఈ అమ్మానాన్నకు చదువు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గత డిసెంబరు వరకు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యులను గుర్తించారు. ఇటీవల వారికి సాక్షరభారత్‌ సిబ్బంది పుస్తకాల పంపిణీ చేశారు. గతంలో ఉపాధి హామి పథకంలో మేట్ల ద్వారా క్షేత్ర స్థాయిలో నిరక్షరాస్యులైన ఉపాధి కూలీలకు అక్షరజ్ఞానం కల్పించాలని కార్యక్రమం చేపట్టారు. అది ఆచరణలో విఫలం కావడంతో వయోజనులకు విద్య అందకుండా పోయింది.

రెండు తరగతుల వారే ఎందుకంటే..!
ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయడానికి అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. వీరు ఉన్నత తరగతులు చదువుతుండటం ఒకటి, ఎక్కువగా ఇంటి వద్ద ఉండటం ఓ కారణం. ఒకరోజు తప్పినా మరో రోజు అక్షరాలు నేర్పించడం కుదురుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులను వారి చదువుకు ఆటంకం కలుగకుండా, వార్షిక ఫలితాలపై ప్రభావం కనిపించకుండా దూరం పెట్టారు.

పుస్తకాల పంపిణీ ఇలా..
జిల్లాలోని 20 మండలాల్లో 336 గ్రామపంచాయతీల్లో 36,379 మంది వయోజనులను గుర్తించి వారికి పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టారు. రంగులు, బొమ్మలతో సులభంగా అక్షరాలు గుర్తించే విధంగా ప్రచురించిన పుస్తకాలను తల్లిదండ్రులకు, వారి పిల్లలకు కలిపి అందిస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో మండల సమన్వయకర్తలు, గ్రామసమన్వయకర్తలు గుర్తించిన వయోజనులకు ఇంటింటికీ వెళ్లి పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఒక వాచకం, ఒక ఉపవాచకం పుస్తకాలను ఒక కుటుంబానికి అందించేలా పంపిణీ చేపట్టారు. జిల్లాలో సాక్షరభారత్‌ కార్యక్రమం అంతటా మొక్కుబడిగా సాగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ నూతన కార్యక్రమమైనా నేర్చుకోవాలన్న ఆకాంక్షను నెరవేరుస్తుందా లేదా వేచి చూడాల్సి ఉంది.

మండలాలు : 20
గ్రామపంచాయతీలు : 336
గ్రామసమన్వయకర్తలు : 665
నిరక్షరాస్యులైన వయోజనులు : 36379

నిరక్షరాస్యులను గుర్తించాం: గోవింద్‌రావు సాక్షరభారత్‌ ప్రాజెక్ట్‌ మెదక్‌ జిల్లా అధికారి
సాక్షరభారత్‌లో అయిదో విడతలో రెండో దశ కొనసాగుతోంది. ఈ దశలో వచ్చే మూడు నెలల్లో 18 నుండి 50 ఏళ్లున్న నిరక్షరాస్యులను గుర్తించి వారి పిల్లలు ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుకునే వారికి పుస్తకాలు అందించి వారితోనే బోధించేలా సూచనలు అందిస్తున్నాం. ఇటీవల అన్ని మండలాల్లో సర్వే చేసి నిరక్షరాస్యులను గుర్తించాం. ఇటీవల పలు మండలాల్లో పుస్తకాల పంపిణీ చేపట్టాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.