ఉప వ్యాఖ్యానం

రెండింతల సరదాలు
సరా పండగ సంబరంగా ఉందా, అయిదు రాష్ట్రాల ఎన్నికలు సంబరంగా ఉన్నాయా అంటే చెప్పటం కష్టం. రెండు సంబరాలు కట్టకట్టుకు రావటం నిజంగా మన అదృష్టం.
దసరా వస్తోందంటే చాలు అడావిడే అడావిడి. దసరా సెలవులు వస్తాయి పదో పాతికో! దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండగ, పులివేషాలు, ఆయుధపూజ, శమీపూజ, అమ్మవారి పూజలు, పిండివంటలు, కొత్త బట్టలు...

కొత్తబట్టలంటే గుర్తొచ్చింది, ఎన్ని పార్టీలు ఫిరాయిస్తే అన్నేసి కొత్త చొక్కాలొస్తాయి. పార్టీ కండువాలయితే ఫ్రీ. నిన్నటిదాకా వేసుకుని మన శరీర సమానంగా భావించిన చొక్కా అంటేనే తీవ్ర అసయ్యం కలుగుతుంది, డోకొస్తుంది. కొత్తో వింత పాతో రోత అని ఊరికే అన్నారా, టింగురంగా అని కొత్త చొక్కాలో జేగీయమానంగా కొత్తకొత్త రంగులతో వెలుగొందొచ్చు. దసరా అంటేనే పది రోజుల పండగ. మరే పండగకూ ఇంత సీనుండదు. ఈ మినీ సార్వత్రిక ఎన్నికలు విచిత్రంగా ఈసారి రెండు నెలల పండగ. పండగలో పండగ. మస్తు మజామజాగా!

కొన్నిచోట్ల కొన్ని పార్టీలు ఖాళీ అయినట్లుగానే- దసరా వస్తే చాలు... మన నగరాలు ముప్పాతిక వంతు ఖాళీ అవుతాయి. హైదరాబాదైతే చెప్పనక్కర్లేదు. చెప్పనలవి కాదు. దసరానాడు నిర్మానుష్యంగా, కర్ఫ్యూ పెట్టినట్టుగా ఉంటుంది. ఇంత విశాలంగా ఉన్నాయా హైదరాబాదు రోడ్లు అని విస్తు పోతాం. బస్సూ రైలూ, లారీలు, టాక్సీలు దొరకని ముగ్గురు నలుగురు- నగరంలో మిగిలిపోతారంతే. ‘జీనా యహాఁ, మర్నా యహాఁ, ఇస్కే శివా జానా కహాఁ... అని పాడుకొంటూ. ఆ టైములో టైముంటే ఎన్నికల ప్రచారం చేయటం చాలా సులభం. ప్రతి ఇంటి దగ్గరా ఆగాల్సిన పనుండదు.

పక్షిరాజు అంటే ఏంటని అడిగితే- మా వాడు ఠకీమని ‘పిట్టల దొర’ అని సమాధానమిచ్చాడు. మా చిన్నప్పుడు దసరా సెలవుల్లో ఊరికెళ్లినప్పటి సంగతి. ‘దొర’ వేషం వేసుకుని చిరిగిన టోపీ పెట్టుకుని భిక్షార్థియై ఒకాయన వచ్చేవాడు. చేతిలో ఉత్తుత్తి తుపాకీ ఉండేది. ఎవరు నువ్వంటే దొరను అని చెప్పేవాడు. ఎవరికి దొరవు, ఏ ఊరికి దొరవని అడిగితే ‘పిట్టలన్నింటికీ దొరను’ అని చెప్పేవాడు... చాలా తమాషాగా మాట్లాడేవాడు. అతడి వెంటే మేమంతా (చిన్నప్పుడు) పరుగెత్తేవాళ్లం. అతణ్ని మా ఊళ్లో ‘లత్తుకోరు సాపు’ (లత్కోర్‌ సాహెబ్‌) అనేవాళ్లు. అతడి మాటలన్నీ ఆకర్షణీయంగా చమత్కారంగా, ఉబ్బగట్టేట్టుగా ఉండేవి. తాను చేయలేని పనంటూ లేదు. ఇవ్వని దానమంటూ లేదు. నీళ్లు చేదుకోవటానికి కూడా బంగారు బొక్కెనలు చేయిస్తాననేవాడు. నాగేటి కర్రులు కూడా నవరత్నఖచిత స్వర్ణమయం చేస్తాననేవాడు. స్వోత్కర్ష చాలా ఉండేది. మా పిల్లలందరికీ అతడో గొప్ప నాయకుడిగా కనిపించేవాడు. ఈయన్ని నాయకుడిగా ఎన్నుకోవాలి, ఈయన్ను పెట్టి పార్టీల మ్యానిఫెస్టోలన్నీ రాయించాలి అని కలలు కనేవాళ్లం. కలలు కూడా నిజమవుతాయని పెద్దయ్యాక నిజం మ్యానిఫెస్టోలను చదివాక తెలిసింది.

లత్తుకోరు సాపులకు ఒక సంక్షేమ సంఘం ఉండాలి. ఒక సహకార బ్యాంకు ఉండాలి. ఒక జాతీయ సమాఖ్య ఉండాలి. అదొక అంతర్జాతీయ కళగా అభివృద్ధి చెందాలి. ‘జాతీయ పక్షి’లాగే ‘జాతీయ పక్షి రాజులను’ ప్రకటించాలి. అప్పుడప్పుడూ జాతీయ అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఆ రోజుల్లో మా బాల సంఘం నిర్ణయించింది.

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లింది, బయటికొచ్చింది విజయదశమి రోజునే. ఈ ఎన్నికల్లో ఈ రెండూ ఎవరికి వర్తిస్తాయో ఎవరికెలాంటి భాగ్యం కలుగుతుందో చూడాలి.

చిన్నప్పుడు శమీ పూజ చేస్తూ ‘శమీ శమయతే పాపం...’ శ్లోకం రాసి జమ్మికొమ్మపై పెడితే మా అన్నయ్య తాను రాసిన శ్లోకాన్నే నేను కాపీ చేశానని మా నాయనకు ఫిర్యాదు చేసేవాడు... ఎవడు రాసినా అదే శ్లోకం, అదే శోకం, అదే ఏడుపు కదరా అని నాయన ఎంత చెప్పినా వాడికి అర్థమయ్యేది కాదు. అవును, కాపీ చేశాడులే అన్నాకే ఉపశమించేవాడు. రాజుకన్నా మొండివాడే గొప్పవాడంటారు మరి.

మా ఆవిడకు దసరా అంటే ఎంత మక్కువో పాలిటిక్స్‌ అన్నా, ఎన్నికలన్నా కూడా అంతే ఇష్టం. ఖాయంగా టికెట్‌ ఇస్తామంటే ఏ పార్టీలోనైనా చేరిపోతుంది. కానీ ఎవరిస్తారు, వాళ్లే చాలక కొట్టుకు చస్తున్నారు. త్వరగా నియోజకవర్గాల పెంపు జరిగితే బాగుండును- కొందరికైనా అవకాశాలొచ్చేవి. అన్ని పార్టీల మ్యానిఫెస్టోలు, సగం మ్యానిఫెస్టోలు లీకైన మ్యానిఫెస్టోలను క్షుణ్నంగా చదివింది.

వీళ్లెవరూ ప్రజావసరాలు పట్టించుకోరేంటి? ఒక్కరు కూడా నాలుగు మామిడి తోరణాలు, రెండు జమ్మి మండలూ పూలూ పత్రీ ఇస్తామని ఒక్క మ్యానిఫెస్టోలోనూ రాయలేదేమిటని అడిగింది? ఎలాగూ ఎన్నికల్లో డబ్బు పంపిణీ తప్పదాయె... పండగలొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు జీతాలిచ్చినట్టు- ఎన్నికల డబ్బు కూడా ముందే ఇస్తే పోలా అని ఆవిడ ఉవాచ. సరైన పాయింటే! ఇప్పటిదాకా ఎవరికీ తట్టలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘అందరికీ దసరా మామూళ్లు’ కూడా ప్రకటించాలన్నది మా ఆవిడ డిమాండు!

ఈసారి తమాషా ఏంటంటే- పండక్కు ఎవరికి వారు తలంటి పోసుకోకుండా ఇతర పార్టీవాళ్ల తలంటి పోస్తున్నారు. చెడ్డీలు వేసుకున్న నాటి సంగతుల గురించీ కడిగేస్తున్నారు. ఒకళ్లకు పట్టిన బూజు ఒకళ్లు దులిపి ఆరేస్తున్నారు. ఉతికి ఆరపెడుతున్నారు. తిట్ల పులిహోరలు, విమర్శల బొబ్బట్లు (భక్ష్యాలు) తొడ చరుపు మెడవిరుపు పిండివంటలూ పాయసాలు, ‘ఆయుధ’ పూజలూ...

ఒకటా రెండా.... మజా మజాగా ఖుషీ ఖుషీగా ఈ దసరా విరాజిల్లుతోంది...

ఇంకేమైనా చెప్పటం నేను మరిచిపోతే- కాస్త బయటకెళ్లి చూడండి...హంగామా అంతా కళ్లకు కడుతుంది!

- చికిత
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.