శుక్రవారం, జనవరి 20, 2017

నియోజకవర్గ సమాచారం

రామగుండం

ఓ వైపు సింగరేణి గనులు.. మరో వైపు ఎన్టీపీసీ వెలుగు జిలుగులతో అలరారే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని, రామగుండం పట్టణం, రామగుండం మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు కార్మికులు, ఉద్యోగులే.
* జనాభా : 2.72 లక్షలు
* విస్తీర్ణం : 288.4 చదరపు కిలో మీటర్లు
* ప్రాధాన్యత : సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, ఏపీ జెన్కో, కేశోరాం సిమెంటు ఫ్యాక్టరీ, బొగ్గు శుద్ధి కర్మాగారం.
సామాజిక ఆర్థిక పరిస్థితులు
* ఎక్కువగా కార్మిక వర్గం. ఉద్యోగంపై ఆధారపడి జీవించే వారే ఎక్కువ. వ్యవసాయ రంగంపై జీవించే వారు నియోజకవర్గంలో తక్కువ.
భౌగోళిక పరిస్థితులు
* బొగ్గు నిక్షేపాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, సిమెంటు, గోదావరినది.


ధర్మపురి

చరిత్ర: పవిత్ర గోదావరి తీరాన గల పుణ్య క్షేత్రం ధర్మపురి. ధర్మపురిలో పవిత్ర గోదావరి నది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుంటుంది. ‘ ధర్మవర్మ ’ అనే మహారాజు ధర్మపురిని రాజధానిగా చేసికొని పరిపాలించినట్లు అందుకే ధర్మపురి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఇక్కడి ప్రధాన దైవం. రాష్ట్ర నలుమూలల నుంచి ధర్మపురికి వస్తుంటారు. ఫాల్గుణ మాసంలో 13 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మరో ప్రాచీన పుణ్య క్షేత్రం, శాతవాహనుల రాజధాని కోటిలింగాల ఈ నియోజకవర్గంలోని వెల్గటూర్‌ మండలంలో ఉంది. శాతవాహనుల తొలి రాజధానిగా కోటిలింగాల చరిత్రలో ఎక్కింది. ఈ నియోజకవర్గంలో ధర్మపురితో పాటు, ధర్మారం, వెల్గటూర్‌, గొల్లపెల్లి, పెగడపెల్లి మండలాలున్నాయి. ఐదు మండలాలు కాకతీయుల కాలంలో వెలిసిన ఆలయాలు, చరిత్ర సంపదకు నిలయంగా ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారి 16, రాష్ట్ర రహదారి 7 ఉన్నాయి.
* జనాభా 2.73 లక్షలు
* ఓటర్లు 2.18 లక్షలు ఉన్నారు.
ప్రత్యేకత: దక్షిణాభిముఖంగా గోదావరి ప్రవహించడం వల్ల కాశీ కంటే పవిత్ర స్థలం అని పండితులు చెబుతారు. ధర్మపురి పండితులకు ప్రసిద్ది కాగా, కోటిలింగాలలో జరిపిన తవ్వకాల్లో సమగోప, గోపదస అనే పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ధర్మపురిలో ఇసుక స్తంభం ప్రత్యేక ఆకర్షణ


పెద్దపల్లి

ప్రత్యేకతలు: పెద్దపల్లి పత్తి మార్కెట్‌కు జిల్లాలో ద్వితీయ స్థానం లభించింది. ఈ ప్రాంతంలో పత్తి, వరి ఎక్కువగా సాగు కావడంతోఇక్కడ మార్కెట్లో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాల్లో 100కు పైగా రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది.
పెద్దపల్లి, సుల్తానాబాద్‌ రెండు నియోజకవర్గాలున్న క్రమంలో 1956 అనంతరం పెద్దపల్లి కేంద్రంగా ఒకే నియోజకవర్గం ఏర్పడింది. మొదటి ఎమ్మెల్యేగా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎల్‌. ముత్తయ్య పిడిఎఫ్‌ తరపున ఎన్నికయ్యారు. అనంతరం ఒక్క బిరుదు రాయమల్లు మినహా అందరు అగ్రవర్ణాలకే చెందిన వారు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ 5 సార్లు, తెదేపా 4సార్లు, తెరాస, భాజపా, పిడిఎఫ్‌, ఇండిపెండెంట్‌ ఒక్కోసారి ఇక్కడ విజయం సాధించారు. ఏ అభ్యర్థి కూడ రెండు సార్లు వరుసగా గెలిచిన సందర్భం లేదు.
* జనాభా: 3,14,780
* నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు
నియోజకవర్గంలో ఎక్కువగా నల్లరేగడి, ఎర్ర నేలలున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగుచేస్తారు. మానేరు నది, హుస్సేన్‌మియా వాగు పరివాహక ప్రాంతం. ఎస్సారెస్పీ డి-83, డి-86 కాలువల ద్వారా పంటలకు సాగునీరందుతుంది. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో శ్రీపాదసరోవర్‌ ప్రాజెక్టు, హుస్సేన్‌మియాపై మూడు చోట్లగతంలో నిర్మించిన చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. మినీ హైడల్‌ ప్రాజెక్టులున్నాయి.


మంథని


* నియోజకవర్గ జనాభా: 2001 ప్రకారం 2,65,700
* 2011 ప్రకారం సుమారు 2.85లక్షలు
* డివిజన్‌ విస్తీర్ణం: 1821.32 చదరపు మీటర్లు
* మంథని, కమాన్‌పూర్‌, ముత్తారం, మల్హర్‌, కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం మండలాలున్నాయి.
*డివిజన్‌లో 122 గ్రామ పంచాయతీలు, 202 గ్రామాలు, 328 ఆమ్లేట్‌ గ్రామాలు, 28 నిర్మానుష్య గ్రామాలున్నాయి.
నియోజకవర్గం ప్రాముఖ్యం: కాళేశ్వరం త్రివేణి సంగమం, కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయాలు, మంథని గోదావరి తీరాన గౌతమేశ్వర ఆలయం, మంథని పట్టణంలో పలు దేవాలయాలున్నాయి. కమాన్‌పూర్‌ మండలం రామగిరి ఖిల్లా చరిత్రాత్మక కట్టడాలున్నాయి. రామగిరి గుట్టల్లో ఆయుర్వేద మూలికలకు ప్రసిద్ధి.
భౌగోళిక పరిస్థితి: మహదేవపూర్‌, మహాముత్తారం, కాటారం తూర్పు ప్రాంతంలో అడవులు సమృద్ధిగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తోంది. కమాన్‌పూర్‌, మంథని మండలాల్లో సింగరేణి ఉపరితల, భూగర్భ బావులున్నాయి.వేములవాడ

  *మండలాలు: వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్‌, మేడిపల్లి
నియోజకవర్గ జనాభా: 2,59,40
వేములవాడ నియోజకవర్గం 2009లో జరిగిన పునర్విభజనలో ఏర్పడింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చైతన్య పోరాటాలకు, సమైక్య ఉద్యమాలకు, భక్తి పారవశ్యానికి నెలవు. నిజాంకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం మొదలు ఈనాటి వామపక్ష ఉద్యమాల వరకు ప్రత్యేక పాత్ర పోషించింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం చాలుక్యుల కాలంలో రాజరాజేనరేంద్రుడు నిర్మించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. వార్షిక ఆదాయం రూ.35కోట్లు దాటింది. తెలంగాణ పోరాటంలో చెన్నమనేని రాజేశ్వర్‌రావు, విప్లవోద్యమంలో కూర రాజన్న, కూర దేవేందర్‌ తదితర అగ్రనాయకులెందరో ఇక్కడి వారే కావడం విశేషం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్డర్‌ సి.నారాయణరెడ్డి ఈ నియోజకవర్గ వాసి. నియోజకవర్గం నుంచి గల్ఫ్‌కు అత్యధికంగా వలసలు వెళ్తున్నారు. వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో అత్యధికంగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి అనుబంధంగా రెండు జిన్నింగ్‌ మిల్లులు అయిదు రైస్‌మిల్లులు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ వ్యవసాయం చేయలేని ఈ ప్రాంతంలోని యువత గల్ఫ్‌కు వెళ్తుంటారు. దాదాపు 20వేలమంది యువకులు జీవనోపాధికి దుబయి, మస్కట్‌, సౌదీ తదితర దేశాల్లో పనిచేస్తు ఉపాధి పొందుతున్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో మూలవాగు ప్రాజెక్టు జలాశయం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కోనరావుపేట మండలంలోని అయిదువేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించారు. ప్రస్తుతం ఇది రెండు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందిస్తోంది. మేడిపల్లి మండలం రంగాపూర్‌ ప్రాజెక్టు ఉంది. దీని ద్వారా 1500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇదే మండలంలో భీమారం గడీ పేరుగాంచింది. కథలాపూర్‌ మండలంలోని బొమ్మెన ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. చందుర్తి, మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో దాదాపు ఆరువేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది.

రాజకీయ చైతన్య కేంద్ర బిందువు
వేములవాడ సిరిసిల్లతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ విలక్షణమైన రాజకీయాలకు, సమీకరణాలకు వేదికగా నిలిచింది. వేములవాడ ప్రాంతం వాసులే సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పలువురు గెలుపొందారు. సిరిసిల్ల అసెంబ్లీకి ఐదుసార్లు వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. 1999లో వేములవాడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రేగుల పాటి పాపారావు ఎన్నికయ్యారు. రాజేశ్వర్‌రావు నాలుగు సార్లు సి.పి.ఐ. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో తెదేపా అభ్యర్థిగా రాజేశ్వర్‌రావు విజయం సాధించారు. నియోజకవర్గంలో అత్యధిక సార్లు ఎన్నికైన ఘనత ఆయనకే దక్కింది. 2009లో తెదేపా అభ్యర్థిగా రమేశ్‌బాబు 1800 మెజార్టీతో ఎన్నికయ్యారు. మళ్లీ జరిగిన ఉప ఎన్నికల్లో రమేశ్‌బాబు రెండో సారి జయకేతనం ఎగురవేశారు.  2014 ఎన్నికల్లో  తెరాస తరఫున రమేశ్‌బాబు ఎన్నికయ్యారు. 


సిరిసిల్ల

నియోజకవర్గ చరిత్ర, ప్రత్యేకత: సిరిసిల్ల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. రాజకీయంగా చైతన్యవంతమైన కేంద్రంగా పేరుంది. అనేక దశాబ్దాలు వామపక్ష రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. ప్రస్తుతం సిరిసిల్ల శాసనసభ్యునిగా తెరాసకు చెందిన కె.తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి పేరెన్నికగన్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా 32వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఉన్న అద్దకం పరిశ్రమల ఉత్పత్తులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలోని తొలి టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రభుత్వం సిరిసిల్లలోనే నెలకొల్పింది. దేశంలో అత్యుత్తమ విద్యుత్తు సంస్థగా ఖ్యాతి గాంచిన సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం(సెస్‌) సిరిసిల్ల డివిజన్‌లో విద్యుత్తు సేవలను అందిస్తోంది.

సిరిసిల్ల నియోజకవర్గం మెట్ట ప్రాంతం. నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నర్మాలలో ఉన్న మధ్యతరహా సాగునీటి జలాశయం ఏకైక అతిపెద్ద నీటి వనరు. నియోజకవర్గానికి తూర్పున వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, కోనరావుపేట మండలాలున్నాయి. పశ్చిమాన ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలాలున్నాయి. దక్షిణాన మెదక్‌ జిల్లా ఉంది. పడమరన మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం ఉంది.


కోరుట్ల

పునర్విభజనలో భాగంగా బుగ్గారం, మెట్‌పల్లి నియోజకవర్గాలను రద్దు చేసి కొత్తగా కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాలను కలిపి కోరుట్ల నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో కోరుట్ల, మెట్‌పల్లి రెండు మున్సిపాలిటీలు ఉండటం విశేషం.
** నియోజవర్గంలోని మెట్‌పల్లి గతంలో నిజాం జాగీరుదారుల జిల్లా కేంద్రంగా ఉండేది.
* కోరుట్లను పూర్వకాలంలో కొరవట్టుగా పిలిచేవారు.
*జిల్లాలో ఎక్కడా లేని సమయంలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లో అప్పటి సంస్థానాదీశులు జనరేటర్లతో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.
* వేములకుర్తి శివారులోని గోదావరి నదిపై గంగనాల ప్రాజెక్టు నిర్మించి మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల సాగు భూములకు నీరందించారు.
* గోదావరి నది జిల్లాలో మొదట ప్రవేశించేది ఇబ్రహీంపట్నం మండలంలోనే.


జగిత్యాల

జగిత్యాల నియోజకవర్గం వ్యవసాయ పరంగా జిల్లాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎస్సారెస్పీ కాలువ ఆధారంగా ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. మహిళలు వ్యవసాయంతో పాటు బీడీ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. అత్యధిక శాతం మంది యువకులు ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టారు.
మొత్తం జనాభా- 2,93,785


కరీంనగర్‌

కరీంనగర్‌ మొదట ఎలగందుల జిల్లా కేంద్రంగా పరిపాలన సాగింది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలో జిల్లాల పునరవ్యవస్థీకరణ జరిగినపుడు క్రీ.శ.1905లో జిల్లా కేంద్రం కరీంనగర్‌కు మార్చబడింది. ఎలగందుల ఖిలేదారైన కరీముద్దీన్‌, కరీముల్లా షా బాబా పేరుతో జిల్లాకేంద్రానికి కరీంనగర్‌ అని నామకరణం చేశారు. జనం వాడుక భాషలో దీన్ని కన్నారంగా పిల్చేవారు. 2005లో కరీంనగర్‌ శతవసంతాలు పూర్తి చేసుకుంది. పునర్విభజనకు ముందు కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్‌ పట్టణం, కరీంనగర్‌ మండలం, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, బెజ్జంకి మండలాలు ఉండేవి.పునర్విభజన అనంతరం నియోజకవర్గ పరిధిలో కరీంనగర్‌ నరపాలక సంస్థ, కరీంనగర్‌ మండలాలు మాత్రమే మిగిలాయి. నియోజకవర్గానికి మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. నగరంలో 50డివిజన్లు ఉండగా... మండలంలో 29గ్రామాలు, మరో 15 శివారు(హమ్లెట్స్‌) ప్రాంతాలు ఉన్నాయి. కరీంనగర్‌ పట్టణం పురపాలక సంఘంగా 1952లో ఏర్పడింది. ఆ తర్వాత వివిధ హోదాల్లో కొనసాగుతూ 8ఏప్రిల్‌ 2005లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. నగరం 24చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నగరంలో 303కిలోమీటర్ల మేర భూగర్భ మురికి కాలువ ప్రగతిలో ఉంది. మండలంలో వ్యవసాయంతో పాటు బావుపేట, బద్దిపల్లి, కమాన్‌పూర్‌, నాగులమల్యాల, ఎలగందుల, ఖాజీపూర్‌ గ్రామాల్లో గ్రానైట్‌ క్వారీలు, క్రషర్లు, గ్రానైట్‌ పాలిషింగ్‌ ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఆయా గ్రామాల్లోని వందలాది మంది కార్మికులు పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
* వ్యవసాయ సమాచారం: మండలంలో ప్రధానంగా నల్లరేగడి, ఎర్రమట్టి నేలలు ఉన్నాయి. 24వేల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. ప్రధాన ఆహార పంటలుగా వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుంటారు. 4,500వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న 2,200హెక్టార్లు, పత్తి 6వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. ఆయకట్టు కింద 22గ్రామాలు ఉన్నాయి. కాలువల కింద 4,500హెక్టార్లు, చెరువులు కుంటల కింద 1,560హెక్టార్లు, మిగిలిన విస్తీర్ణం బావులు, బోర్ల కింద పంటలు సాగు చేస్తుంటారు.

* ప్రజల జీవన విధానం: నగరంలో ప్రధానంగా ఉద్యోగ, వ్యాపార, కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇంజినీరింగ్‌, వైద్య, ఇతర వృత్తి విద్యా కళాశాలలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. మండలంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తపల్లి, చామనపల్లి, చర్లబుత్కూర్‌, దుర్శేడు, పద్మనగర్‌, ఎలగందుల, జూబ్లీనగర్‌, బావుపేట గ్రామాల్లో చేనేత, బీడీ కార్మికులు కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గోపాల్‌పూర్‌లో ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తుంటారు. ఎలగందుల, బావుపేట, నాగులమల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. దిగువ మానేరు జలాశయం నిర్మాణం సమయంలో పనిచేయడానికి తమిళనాడు నుంచి కూలీలు వచ్చి బావుపేట సమీపంలో స్థిరపడ్డారు. తెదేపా హయాంలో వీరికి పట్టాలు ఇవ్వడంతో అప్పటి ముఖ్యమంత్రి పేరున ఎన్టీఆర్‌ తమిళకాలనీగా ఏర్పడింది.


మానకొండూర్‌

దిగువ మానేరు జలాశయాన్ని సిగలో తురుముకున్న మానకొండూరు నియోజవర్గంలో మొత్తం అయిదు మండలాలున్నాయి. తిమ్మాపూర్‌ మండలంలో దిగువ మానేరు జలాశయం(ఎల్‌ఎండీ) రిజర్వాయర్‌ ఉంది. దీని సామర్థ్యం 24 టీఎంసీలు. 920 అడుగుల ఎత్తు, దాదాపు 30 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని మానకొండూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌ మండలాల్లోని వేల ఎకరాల్లో సాగు భూములకు నీరు అందిస్తుందీ రిజర్వాయర్‌.  నియోజకవర్గంలో ప్రధానంగా భౌగోళికంగా కొన్ని మండలాలు సాగు యోగ్యమైన భూములు కాగా మరికొన్ని మండలాలు మెట్ట ప్రాంతాలు. నియోజకవర్గంలో ప్రజలు అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌.ఎం.డి. కాలనీలో ఎస్సారెస్పీ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగస్తులు నివాసముంటున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో పార్‌బాయిల్డ్‌ రైసు మిల్లులు ఎక్కువగా ఉన్నాయి.


చొప్పదండి

చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడ్డవారు అత్యధికంగా ఉన్నారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ, చేనేత మరమగ్గాలపై కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేవలం చొప్పదండి మండలానికి మాత్రమే ఎస్సారెస్పీ కాలువ నీరు వస్తాయి. నియోజకవర్గంలోని మల్యాల, రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల నుంచి వరద కాలువ నిర్మాణం జరిగింది. మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జె.ఎన్‌.టి.యు విశ్వవిద్యాలయం ఉంది. చొప్పదండి మండలం ఆర్నకొండలో నవోదయ పాఠశాల ఉంది. గంగాధర మండలం ఒద్యారంలో గ్రానైట్‌ పరిశ్రమ రాష్ట్రంలోనే పేరొందింది. రామడుగు మండల కేంద్రంలో శిల్ప కళాకారులు తమ ప్రతిభతో శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు. పునర్విభజనకు ముందు చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్‌ జనరల్‌ స్థానం గా ఉండేది. పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో చొప్పదండి తోపాటు, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలను కలిపారు.
విస్తీర్ణం: 103,21,43,306 చదరపు గజాలుహుస్నాబాద్‌

కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల సరిహద్దును కలుపుతూ ఏర్పడిన హుస్నాబాద్‌ శాసనసభా నియోజకవర్గంలో హుస్నాబాద్‌, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన ఈనియోజకవర్గానికి జిల్లాలో ఓ ప్రత్యేకత ఉంది. వ్యవసాయ, వ్యాపార, రాజకీయ, సాంస్కృతిక రంగాలతో తనదైనముద్ర వేయడమే కాకుండా సామాజిక విప్లవోద్యమానికి ఈ ప్రాంతం ­పిరిలూదింది. అనాటి నైజాం పాలకుల బానిసత్వం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి మావోయిస్టు ఉద్యమం వరకు ఈప్రాంతంలో జరిగిన సాయుధ సంఘర్షణలో వందలాది మంది అమరులయ్యారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఇక్కడి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలోభాగంగా హుస్నాబాద్‌ సమీపంలోని మహ్మదాపూర్‌ గుట్టలో జరిగిన సాయుధ సంఘర్షణ (ఎన్‌కౌంటర్‌)లో అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి సహ 14మంది పోరాటయోధులు అమరులయ్యారు. తెలంగాణలోనే ఇది తొలి ఎన్‌కౌంటర్‌. భూమి కోసం, విముక్తి కోసం సమసమాజ స్థాపన లక్ష్యంగా పోరాటం చేపట్టిన పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో భాగంగా జిల్లాలో 1989నాటి వరకు సాయుధ సంఘర్షణలలో అమరులైన దాదాపు 88మంది స్మారకార్థం హుస్నాబాద్‌ పట్టణంలో అతిపెద్ద స్మారకస్థూపాన్ని వార్‌ నక్సల్స్‌ నిర్మించి ఆవిష్కరింపచేశారు.అతిపెద్ద స్మారక స్థూపంగా, ఆసియా ఖండంలోనే రెండోదిగా పేరొంది ఇది ఆకర్షించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత గ్రీన్‌టైగర్స్‌ పేరదీన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దేశానికి దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా వ్యవహరించిన పీవీ నర్సింహారావు స్వగ్రామం ఈసెగ్మెంటులోని భీమదేవరపల్లి మండలం వంగర. ఆసియా ఖండంలో సహకార రంగంలో రెండోదిగా గుర్తింపు పొందిన ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంకు ఈ నియోజకవర్గంలోనిదే. తెలంగాణలోని 9జిల్లాల పట్టు ఉత్పత్తిదారులకు పట్టుగ్రుడ్లను సరఫరా చేసే పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉంది. సైదాపూర్‌ మండలంలో కాకతీయుల కాలం నాటి సర్వాయిపాపన్న కోట, గోడిశాల దేవాలయాలు ఉన్నాయి. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను కలుపుతు ఉన్న ఇనుపరాతి గుట్టలో ఖనిజ సంపద ఉంది. ప్రతిఏటా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి, హుస్నాబాద్‌లో ఎల్లమ్మ, పొట్లపల్లిలో స్వయంభూరాజేశ్వరస్వామి, కోహెడలో కూరెల్ల గుట్టలో ప్రతాప సింగరాయ జాతరలు జరుగుతుంటాయి. సాగునీటి సౌకర్యం లేక వర్షధారంగానే ఇక్కడ పంటలు సాగు అవుతాయి. శాశ్వత సాగునీటి వనరుల కోసం శ్రీరాంసాగర్‌ వరదకాలువ నిర్మాణం సాగుతోంది. అత్యధికంగా వ్యవసాయ బావుల వినియోగం కూడ ఇక్కడనే అధికంగా ఉంది.


హుజూరాబాద్‌

హుజూరాబాద్‌ 1952-62 వరకు ద్విసభ్య నియోజక వర్గంగా ఉండేది. అప్పుడు కమలాపూర్‌ కూడా హుజూరాబాద్‌లోనే ఉండేది. ఒకే నియోజక వర్గంలో ఒక స్థానం ఎస్సీ, మరో స్థానం జనరల్‌కు కేటాయించగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవారు. 1967లో జరిగిన పునర్విభజన తర్వాత హుజూరాబాద్‌, కమలాపూర్‌ ఏర్పాటయ్యాయి. మళ్లీ 2009లో జరిగిన పునర్విభజన తర్వాత కమలాపూర్‌ నియోజక వర్గాన్ని రద్దు చేసి ఇందులోని మూడు మండలాలను హుజూరాబాద్‌లో విలీనం చేశారు. దీంతో నియోజక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. వ్యవసాయరంగంలో జిల్లాలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వరి, పత్తి సాగులో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పుడు కరవుకాటకాలతో విలవిలలాడిన నియోజక వర్గంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా పుష్కలమైన సాగునీరు అందుతోంది. దీంతో 80 శాతం గ్రామాలు ఎస్సారెస్పీ ఆయకట్టు కిందే సాగువుతోంది. రైతులు కూడా ఆర్థికాభివృద్ధిని సాధించారు. అలాగే జమ్మికుంటలో పత్తిమార్కెట్‌ తెలంగాణలోనే రెండవ శ్రేణిదిగా గుర్తింపు పొందింది. ఏటా సుమారు రూ.300 నుంచి రూ.500 కోట్ల వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. అలాగే విద్యారంగంలో కూడా ఆశించిన పురోగతిని సాధించింది. సింగాపురంలో కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు పీజీ, ఫార్మసీ, బీఈడీ, డిగ్రీ,జూనియర్‌ కళాశాలు, ప్రయివేటు పాఠశాలలు పోటాపోటీగా వెలిశాయి. ప్రస్తుతం హుజూరాబాద్‌, జమ్మికుంట మేజర్‌ పంచాయతీలు మున్సిపాలిటీ హోదా కల్పించేందుకు గత ఏడాది ప్రతిపాదనలు కూడా వెళ్లాయి.
* గ్రామాలు-93
* జనాభా  మొత్తం 2,88,773

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.