గురువారం, జనవరి 19, 2017

జనరల్

వాగులో.. అక్రమం..
జోరుగా ఇసుక అక్రమ రవాణా
చోద్యం చూస్తున్న అధికారులు
న్యూస్‌టుడే, నర్సాపూర్‌
గతేడాది కురిసిన భారీవర్షాలకు పెద్దమొత్తంలో ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఇంకేముంది నర్సాపూర్‌ మండలం మూసాపేట కేంద్రంగా వాగులు, వంకలు ఏవీ వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తూ అక్రమంగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం నిర్మాణాలు భారీగా సాగుతుండగా ఇందుకు ప్రధానంగా కావాల్సిన ఇసుక ధరలు ఆకాశాన్నంటాయి. ఇంకేముంది అక్రమార్కులు విజృంభించారు. వాగు నుంచి పెద్దఎత్తున ఇసుకను తరలిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

భలే డిమాండ్‌..
నిర్మాణాలకు ఉపయోగించే ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విజయవాడ, కరీంనగర్‌, కర్నూలు, నిజామాబాద్‌, భద్రాచలం, కాళేశ్వరం తదితర ప్రాంతాల నుంచి నుంచి నర్సాపూర్‌కు ఇసుక లారీలు వస్తుంటాయి. ఒక్కో లారీలో 20 నుంచి 25 టన్నుల వరకు ఉండే ఇసుకకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పలుకుతుంది. పై ప్రాంతాల నుంచి వస్తుండటం, ధరలు పెరిగిపోవడంతో స్థానికంగా లభిస్తున్న ఇసుకకు డిమాండ్‌ పెరిగింది.

మూసాపేట కేంద్రంగా..
నర్సాపూర్‌ మండలంలోని మూసాపేట వాగు కేంద్రంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఈ వాగులో ఎక్కడ చూసినా పెద్దమొత్తంలో ఇసుక తరలించిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ లభించే ఇసుక దూరప్రాంతాల నుంచి లారీల్లో తరలిస్తున్న ఇసుక మాదిరి ఉండటంతో అందరూ దీనికోసం ఎగబడుతున్నారు. నిత్యం ట్రాక్టర్ల కొద్దీ ఇసుక తరలిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. వాగు పొడవునా ఇసుక తరలించిన తవ్వకాలు సాక్ష్యాలుగా అగుపిస్తాయి. ఫిల్టర్‌ చేయకుండానే నేరుగా నిర్మాణాలకు ఉపయోగించే ఇసుక కావడంతో అక్రమార్కుల కన్ను ఈ వాగుపై పడింది. ఇప్పటికే రూ.లక్షలు విలువ చేసే వనరు తరలిపోగా, ప్రభుత్వానికి ఆదాయం గండి పడింది.

అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు
- వెంకటేశ్వర్లు, ఆర్డీవో, నర్సాపూర్‌
అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవానికి ఇసుక తరలింపునకు అనుమతి కోరే వారు ఒక్కో ట్రాక్టరుకు రూ.120 చొప్పున ప్రభుత్వ ఖజానాకు చలానా ద్వారా చెల్లించాలి. అభివృద్ధి పనులకు ఇసుక అవసరమైతే సంబంధిత శాఖ ఈఈ, డీఈ నుంచి లేఖను తహసీల్దారుకు ఇవ్వాలి. సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అక్కడ అందుబాటులో ఉంచి ఆయన సమక్షంలో నిర్ణీత వేళ్లల్లోనే ఇసుకను తీసుకువెళ్లాలి. ఈ నిబంధనలు పాటిస్తేనే ఇసుకను తరలించడానికి అనుమతిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.