Wednesday, February 10, 2016


Untitled Document
సీఏడీ భూముల్లో అక్రమ తవ్వకాలు
భీమవరంఅర్బన్‌, న్యూస్‌టుడే
భీమవరం మండలంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే సర్కార్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీఏడీ)కి చెందిన భూములపై అక్రమార్కుల కన్ను పడింది. స్థలాల పూడిక పేరుతో అక్రమ పర్వానికి తెరలేపారు. ఈ భూముల్లో వ్యవసాయ సాగు మాత్రమే చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

అసలు కథ ఇదీ
1921వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ సర్కార్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన 1534 ఎకరాలను స్థానిక రైతులకు లీజు పద్ధతిన సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాలక్రమంలో కొందరు వాటిని ఆక్రమించుకుని లీజు చెల్లించడం మానేశారు. దీంతో సీఏడీ కోర్టుకి వెళ్లింది. 1994లో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై ఆ భూములు మాకే చెందాలని కొందరు హైకోర్టుకి వెళ్లారు. అర్హులైన వారికి భూమిని పంపిణీ చేయాలని కోర్టు తీర్పులో పేర్కొంది. అధికార యంత్రాంగం విచారించి సుమారు 600 మందికి 950 ఎకరాల వరకు పంపిణీ చేసింది. మిగిలిన భూమి మాత్రం ఆక్రమణలో ఉండిపోయింది. దీన్ని కూడా అర్హులైన పేదలకు పంచాలని పలువురు మళ్లీ కోర్టుకి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ సుమారు 14 ఎకరాల్లో పేదలైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.

పూడిక మాటున సాగుతున్న తవ్వకాలు
పేదలకు కేటాయించిన ఖాళీ భూములు పూడ్చి అప్పగించాల్సి ఉంది. దీనిని కారణంగా చూపిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా కొంత మంది చెర్వులను తవ్వేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను కాదని చెర్వులు ఎలా తవ్వుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం: ఈ తవ్వకాలకు సంబంధించి తహశీల్దార్‌ చెన్నుశేషు స్పందిస్తూ.. చెర్వుల తవ్వకాలు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పలువురికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.


పేకాట స్థావరంపై పోలీసుల దాడి
9మంది జూదరుల అరెస్టు ్ద రూ.7.16లక్షల నగదు స్వాధీనం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలోని నవభారత్‌ అతిథి గృహంలోని పేకాట స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. 9మంది జూదరులను అరెస్టు చేసి రూ.7,16,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దాడులు నిర్వహించిందని ఆయన తెలిపారు. వీరిపై జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ స్థావరంలో రూ.75వేలు ప్రవేశ రుసుం చెల్లిస్తేనే పేకాట ఆడేందుకు అనుమతిస్తారన్నారు. అరెస్టయిన వారిని మంగళవారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వెంకటరావు తెలిపారు.


సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్‌
అత్తిలి, తణుకు (పాతవూరు) న్యూస్‌టుడే: అత్తిలి రైల్వేస్టేషన్‌ నుంచి సోమవారం రాత్రి శేషాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. భీమవరం-ఆరవల్లి మధ్యలో సోమవారం రాత్రి గూడ్స్‌ రైలు ఇంజిను సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో అత్తిలిలో 7.45 గంటలకు చేరుకున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ను గూడ్స్‌ కు తగిలించి భీమవరంలో చేర్చారు. తిరిగి అత్తిలి వచ్చి శేషాద్రికి తగిలించుకుని రెండు గంటల ఆలస్యంతో రాత్రి 10.13 గంటలకు బయలుదేరింది.ఇదే క్రమంలో రాత్రి 9.10 గంటలకు రావాల్సిన భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటా ఇరవై నిమిషాల ఆలస్యంతో అత్తిలికి 10.20కి చేరింది. భీమవరం వైపు నుంచి రావాల్సిన పూరి- తిరుపతి రైలుకు అత్తిలిలో క్రాసింగ్‌ పెట్టారు. ఈ క్రమంలో విశాఖ రైలు మరో అరగంట సేపు అత్తిలి స్టేషనులోనే నిలిచిపోయింది.రాత్రి 11.10 గంటలకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అత్తిలిస్టేషన్‌ నుంచి బయలుదేరింది. రెండు రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


సర్వే తీరు వేరు
విలీన మండలాల్లో భూదస్త్రాలన్నీ మరాట్‌వాడ విధానంశి ఆంధ్రా సర్వేయర్లకు శిక్షణ
కుక్కునూరు, న్యూస్‌టుడే: విలీన మండలాల్లో భూసేకరణ ఆంధ్రా సర్వేయర్లకు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ భూ రికార్డులు, నక్షాలు (భూ చిత్రపటాలు) మరాట్‌వాడ విధానం కావడం, ఆంధ్రా రికార్డులు డీఎన్‌వో విధానంలో ఉండటంతో ఆంధ్రా సర్వేయర్లకు ఆ విధానం కొత్తగా ఉంది. దీంతో తెలంగాణ నుంచి రిటైర్డు సర్వేయర్లను తీసుకువచ్చి శిక్షణ ఇప్పిస్తున్నారు. పోలవరం భూసేకరణకు గానూ ప్రభుత్వం ఆరుగురు సభ్యులు గల మూడు సర్వే బృందాలను పంపించింది. ఇక్కడ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ జరగాల్సి ఉండటంతో, కుక్కునూరు సబ్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి, ఆయనకు సహాయంగా సర్వేయర్లను నియమించారు. ఈ మండలాల్లో గల భూరికార్డులు, నక్షాలు (భూచిత్రపటాలు), ఆంధ్రా రికార్డుల వలే లేకపోవడంతో, సర్వేయర్లు తికమక పడుతున్నారు. విలీన మండలాలు ఒకప్పుడు నిజాం ప్రభుత్వం ఏలుబడిలో ఉండటంతో, ఇక్కడ భూరికార్డులన్నీ మరాట్‌వాడ విధానంలో కొనసాగుతున్నాయి. ఆంధ్రాలో డిఎన్‌ఓ (డయాగ్నల్‌ అండ్‌ ఆఫ్‌సెట్‌) విధానం కావడంతో, మరాట్‌వాడ విధానం వారికి బోధపడటంలేదు. దీంతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, సర్వేకు సిద్ధం చేస్తున్నారు.


18 మంది సర్వేయర్లు
పోలవరం భూసేకరణకు కుక్కునూరుకు 18 మంది సర్వేయర్లను కేటాయించారు. ఈ డివిజన్‌లో అత్యధికంగా భూసేకరణ జరపాల్సింది కుక్కునూరు మండలంలోనే ఇక్కడ మొత్తం ముంపు పరిధిలోకి చేర్చిన భూమి 10,908 ఎకరాలు కాగా, ఇప్పటివరకూ కేవలం 1820 ఎకరాలను మాత్రమే సేకరించారు. ఇంకా 9088 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వేలేరుపాడు మండలంలో మొత్తం 11,742 ఎకరాలు ముంపు ప్రాంతంలో ఉండగా, అందులో 10,380 ఎకరాలను సేకరించారు. ఇంకా అక్కడ సేకరణ జరగాల్సింది కేవలం 1362 ఎకరాలు మాత్రమే. దీంతో భూసేకరణలో మొదటి ప్రాధాన్యం కుక్కునూరు మండలానికి ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మండలంలోని అమరవరం, మాధారం, మారేడుబాక, తొండిపాక గ్రామాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. 18 మంది సర్వేయర్లతో రానున్న 6 నెలల్లో ఇక్కడ భూములు మొత్తం సర్వే పూర్తి చేయాలనే ఆలోచనతో అధికారులు ముందుకెళుతున్నారు.

సబ్‌ కలెక్టర్‌ పర్యవేక్షణ
భూసేకరణలో భాగంగా సర్వేయర్లకు అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని గురువారం కుక్కునూరు సబ్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పరిశీలించారు. నక్షాలు (చిత్రపటం) చూపుతూ, సర్వే చేసే పద్ధతులను వారితో కలసి పాలుపంచుకున్నారు. సర్వేయర్లు తొందరగా అవగాహన కల్పించుకొని, క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని సూచించారు.అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో ఇళ్లనిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశాలొచ్చారని చేనుల్లో ఇసుక తప్పనిసరి అని పోలవరం తహశీల్దారు ఎం.ముక్కంటి చెప్పారు. సోమవారం ఈనాడులో ‘ఇసుక పర్ర.. కాసులకు ఎర’ శీర్షికన వచ్చిన వార్తపై అధికారులు స్పందించారు. గృహ నిర్మాణశాఖ అధికారులు ఇసుకను దగ్గరుండి పగలు మాత్రమే తీసుకువెళతామని చెప్పారని తహశీల్దారు తెలిపారు. ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్‌.లవన్న దృష్టికి తీసుకువెళ్లినట్లు తహశీల్దారు పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డీవో ఆదేశించినట్లు తహశీల్దారు చెప్పారు. సాయంత్రం 6 గంటల కల్లా అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని లేకపోతే లారీలను సీజ్‌ చేస్తామని గృహనిర్మాణశాఖకు స్పష్టం చేసినట్లు తెలిపారు.


మాజీ ఎంపీ కనుమూరి ఇంట్లో చోరీ
కారుతోపాటు విలువైన ఆభరణాలు మాయం
న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని ఆభరణాలతో పాటు ఇంటి ముందున్న ఇన్నోవా వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. బంజారాహిల్స్‌ నేరపరిశోధన విభాగ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 ఎమ్మెల్యే కాలనీలో కనుమూరి బాపిరాజు నివసిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి 2 గంటల తరువాత ఆయన ఇంట్లోకి గుర్తుతెలియని ఆగంతకులు వచ్చారు. వెనుక తలుపు ద్వారా లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. అల్మారాలో పెట్టిన దాదాపు రూ. 5లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, అక్కడే ఉన్న ఇన్నోవా తాళం చెవిని తీసుకుని ఇంటి ముందున్న వాహనంతో వెళ్లిపోయారు. దీంతో బాపిరాజు కోడలు చైతన్య ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ప్రతినెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌
ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలను యాజమాన్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.భాస్కర్‌ కార్మిక శాఖాధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని బయోఇథనాల్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మిక సంఘ అధ్యక్షుడు జి.రవిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగించగలవని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

ఉంగుటూరు మండలం నల్లమాడు రెవెన్యూ పరిధిలోని కంసాలిగుంట గ్రామం వద్ద పోలవరం ప్రధాన కాలువ గట్టు నుంచి మట్టిని కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారని చిలుకూరి వెంకటగిరి ఫిర్యాదు చేశారు.

గోపాలపురం మండలంలో పోలవరం ప్రధాన కాలువకు అండర్‌ టన్నెల్‌ నిర్మించకపోవడం వల్ల గండిపడి సుమారు 35 ఎకరాల్లో చెరకు, వరి పంటలు దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కందుల నారాయణరావు కోరారు.

భీమవరంలోని పలు మద్యం దుకాణాలను మినీ బార్లుగా నిర్వహిస్తున్నారని, మందుబాబుల ఆగడాల కారణంగా సమీపవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌వీవీ నరసింహారావు ఫిర్యాదు చేశారు.

ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో ఆయకట్టు చెరువును మూసేయడం వల్ల సుమారు 200 ఎకరాలకు నష్టం వాటిల్లుతోందని గుణ్ణంపల్లికి చెందిన కేశిరెడ్డి కృష్ణ వినతి పత్రం అందజేశారు.

మాదేపల్లి సుంకరవానిగూడెం నుంచి కొత్త పంచాయతీ కార్యాలయం వరకు నిర్మిస్తోన్న రహదారిలో నాణ్యత లోపించిందని కె.దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం కోసం సేకరించిన భూమిలో తనకు 14.46 ఎకరాల భూమి ఉందని, భూమి ముంపునకు గురయ్యే అవకాశం లేనందున తనకు ఇప్పించాలని కె.నరసింహరాజు కోరారు.డిజిటల్‌ పాలనకు పోటీ పడాలి
ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పాత తరహా పాలనకు కాలం చెల్లిందని, నేటి ఆధునిక కాలంలో డిజిటల్‌ పాలనకు పోటీ పడాలని కలెక్టర్‌ కె.భాస్కర్‌ అధికారులకు చెప్పారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జీతం పొందే ప్రతి ఉద్యోగి ఇకపై బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేసుకోవాన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు బయోమెట్రిక్‌ పరిధిలోకి రానున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ప్రతి దస్త్రం ఈ-కార్యాలయం విధానంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో పనిచేసేవారంతా బయోమెట్రిక్‌ విధానాన్ని విధిగా అనుసరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలు కోసం అవసరమైన యంత్రాలు సిద్ధం చేయాలని డీసీహెచ్‌ఎస్‌ శంకరరావును ఆదేశించారు. సంయుక్త కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, డీఆర్వో ప్రభాకరరావు పాల్గొన్నారు.

అధికారిక పనులు అప్పగించవద్దు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అధికారిక పనులు అప్పగించవద్దని కలెక్టర్‌ కె.భాస్కర్‌ చెప్పారు. ఐసీడీఎస్‌ అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు లాగిన్‌ తెలియజేసి ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఐసీడీఎస్‌ పీడీ చంద్రశేఖరరావు లాగిన్‌ నెంబరును డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు తెలియజేసి ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 52 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉండటానికి కారణాలు ఏమిటని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ వేణుగోపాల్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. బాలికా సంరక్షణ పథకం కింద గత మూడేళ్లుగా 20 వేల బాండ్లను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వలేదని సంబంధిత అధికారులను నిలదీశారు. ఏపీడీ వియకుమారి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ
- డీఈవో డి.మధుసూదనరావు
వసంతమహల్‌ సెంటర్‌ (ఏలూరు విద్యావిభాగం), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు తగు కార్యాచరణ అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు చెప్పారు. ఏలూరు డివిజన్‌లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇంకా ఐదు వారాల వ్యవధి మాత్రమే ఉందని, రాబోయే రోజులు ఎంతో కీలకమైనవిగా భావించాలన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ‘అష్టాంగ మార్గాలను, ‘కమిట్‌మెంట్‌’ తదితర కార్యక్రమాలను విధిగా అమలు చేయాలన్నారు. డీసీఈబీ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని పదో తరగతి విద్యార్థులందరూ అనుసరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏలూరు డివిజన్‌లో దాదాపు 15 ఉన్నత పాఠశాలల్లో అర్ధ సంవత్సర పరీక్షల ఫలితాల్లో వెనుకబడి ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వార్షిక పరీక్షలనాటికి సంసిద్ధులను చేయాలన్నారు. సమావేశంలో ఏలూరు ఉప విద్యాశాఖాధికారి డి.ఉదయకుమార్‌, ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా అధ్యక్షుడు డీవీ రమణ, ఆర్‌ఎంఎస్‌ఏ ఏవో ఇమ్మానుయేల్‌, ఏలూరు మాజీ డీవైఈవో ఎస్‌.జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న చీరకట్టు సింగారం
శనివారపుపేట(ఏలూరు గ్రామీణ), న్యూస్‌టుడే: లయనెస్‌ క్లబ్‌ ఉత్సవాల సందర్భంగా మహిళలు ఆనందోత్సాహాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక శనివారపుపేటలోని న్యూ అశోక్‌నగర్‌లో గల హేలాపురి లయన్స్‌ సముదాయంలో మహిళలు సోమవారం చీరకట్టు సింగారంతో ఆంధ్ర, కేరళ, తమిళనాడు, మార్వాడీ తదితర ప్రాంతాల సాంప్రదాయ దుస్తులు ధరించి పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం సరదా సరదాగా ఏక్‌ మినిట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఏక్‌ మినిట్‌ కార్యక్రమానికి లయనెస్‌ సభ్యులు వై.ఉమావాణి, బి.ఎన్‌.జ్యోతి, ఎన్‌.శ్యామల, ఎల్‌.మెనాకుమారి, కె. లక్ష్మీకుమారి, ఆర్‌.కమల, పి.దీప్తి, చీరకట్టు సింగారానికి జి.శోభ, ఎస్‌. విజయలక్ష్మి, కె.ప్రేమజవహర్‌లాల్‌, వి.ప్రేమలత, కె.మీనాక్షి, కె. కృష్ణసుభ ఛైర్‌పర్సన్లుగా వ్యవహరించారు. హేలాపురి జోన్‌ ఛైర్‌పర్సన్‌ జి.రామనాథబాబు, కార్యదర్శి హేమసుందర్‌ విజేతలకు బహుమతులు అందజేశారు.

విజేతలు వీరే: చీరకట్టు సింగారం: ఎల్‌.శిరీష(ప్రథమ), ఎం.వర్ష(ద్వితీయ), సూర్యకళ(తృతీయ).

ఏక్‌మినిట్‌: ఎం.వర్ష(ప్రథమ), కనకదుర్గ(ద్వితీయ), దుర్గాభవాని(తృతీయ).మారుమూల గ్రామాల్లో సౌరశక్తి విద్యుత్తు కేంద్రాలు
ఐటీడీఏ పీవో ఎస్‌.షాన్‌మోహన్‌
కేఆర్‌పురం (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: మన్యంలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో విద్యుత్తు కొరత సమస్యలను అధిగమించేందుకు సౌర విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్‌.షాన్‌మోహన్‌ తెలిపారు. ఐటీడీఏలోని తన ఛాంబర్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బుట్టాయగూడెం, పోలవరం మండలాల సరిహద్దు గ్రామం చింతకొండ, వేలేరుపాడు మండలం మోదేలుతో పాటు మరో 3 గ్రామాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జైజేషన్‌ ద్వారా జంగారెడ్డిగూడెం నోవా కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థులు సూర్యమిత్ర కార్యక్రమం కింద వీటి ఏర్పాటుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఐటీఐ చదివిన 8 మంది గిరిజన అభ్యర్థులను ఆపరేటర్లుగా నియమించి ఉపాధిని కల్పిస్తామన్నారు.

సౌరశక్తి పంపుసెట్ల ఏర్పాటుకు 41 బోర్లు గుర్తింపు
మన్యంలోని గిరిజన రైతుల భూముల్లో 41 బోర్లలో సౌరశక్తి మోటారు పంపు సెట్లను బిగించేందుకు గుర్తించినట్లు పీవో వివరించారు. ఎన్టీఆర్‌ జలశ్రీ పథకం కింద ఈ పంపు సెట్లను బిగిస్తామన్నారు. ప్రత్యేక బృందాలతో సర్వే చేయించి జీవనధార పథకం కింద తవ్వి విద్యుత్తు సదుపాయం లేక నిరుపయోగంగా ఉన్న 232 బోర్లను గుర్తించామన్నారు. వీటిలో 200 అడుగుల లోతు ఉండి సౌరశక్తి మోటార్లను బిగించేందుకు అనువుగా ఉన్న వాటిని 41 బోర్లను గుర్తించామన్నారు. ఒక్కో యూనిట్‌ను రూ.5 లక్షల చొప్పున నెడ్‌క్యాప్‌ ద్వారా మంజూరు చేస్తామన్నారు. నెడ్‌క్యాప్‌ 90 శాతం రాయితీ కల్పిస్తుందన్నారు. రైతు రూ.55 వేలు భాగస్వామ్యంగా చెల్లించాలన్నారు. ఇందులో రూ.30 వేలు ఐటీడీఏ రాయితీగా భరిస్తుందన్నారు.గోధుమ వర్ణంలో సోమేశ్వరస్వామి దర్శనం
గునుపూడి (భీమవరం ఆధ్యాత్మికం), న్యూస్‌టుడే:గునుపూడి సోమేశ్వరజనార్దన స్వామి ఆలయ ప్రాంగణం సోమవారం భక్తులతో కళకళలాడింది. ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ పూజలు ప్రధానార్చకుడు సోంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రి స్వామివారికి నేత్రానందంగా పుష్పాలంకరణచేయగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఇన్‌ఛార్జి ఈవో ఎన్‌.సతీష్‌కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఇంటికి చేరిన మూగ బాలుడు
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇంటినుంచి తప్పిపోయి రైలు ఎక్కి కేరళ చేరి... అక్కడి పోలీసుల ద్వారా రాజమహేంద్రవరం ఏకలవ్య వడికి చేరుకున్న మూగబాలుడు ఎట్టకేలకు ఇంటికి చేరాడు. ఆ బాలుడి దుస్థితిపై పత్రికల్లో వచ్చిన కథనం చూసిన బంధువులు అతడిని గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని బాలుడు రక్త సంబంధీకులకు సమాచారం అందించారు. వారు సోమవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. తన ఆత్మీయులను చూసి సంతోషంతో వారి అక్కున చేరాడు. ఆ బాలుడికి తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులే సాకుతున్నారు. నాలుగు నెలల క్రితం తప్పిపోయిన ఆ బాలుడు తిరిగి తమను చేరడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఏకలవ్య సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.


ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల
రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. రిజిస్టర్‌ నెంబరు 14057005 ఫలితాన్ని తర్వాత ప్రకటిస్తారు. ఫిబ్రవరి-10 నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భారతీయ వైద్య మండలి/విశ్వవిద్యాలయం మార్గనిర్దేశాల ప్రకారం 5 గ్రేస్‌ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలను విడుదల చేశామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్యవిశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ డి.విజయ్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తిగత గుర్తింపు/రీ టోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2000లు రిజిస్ట్రార్‌ పేరిట డీడీ తీసుకొని ఫిబ్రవరి 17వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలి.


మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మైనార్టీ వర్గాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనార్టీల ఆర్థిక సంస్థ ఈడీ సయ్యద్‌ సిరాజుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెన్స్‌, డెంటల్‌ అసిస్టెన్స్‌, రక్తపరీక్ష టెక్నీషియన్‌ కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన మైనార్టీ అభ్యర్థులు అర్హులని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తులను ‌్ర్ర్ర.్చ్ప్బ్ఝ్డ్ఞ.్ఞ్న్ఝ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 08812-242463లో సంప్రదించవచ్చని చెప్పారు.


దిల్లీ వెళ్లిన కలెక్టర్‌
ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టర్‌ కె.భాస్కర్‌ దిల్లీ వెళ్లారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన కింద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ జిల్లాలోని పెదమైనివానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు గ్రామాల్లో అభివృద్ధి పనుల తీరుపై కేంద్ర మంత్రి దిల్లీలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్‌ భాస్కర్‌ సోమవారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. దిల్లీలో మంగళవారం నిర్వహించే సమావేశంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్‌ భాస్కర్‌ దిల్లీ నుంచి బయలుదేరి జిల్లాకు చేరుకుంటారు. బుధవారం యథావిధిగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారు.


వృత్తివిద్యా బోధకుల
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల వృత్తివిద్యా బోధకుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన పి.శ్రీనివాస్‌(పెదపాడు) ఎన్నికయ్యారు. ఆ సంఘ రాష్ట్ర నూతన సంఘాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. సంఘ నూతన కమిటీ వివరాలను పి.శ్రీనివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా జె.లక్ష్మారెడ్డి(గుంటూరు), గౌరవాధ్యక్షుడిగా జి.ఈశ్వరరావు(విశాఖపట్నం) ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎం.రంగారావు(గన్నవరం), ఉపాధ్యక్షులుగా పి.నాగిరెడ్డి(అనంతపురం), ఎంవీ రమణ(కృష్ణా జిల్లా), పి.వెంకటలక్ష్మి(కర్నూలు జిల్లా), కార్యదర్శులుగా ఎం.జలంధరరావు(కృష్ణా జిల్లా), రవి(శ్రీకాకుళం), అర్పుదం(చిత్తూరు) ఎన్నికయ్యారన్నారు.


అపరిష్కృత సమస్యల సాధనకు అవిశ్రాంత పోరాటం
ఏలూరు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది అపరిష్కృత సమస్యల సాధనకు అవిశ్రాంత పోరాటం చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్కర్స్‌ జాతీయ యూనియన్‌(ఎఫ్‌ఎన్‌టీవో) జిల్లా కార్యదర్శి కె.శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం కార్యాలయం వద్ద యూనియన్‌ సభ్యులు నల్లరిబ్బన్లు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సిబ్బంది సమస్యలపై గతంలో విజయవాడ కార్మిక శాఖ కమిషనర్‌ సమక్షంలో అంగీకరించిన ఒప్పందాలను యాజమాన్యం అమలు చేయాలన్నారు. పట్టణాల్లో వినియోగదారుల ఫోన్లకు సంభాషణల నాణ్యత అభివృద్ధి కోసం అతుకులు లేని సర్వీసు తీగలను సిబ్బందికి అందజేయాలన్నారు. అకాల మృతి చెందిన ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబాలకు చెల్లించాల్సిన క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వి.రామయ్య మాట్లాడుతూ ఉద్యోగుల జీపీ ఎఫ్‌ అడ్వాన్స్‌ చెల్లింపుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందన్నారు. గత ఏడాది అక్టోబరులో చేసిన దరఖాస్తులకు నేటికీ చెల్లింపులు జరక్కపోవటం శోచనీయమన్నారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యూనియన్‌ ప్రతినిధులు హాజరయ్యారు.


ఐటీఐ విద్యార్థులకు బ్రిడ్జికోర్సు
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఐటీఐ రెండేళ్ల కోర్సును 60 శాతం మార్కులతో పూర్తిచేసి పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలోకి అర్హత పొందిన విద్యార్థులకు బ్రిడ్జికోర్సు నిర్వహించనున్నట్లు ఏలూరు ఐటీఐ కళాశాల ప్రధానాచార్యుడు డి.భూషణం తెలిపారు. అర్హత పొందిన విద్యార్థులకు ఎంపిక చేసిన ఐటీఐ కళాశాలల్లో ఈనెల 25 నుంచి మార్చి 24 వరకు బ్రిడ్జికోర్సు నిర్వహిస్తామని చెప్పారు. ఏలూరు, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, పెనుమంట్ర ఐటీఐ కళాశాలలను బ్రిడ్జికోర్సు కేంద్రాలుగా ఎంపికచేసినట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన అనంతరం సంబంధిత సబ్జెక్టుల్లో మార్చి 25 నుంచి 27 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సాంకేతిక విద్య రాష్ట్ర బోర్డు, శిక్షణ(ఎస్‌బీటీఈటీ) సంస్థ ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని ఐటీఐ కళాశాలల ప్రధానాచార్యులను సంప్రదించవచ్చన్నారు. 2015 లో బ్రిడ్జికోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎస్‌బీటీఈటీ నిర్వహించే పరీక్ష రాసి పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు.


సాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ
రైతులతో ముఖాముఖీలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి
మార్టేరు (పెనుమంట్ర), న్యూస్‌టుడే: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగును మలచుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ అల్లూరి పద్మరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరిపరిశోధన సంస్థ (మార్టేరు)లో డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ‘సాగునీటి ఎద్దడి’ అంశంపై రైతులతో నిర్వహించిన ముఖాముఖీలో పద్మరాజు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు కచ్చితమైన సాగునీటి ప్రణాళిక రూపొందించిన తరువాతే సాగు విస్తీర్ణాన్ని నిర్ణయించాలన్నారు. తద్వారా వరి, ఇతర పంటలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తామని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో మురుగనీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో మరుగునీటిని సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ రంగం ప్రకృతి విపత్తులు, ప్రతికూల పరిస్థితుల మధ్య సాగుతుందని, భవిష్యత్తులో వీటిని అధిగమించేలా పరిశోధనలు సాగిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఎన్‌.వి.నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నీటి ఎద్దడి వల్ల పశ్చిమలో 20 వేల హెక్టార్లు, తూర్పుగోదావరిలో 10వేల హెక్టార్లలో పంట విస్తీర్ణం తగ్గినట్లు గమనించామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పంటలు నీటిఎద్దడికి గురికాకుండా తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు చేరవేయాలన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ కె.రాజారెడ్డి మాట్లాడుతూ నీటి యాజమాన్య కమిటీలను ఏర్పాటుచేసి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు చేసి విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అభ్యుదయ రైతులు మాట్లాడుతూ నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు అపరాల సాగు విస్తీర్ణం పెంచేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ఉపకులపతి డాక్టర్‌ అల్లూరి పద్మరాజును శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అభ్యుదయ రైతులు, గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ రత్నప్రసాద్‌, అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్తల బృందం, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, మార్టేరు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


కాలువలో యువకుడి మృతదేహం లభ్యం
హత్యగా అనుమానం
నాచుగుంట (ఉంగుటూరు), న్యూస్‌టుడే: ఏలూరు ప్రధాన కాలువ అంచున నాచుగుంట రేవు వద్ద సోమవారం యువకుడి మృతదేహం నీటిలో పడి ఉంది. నిడమర్రు మండలం తోకలపల్లికి చెందిన కూలీ పనులు చేసుకునే నేపాలు హనుమంతరావు (27)గా సోమవారం రాత్రి పోలీసులు గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కాలువలో యువకుడి మృతదేహం నీటిలో వెల్లకిల్లా పడి ఉంది. గట్టుపై మృతదేహానికి సమీపంలో ఎదురుబొంగు కర్ర, చెప్పులు, రక్తపు మరకలు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో చేబ్రోలు పోలీసులు సోమవారం రాత్రి మృతదేహాన్ని నీటి నుంచి గట్టు మీదకు తీయించారు. తలవెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టినట్లు లోతైన గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. ముఖం కుడి కంటి ప్రాంతంలో కూడా రక్తపు మరకలున్నాయి. ఇక్కడికి వచ్చాక పెనుగులాట, గొడవ జరగటంతో హత్యచేయటమో, ఎక్కడో చంపేసి ఇక్కడ కాలువలోకి పడేసి ఉండటమో, ఎగువ ప్రాంతం నుంచి కాలువలో మృతదేహం కొట్టుకువచ్చి నీటి ప్రవాహం తగ్గడంతో ఒడ్డున చేరి ఉండవచ్చనే అనేక అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. మృతుడుకి ఎడమ చేతి మధ్యవేలి గతంలోనే కోసుకుపోయి గాయంమానినట్లు, ఎడమచేతికి రాగి కడియం, ఒంటిపై ఆకుపచ్చ గళ్ల చొక్కా, నల్ల రంగు ప్యాంటు, అందులో రూ.వంద నోటుతో ఉంది. మృతుడు తోకలపల్లికి చెందిన నేపాలు హనుమంతరావుగా గుర్తించామని ఎస్సై పైడిబాబు కోరారు. రెండు మూడు రోజుల కిందటే ఈ ఘటన జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


విశాల దారుల్లో.. విషాద మలుపులు
ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: నిత్య జీవితంలో ప్రయాణాలు సాధారణమైపోయాయి... ప్రయాణంలో గమ్యానికి చేరడంలో కీలకమైన రహదారులపై ప్రమాదాల కారణంగా జీవితాల్లో విషాదం నిండుతోంది. జిల్లాలో 3,160 కి.మీ. మేర విస్తరించిన ఆర్‌అండ్‌బీ రహదారులు, 135 కి.మీ. విస్తరించి ఉన్న జాతీయ రహదారులపై రోజూ ఎక్కడోచోట ప్రమాదంతో జీవితాలు ముగుస్తున్నాయి. నిబంధనలు పాటించని కారణంగానో, గోతుల కారణంగానో, అతివేగం వల్లనో ప్రాణాలు బలైపోతున్నాయి. వీటితోపాటు రహదారులపై మలుపులు ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి. జిల్లాలోని అనేకచోట్ల హెచ్చరిక బోర్డుల్లేని మలుపుల కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయి.


వేగంగా విలీన మండలాల భూముల వివరాల నమోదు
కేఆర్‌పురం (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పరిధిలోని విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల భూసేకరణ ప్రక్రియ వూపందుకుంది. ఇందులో భాగంగా ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ (పీఎన్‌) రూపకల్పనకు భూముల వివరాల నమోదు చురుగ్గా సాగుతోంది. ఇందుకోసం కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద యువత శిక్షణ కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


4 బృందాలతో ప్రత్యేక సర్వే
వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 21 రెవెన్యూ గ్రామాల పరిధిలో 9 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇదే రీతిలో ఆయా మండలాల్లోని నిర్వాసితులకు పునరావాస కల్పనకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో మరో 3 వేల ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. భూసేకరణకు 4 రెవెన్యూ అధికారుల బృందాలతో ప్రత్యేక సర్వే చేయిస్తున్నారు. ఇందుకోసం భూసేకరణ అధికారిగా కేఆర్‌పురం ఐటీడీఏ పీవో, కుక్కునూరు సబ్‌కలెక్టర్‌ షాన్‌మోహన్‌ను ప్రభుత్వం నియమించడం విదితమే.

ఈ నేపథ్యంలో ఉండి, ఆచంట, నల్లజర్ల, ఉంగుటూరు తహశీల్దార్‌ కార్యాలయాల నుంచి డిప్యుటీ తహశీల్దార్లను డిప్యుటేషన్‌పై నియమించి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ బృందాల్లో నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, 8 మంది సర్వేయర్లు, నలుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ రూపకల్పన చేయిస్తున్నారు. 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు నిర్దేశించారు.

భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూములను సేకరించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని సబ్‌ కలెక్టర్‌, పీవో షాన్‌మోహన్‌ తెలిపారు.


Untitled Document
సీఏడీ భూముల్లో అక్రమ తవ్వకాలు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్‌
సర్వే తీరు వేరు
18 మంది సర్వేయర్లు
అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు
మాజీ ఎంపీ కనుమూరి ఇంట్లో చోరీ
ప్రతినెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌
డిజిటల్‌ పాలనకు పోటీ పడాలి
ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ
ఆకట్టుకున్న చీరకట్టు సింగారం
మారుమూల గ్రామాల్లో సౌరశక్తి విద్యుత్తు కేంద్రాలు
గోధుమ వర్ణంలో సోమేశ్వరస్వామి దర్శనం
ఇంటికి చేరిన మూగ బాలుడు
ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల
మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ
దిల్లీ వెళ్లిన కలెక్టర్‌
వృత్తివిద్యా బోధకుల
అపరిష్కృత సమస్యల సాధనకు అవిశ్రాంత పోరాటం
ఐటీఐ విద్యార్థులకు బ్రిడ్జికోర్సు
సాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ
కాలువలో యువకుడి మృతదేహం లభ్యం
విశాల దారుల్లో.. విషాద మలుపులు
వేగంగా విలీన మండలాల భూముల వివరాల నమోదు
4 బృందాలతో ప్రత్యేక సర్వే
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net