అంతర్యామి

అపరాజిత  శక్తి
క్తి పూజకు ప్రాధాన్యం శరన్నవరాత్రులు. భారతదేశంలో భిన్నభాషా సంప్రదాయాల రాష్ట్రాలున్నా అందరూ వారివారి పద్ధతుల్లో ఆచరించే అద్భుతపర్వాలివి. పరాశక్తి విజయాలను స్మరించి ఆరాధించే ఈ పండుగలు ప్రధానంగా- లోక కంటకమైన, బాధాకరమైన దుష్టశక్తులను దునుమాడే దివ్యశక్తిని అర్చించే వైభవాన్ని తెలియజేస్తాయి.

జయ, విజయ అనే రెండు శక్తులు సేవిస్తున్న అపరాజితా దేవిని ఈ విజయదశమినాడు ఆరాధించాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ‘అగ్ని గర్భ’ అని పేరు పొందిన యజ్ఞవృక్షమైన ‘శమీ’ సన్నిధిలో ఈ విజయశక్తిని అర్చించడమే ‘శమీ’పూజగా పేరు పొందింది.

అంతర్గతమైన విపరీత శక్తులను జయించడం విజయం. బాహ్య దుష్టత్వాన్ని దునుమాడటం జయం. ఈ బాహ్యాభ్యంతరమైన గెలుపుశక్తుల్ని జయ, విజయలుగా చెబుతుంటారు. వీటికి కారణమైన మహాశక్తి దుర్గను ‘అపరాజిత’గా అభివర్ణిస్తారు. ఓటమి లేని శక్తే అపరాజిత. ఆ తల్లి దయవల్ల అన్ని దౌర్జన్య స్వభావాలను, అవరోధాలను అధిగమించి, సిద్ధిని పొందాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సంపూర్ణ విజయశక్తిని స్త్రీ రూపంగా సంభావిస్తే దుర్గాలక్ష్మీ సరస్వతీ లలితా ఇత్యాది రూపాలతో సాక్షాత్కరిస్తుంది. పురుష రూపంగా ధ్యానిస్తే శ్రీరామాది స్వరూపాలుగా అనుభవానికి వస్తుంది. అందుకే ఈ పండుగల్లో దుర్గాచరిత్రతోపాటు, రామలీలకూ ప్రాధాన్యముంది.

భారతదేశం శక్తిస్వరూపంగా రుషులకు సాక్షాత్కరించింది. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశమంతా శక్తిపీఠాల నిలయం. కశ్మీరంలోని సరస్వతీ పీఠం, కన్యాకుమారిలోని పరమేశ్వరి, పశ్చిమ్‌ బంగలోని కాళీమాత, దేశమధ్య సీమలోని వింధ్యవాసిని, అసోమ్‌లో కాముఖ్యా, కాంచీపుర కామాక్షి, కేరళలో మలయాచలవాసిని భగవతి, కాశీలో విశాలాక్షి... ఇలా దేశం అణువణువూ దేవీక్షేత్రాలతో విరాజిల్లుతోంది.

ఈ శక్తిపూజల వేడుకల్లో ఆధ్యాత్మిక ప్రాధాన్యంతోపాటు, వేడుకల వైభవమూ కలిసి ఉంది. అందుకే సామాన్య జనుల నుంచి భక్తులు, ధార్మికులు, జ్ఞానుల వరకు ఈ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తారు. కలశస్థాపన చేసి మహాకాళీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూపిణి అయిన దుర్గను ఆవహింపజేసి, మూర్తులుగా నిలిపి ‘దుర్గాసప్తశతీ’ పాఠాలను పారాయణ చేయడం భారతదేశంలో పలుచోట్ల కనిపిస్తుంది. ఉత్తరాది, మధ్యదేశాలు, పశ్చిమ్‌ బంగ వంటి ప్రాంతాలవారు ఈ క్రమంలో దేవిని అర్చిస్తారు.

దక్షిణాపథంలో త్రిశక్తుల రూపిణియైన దుర్గతోపాటు, శ్రీవిద్యా స్వరూపమైన శ్రీలలితాదేవి ఆరాధన ప్రసిద్ధి చెందింది. ఆదిశంకరుల తపశ్శక్తితో ఈ శ్రీవిద్యా పరంపర సమాయాచారంగా మంచి సంప్రదాయంతో విస్తృతంగా వ్యాపించింది. అనేక మందిరాల్లో అమ్మవారి మూలమూర్తికి రోజుకో అవతారంగా అలంకారాలు చేస్తారు. బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ, లక్ష్మి, దుర్గ, సరస్వతి, రాజరాజేశ్వరి, శాకంభరి... ఇలా పలు రూపాలతో దేవి రోజుకో రూపంగా గోచరిస్తుంది. అయితే ‘ఈ రోజు ఈ అవతారం’ అనే నియమాలేవీ శాస్త్రాల్లో లేవు. అందుకే ఈ అవతార అలంకారాలు ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా ఉంటాయి.

వీటిలోని పరమార్థం అద్భుతం. ఒకే దేవీమూర్తిని ఇన్ని రూపాలుగా అలంకరించడం వల్ల, ఒకే పరాశక్తి ఇన్ని రూపాలను ధరించి లోకాన్ని అనుగ్రహిస్తోందనే సత్యం ప్రత్యక్షమవుతుంది. భిన్నరూపాలు ఉన్నప్పటికీ ఏకశక్తేనన్న వేదధర్మంలోని పరమ తాత్పర్యం ఈ అవతారాలవల్ల అవగతమవుతోంది.

ఈ శక్తితత్వ ఆరాధన ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహాత్ములకు స్ఫూర్తినిచ్చి భారతీయతను సనాతన ధర్మాన్ని మరింత ప్రకాశవంతం చేయించింది.

- సామవేదం షణ్ముఖశర్మ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.