Sunday, February 14, 2016


Untitled Document
పూర్తయిన ధ్రువపత్రాల పరిశీలన
పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: డీఎస్సీ నియామకాలకు సంబంధించి సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో ముగిసింది. 100 మందికి అందరూ హాజరయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అందరి వివరాలు సరిపోయాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వానికి ఈనెల 16లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. అనంతరం ప్రభుత్వం తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరోసారి అధికారికంగా వెల్లడిస్తుంది.

ఘనంగా ఎమ్మెల్యే ‘కలమట’ కుమార్తె వివాహం
కొత్తూరు, పాతటప్నం, న్యూస్‌టుడే:కొత్తూరు మండలం మాతల గ్రామంలో శనివారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె హారిక, జగదీష్‌ వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకలకు రాష్ట్ర నలుమూలలతో పాటు సమీప ఒడిశా రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, అధికారులు తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదించిన వారిలో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జడ్పీ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, గౌతు శ్యామసుందశివాజీ, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్‌, కలెక్టర్‌ డా.పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ ఎ.ఎస్‌.ఖాన్‌, ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు, ఒడిశా రాష్ట్రం పర్లాఖిముండి ఎమ్మెల్యే సూర్యారావు, విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, వైకాపా అగ్రనేతలు విజయసాయిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఆయన సతీమణి ఇందిర, కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌.ఐ. విజయకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


15 నుంచి ప్రభుత్వ ఒప్పంద వైద్యుల సమ్మె
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణికి నోటీసు
న్యూస్‌టుడే-గుజరాతీపేట(శ్రీకాకుళం):
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యులు 15వతేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నారు. జిల్లాలో 34 మంది వివిధ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద పద్ధతిన సేవలందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఒప్పంద వైద్యులను నియమించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో మనస్తాపం చెంది నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని తెదేపా హామీ ఇవ్వడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా తాము వైద్యసేవలు అందిస్తున్నామని, దీన్ని పట్టించుకోకుండా మళ్లీ ఒప్పంద నోటిఫికేషన్‌ వేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నామని వివరించారు. ఈనెల 15న విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ వద్ద సమ్మె చేపడుతున్నామని వీటిల్లో దశలవారీగా జిల్లా నుంచి వైద్యులు పాల్గొంటారు. ప్రభుత్వం నుంచి తమను రెగ్యులర్‌ చేసేందుకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు సమ్మె వీడేది లేదని ఒప్పంద వైద్యులు చెబుతున్నారు. ఒప్పంద వైద్యులంతా శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ రెడ్డి శ్యామలను కలిశారు. సమ్మెలోకి వెళుతున్నామని తెలియజేసి నోటీసు అందజేశారు.


వేతనదారులకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు
కలెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీనృసింహం
శ్రీకాకుళం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా వేతనదారులకు ఎక్కువ రోజులు పని దినాలు కల్పించి అధిక వేతనాలు అయ్యేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో భవనాలు, రహదారులు వంటి ఆస్తులు సృష్టించేలా ప్రణాళికలు తయారు చేసి ఆ దిశగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం చేపడుతున్న పంచాయతీ కార్యాలయ భవనాలతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్దేశిత లక్ష్యాలు మేర సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకం ద్వారా జిల్లాలో 20 వేల బోర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


సత్వర న్యాయం లోక్‌ అదాలత్‌ ధ్యేయం
జిల్లా జడ్జి వి.అప్పారావు
శ్రీకాకుళం(లీగల్‌), న్యూస్‌టుడే: లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి వి.అప్పారావు తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లను ఆయన శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ ద్వారా త్వరగా న్యాయంతో పాటు ఇరు వర్గాలు గెలిచినట్లవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.అన్నపూర్ణ, అదనపు జిల్లా జడ్జి జి.గౌతంప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, పాలిశెట్టి మల్లిబాబు, ఎ.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీ ద్వారా పరిష్కరించిన 2012 సంవత్సరం కేసును పరిశీలించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్న అదాలత్‌కు ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. వీటికి అదనపు జిల్లా జడ్జి జి.గౌతంప్రసాద్‌, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.రాజేంద్రప్రసాద్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.పద్మావతి, రెండో తరగతి మేజిస్ట్రేట్లు పి.రామారావు, వి.ఎస్‌.ఎస్‌.కేశవరావులు నేతృత్వం వహించారు.

1615 కేసుల పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్‌లో 1615 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.అన్నపూర్ణ తెలిపారు. సివిల్‌ దావాలు 72, క్రిమినల్‌ కేసులు 1202, ప్రీలిటికేషన్‌ 341 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.కథానిలయంలో పుస్తకాల ఆవిష్కరణ
శ్రీకాకుళం(సాంస్కృతిక),అరసవల్లి న్యూస్‌టుడే: శ్రీకాకుళంలోని విశాఖ‘ఎ’కాలనీలో కథానిలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కథానిలయం అధ్యక్షుడు డా.బి.వి.రామారావు నాయుడు అధ్యక్షతన జరిగిన సభాకార్యక్రమంలో ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావు మాస్టారు ముఖ్యఅతిథిగా పాల్గొని వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ల సంకలనం పాతికేళ్ల కథ, బద్రి కూర్మారావు రాసిన కళింగాంధ్ర జానపద గేయాల పుస్తకాలను ఆవిష్కరించారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు కళింగాంధ్ర జానపద గేయాల పుస్తక సమీక్ష చేశారు. కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు పాతికేళ్ల కథ పుస్తక పరిచయం చేశారు.ఈ కార్యక్రమంలో బద్రి కూర్మారావు జానపద గేయాలను ఆలిపించారు.కథానిలయం సభ్యులు దాసరి అమరేంద్రం స్వాగతవచనాలతో ప్రారంభమైన సభలో రచయితలు కలిశెట్టి లక్ష్మీనారాయణ, రామతీర్థ, కథానిలయం ఉపాధ్యక్షుడు రమణమూర్తి, సభ్యులు కాళీపట్నం సుబ్బారావు, వివినమూర్తి, కణుగుల వెంకటరావు, విశ్రాంత అధ్యాపకులు రెడ్డి శాస్త్రిపలువురు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ముందుగా స్వీయ పరిచయాలు, అనంతరం చర్చాగోష్ఠి జరిగింది.

నేడు కథానిలయం వార్షికోత్సవసభ
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్‌ హాలులో ఆదివారం ఉదయం 10 గంటలకు కథానిలయం 19వ వార్షికోత్సవ సభ, కారా మాస్టారుకు సత్కారం, పలువురు సాహితీవేత్తల ఉపన్యాసం ఉంటుంది.‘వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం విఫలం’
కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పింఛనుదార్లకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీ పింఛనుదార్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక విశ్రాంత భవనంలో రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛనుదార్ల నుంచి ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేస్తున్నప్పటికీ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందడం లేదన్నారు. డీఏ మంజూరు చేయడంలో జాప్యం చేస్తుండడంతో నెలల తరబడి బకాయిలు కోల్పోయి ఆర్థికపరమైన నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి చింతాడ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛనుదార్లు విడిపోయి వివిధ సంఘాలుగా ఏర్పాటు కావడం వల్ల హక్కుల కోసం పోరాటాలు చేయలేకపోతున్నామని అన్నారు. అందరూ సమైక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారావు, సహ అధ్యక్షుడు ప్రదాన ఆదినారాయణ, విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు పి.అప్పారావు, విశాఖ జిల్లా అధ్యక్షుడు డీడీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


కేంద్రానికి ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల దస్త్రాలు
యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు
కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పాఠశాల ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల దస్త్రాలను కేంద్రానికి పంపినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ సముదాయం సమీపంలో నూతన కార్యాలయ భవనానికి జిల్లా యూటీఎఫ్‌ కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలికోన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉద్యమించాలన్నారు.యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గిరిధర్‌ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి నెలాఖరు వరకు పాఠశాలల్లో పర్యటన చేస్తూ వసతులు, మౌలిక సదుపాయాలపై పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్‌.మోహనరావు, ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


శ్రీకూర్మనాథాలయంలో పూజా కార్యక్రమాలు
* ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, నిత్యాభిషేకం, నిత్యార్చన, ప్రాభోదిక, తిరువారాధన, మంగళాశాసనం, బాలభోగం, సర్వదర్శనం.
* మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగం, సర్వదర్శనం.
* సాయంత్రం 7.30 గంటలకు నిత్య తిరువారాధన, మంగళాశాసనం.
* రాత్రి 8 గంటలకు పవళింపుసేవ.
- న్యూస్‌టుడే, గార


జీఎమ్మార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో..
రాజాం, న్యూస్‌టుడే : రాజాం పట్టణంలోని జీఎమ్మార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం సందర్శించనున్నారు. కళాశాలలోని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారని సమాచారం. స్టాఫ్‌ క్వార్టర్స్‌, సోలార్‌ వ్యవస్థను గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గవర్నర్‌ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో రాజాం పట్టణ, గ్రామీణ సీఐలు శంకరరావు, శేఖర్‌బాబులు బందో బస్తు పర్యవేక్షిస్తున్నారు. 250 మంది వరకు పోలీసులను నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


శ్రీముఖలింగేశ్వర దర్శనం
ఆదివారం వేకువజామున 5 గంటలకు సుప్రభాతసేవ. 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సర్వదర్శనం. ఆ సమయంలో శివ పంచాయితనములో ఉన్న సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు. 12.30 గంటల నుంచి ఒంటి గంటవరకు అన్నభోగం. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు కవాట బంధనం. 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం. 5.30 గంటలకు నీరాజనం. 6 గంటల నుంచి విష్ణు సహాస్రనామ స్తోత్ర పారాయణం.క్షీరాన్నభోగం. మంత్రపుష్పం. రాత్రి 8 గంటలకు పవళింపుసేవ.
-న్యూస్‌టుడే, శ్రీముఖలింగం (జలుమూరు)


ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టరు
మల్లి(సీతంపేట), న్యూస్‌టుడే: సీతంపేట మండలం మల్లిలోని ఏపీటీడబ్ల్యూఆర్‌ బాలురు(పీటీజీ) పాఠశాలను జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనృసింహం శనివారం తనిఖీ చేసారు. విద్యార్థుల విద్యా స్థాయి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. సోమవారం సీతంపేట ఐటీడీఏకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ వస్తుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టరు పరిశీలించారు. మల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలోని హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ ఏఎస్‌ ఖాన్‌, ఐటీడీఏ పీవో జె.వెంకటరావు, ఈఈ ఎస్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సావిత్రి, ఎమ్మారై బి.కుమారస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ముక్కిడమ్మ జాతర ప్రారంభం
తాలాడ(భామిని), న్యూస్‌టుడే: ఒడిశా సరిహద్దులో వంశధార నదీ గర్భంలో వెలసిన ముక్కిడిపోలమ్మ యాత్రోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమైయ్యాయి. స్థానికులతోపాటు ఒడిశా తదితర ప్రాంతాల నుంచి భక్తులు యాత్ర హాజరైముక్కిడిపోలమ్మకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏడు రోజులపాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.


మార్చి 31కల్లా కోర్‌ బ్యాంకింగ్‌ సేవలు
పలాస, న్యూస్‌టుడే: జిల్లాలోని తపాలా కార్యాలయాల్లో మార్చి 31 నాటికల్లా శత శాతం కోర్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా తపాలాశాఖ సూపరింటెండెంట్‌ డబ్లు్య.నాగాదిత్య కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం పలాస తపాలా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు ప్రధాన, 25 ఉప తపాలా కార్యాలయాల్లో ప్రస్తుతం కోర్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుతున్నాయని అన్నారు. మార్చి 31 కల్లా మిగిలిన 40 శాఖల్లో సేవలు అందుబాటులోనికి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తపాలా కార్యాలయాల ద్వారా నగదు డ్రా చేసుకునేలా టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేటలలో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లింపు, ఆదాయాపు పన్ను రశీదు, బీమా చెల్లింపులు సత్వరమే అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన అన్నారు. సుకన్య యోజన, అటల్‌ పెన్షన్‌, సురక్ష బీమా వంటి పథకాలను తపాలా కార్యాలయాల ద్వారా అమలు చేస్తున్నామని.. వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలాస తపాలా కార్యాలయంలోని దస్త్రాలను సూపరింటెండెంట్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (టెక్కలి) ఎస్‌.శ్రీకరబాబు, పలాస శాఖ పోస్టుమాస్టర్‌ పి.రంగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు
అక్కుపల్లి (వజ్రపుకొత్తూరు), న్యూస్‌టుడే: మండలంలోని అక్కుపల్లి శివసాగరం తీరంలో రథసప్తమిని పురస్కరించుకుని శనివారం ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆదివారం వేకువజాము నుంచే రథసప్తమి పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తనున్నారు. సర్పంచి కాస హైమవతి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం తీరం వెంబడి మరుగు గదుల ఏర్పాట్లు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈతగాళ్లను సిద్ధం చేశారు. పరిసరాలను పరిశుభ్ర పరిచారు. తీరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించేందుకు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.


మా ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరు
వైకాపా శాసనసభపక్ష ఉపనేత నెహ్రూ
కొత్తూరు, న్యూస్‌టుడే: తమ పార్టీ (వైకాపా) ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరని, తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై అపారమైన నమ్మకం ఉందని ఆ పార్టీ శాసనసభపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పనికి నూరుశాతం న్యాయం చేస్తున్నామన్నారు. కొత్తూరు మండలం మాతల గ్రామంలో శనివారం జరిగిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం ఎన్నికలముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ప్రజాసమస్యలపై ప్రజల పక్షాన ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయనవెంట పాలకొండ, కురపాం, పాడేరు, అరకు, పత్తి పాడు ఎమ్మెల్యేలు కళావతి, పుష్పాశ్రీవాణి, ఈశ్వరి, సర్వేశ్వరరావు, సుబ్బారావు తదితరులున్నారు.

Untitled Document
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net