ప్ర‌త్యేక క‌థ‌నం

గుహ జీవాన్వేషకుడు
గుహలలోని జీవజాతులపై  పరిశోధనలో గుంటూరు యువకుడు
  ప్రతిష్ఠాత్మక ‘వార్మ్స్‌’కు సంపాదకుడిగా ఎంపిక
  40 కొత్త జీవులను గుర్తించిన డాక్టర్‌ షేక్‌ షాబుద్దీన్‌
  ఓ కీటకానికి ఆయన పేరు
ఈనాడు - అమరావతి డెస్క్‌
ఆ యువకుడికి నిండా మూడు పదులు లేవు. ఖ్యాతి మాత్రం ఖండాతరాలకు వ్యాపించింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన అసామాన్య ప్రతిభతో ప్రతిష్ఠాత్మక వార్మ్స్‌ సంపాదకుడి(ఎడిటర్‌)గా ఎంపికయ్యారు. లిన్నేయస్‌ సొసైటీ(లండన్‌), జూలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఆయనే డాక్టర్‌ షేక్‌ షాబుద్దీన్‌. గుహల్లోని జీవజాతులపై చేసిన పరిశోధనలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. గుంటూరు నగరానికి చెందిన సామాన్య యువకుడు ‘వార్మ్స్‌’కు ఎలా ఎంపికయ్యారు. ఇందుకోసం ఆయన చేసిన కృషి ఏమిటి.. మున్ముందు ఏం చేయబోతున్నారు..  తదితర అంశాలపై ‘ఈనాడు’తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.

మీ నేపథ్యం ఏమిటి? గుహల్లో జీవజాతులను కనుగొనాలని ఆసక్తి ఎలా వచ్చింది?
మాది గుంటూరు. మా నాన్న మొహమ్మద్‌ అమానుల్లా స్కూటర్‌ మెకానిక్‌ పనిచేస్తుంటారు. తల్లి రెహమతున్నీసా గృహిణి. చిన్నతనం నుంచి కూడా తెనాలిలోని తాత షేక్‌ మొహూద్దీన్‌ బాచ్చా వద్దే పెరిగాను. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జువాలజీ చేశాను. ఒకరోజు సూక్ష్మజీవాలపై పరిశోధన కోసం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ బిలం వెళ్లాను. ఆ సమయంలో పట్టుతప్పి రాయి మీద పడ్డాను. కొన్ని కీటకాలు బయటకొచ్చాయి. వాటిని తీసుకొని పరిశోధనశాలలో పరిశీలించాను. అవి కొత్తరకం జీవులుగా గుర్తించాను. అలా గుహలపై పరిశోధన చేయాలనే ఆసక్తి ఏర్పడింది. అనంతరం గుహల్లో ఉన్న జీవవైవిధ్యంపై పరిశోధన చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి పరిశోధకుడు డాక్టర్‌ రంగారెడ్డి ఆధ్వర్యంలో డీపీఆర్‌ పంపాను. దీన్ని ఆమోదిస్తూ పరిశోధన కోసం రూ.25 లక్షలు మంజూరు చేసింది. అలా నేను బయోస్పీలియోలిజిస్ట్‌గా మారాను.

ఎన్ని జీవజాతులను కనుగొన్నారు?
గత పదేళ్లుగా గుహల్లోని నీటి కొలనుల్లో దాగి ఉన్న పలు జలచరాలను గుర్తించాను. రాష్ట్రంలోని గుత్తికొండ, బెలూం, బొర్రా గుహలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని చీకటి గుహలను సందర్శించి పరిశోధన చేశాను. ఉత్తరాదితోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లోని నదుల్లో నివసించే జలచరాలపై అధ్యయనం చేశాను. ఈ క్రమంలోనే దాదాపు 40 కొత్త జాతులను కనుగొన్నా. గుత్తికొండ గుహలో నేను కనుగొన్న ఓ కీటక వివరాలను బయోస్పీలియోలిజిస్ట్‌ (గుహల అధ్యయనం) అయిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త జార్జ్‌ బజ్‌ విల్సన్‌కు పంపాను. అది కొత్త జాతి కీటకం అని ఆయన ధ్రువీకరించి దానికి నాపేరు జోడిస్తూ.. ‘ఆంధ్రాకొయిడెస్‌ షాబుద్దీన్‌’ అని నామకరణం చేశారు.

మీకు ‘వార్మ్స్‌’లో అవకాశం ఎలా వచ్చింది?
గత పదేళ్లుగా ఈ రంగంలో కృషి చేస్తున్నాను. కొత్త జీవులను కనుగొన్నప్పుడు ఇతర దేశాల్లోని సీనియర్‌ శాస్త్రవేత్తలకు వాటి వివరాలను పంపేవాడిని. వారు నా పరిశోధన అంశాలను, వ్యాసాలను సమీక్షించేవారు. వారి సూచనల మేరకు వార్మ్స్‌లో బేతినిల్లేసియా(నీటి కీటకం జాతి) విభాగానికి ఎడిటర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. అలా ఎంపికయ్యాను. బేతినిల్లేసియా విభాగానికి నేను సంపాదకుడిగా వ్యవహరిస్తాను. భారత్‌ నుంచి ఎంపికైన మొదటి శాస్త్రవేత్తను నేనే. ఈ హోదాలో మూడేళ్లపాటు కచ్చితంగా సేవలను అందించేలా సంస్థతో ఒప్పందం ఉంది.

‘వార్మ్స్‌’ చేస్తున్న కృషి ఏమిటి?
వరల్డ్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ మెరైన్‌ స్పీసెస్‌కు సంక్షిప్త రూపమే ‘వార్మ్స్‌’. నీటిలో జీవించే జంతుజాతుల డేటాబేస్‌ నిర్వహణ కోసం యూరోపియన్‌ శాస్త్రవేత్తలు ఈ సంస్థను 2008లో స్థాపించారు. బెల్జియంలోని ఓస్టెండ్‌ నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సముద్రాలు, నీటి వనరుల్లో నివసించే జీవజాతులకు శాస్త్రీయ నామకరణం చేయడం, కొత్త జీవజాతుల ఉనికిని గుర్తించి తెలియజెబుతుంది. జీవ వైవిధ్యానికి అవి ఎందుకు అవసరం, వాటి సంరక్షణకు మానవాళి ఏం చేయాలనే విషయాలపై చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్థలో 57 దేశాల నుంచి సుమారు 376 మంది సంపాదకులు జీవజాతుల జాబితా తయారీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

మీ విధులు ఎలా నిర్వర్తిస్తారు.?
మనదేశంలోని జల వనరుల్లో ఏవైనా కొత్త స్పీసిస్‌ను గుర్తించినప్పుడు వాటి వివరాలను ఆయా విభాగాల సంపాదకులకు పంపుతాను. అలాంటివి అప్పటికే ఉన్నాయా.. ఉంటే వాటిని ఏ పేరుతో పిలుస్తారు అన్న అధ్యయనం జరుగుతుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని క్రోడీకరించి వాటికి శాస్త్రీయ నామకరణం(సైంటిఫిక్‌ నేమ్‌) చేస్తాం. ఇందులో భాగంగా సంస్థలోని శాస్త్రవేత్తలు నీటి కీటకాలకు సంబంధించి కొత్త విషయాలు తెలుసుకుంటే వాటిని నాకు పంపుతారు. పరిశీలించి వాటికి శాస్త్రీయ నామకరణం చేస్తాను.

బేతినిల్లేసియా(నీటి జాతి కీటకం)పై మీ పరిశోధనలు ఎంత వరకు వచ్చాయి?
అప్పటి వరకు నోరు వంటి నిర్మాణం ఉండదనుకున్న పారానాట్‌గా అనే కీటకంలో సదరు నిర్మాణం ఉంటుందని నిరూపించాను. ఇది బేతినిల్లేసియాలో కొత్త జాతులను కనుక్కోవడానికి సులభతర మార్గాన్ని చూపింది.

గుహల్లోని కీటకజాతులను కనిపెట్టడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
ఈ పరిశోధనల ద్వారా కనుక్కొన్న కొన్ని రకాల కీటకాలు, గుహల నుంచి సేకరించిన సమాచారం భూమిపై జరిగిన పరిణామ క్రమం గురించి వేల ఏళ్ల కిందట ఉన్న వాతావరణం గురించి పరికల్పన చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో యాంటీ బయోటిక్‌ రెసిస్టెన్స్‌ (సూపర్‌ బగ్‌) ప్రస్తుతం అతిపెద్ద సమస్య. గుహల్లో గుర్తించిన కొన్ని సూక్ష్మజీవులపై లోతైన అధ్యయనం చేస్తే మున్ముందు దీనికి పరిష్కారం లభిస్తుంది. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాఖను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

జంతుశాస్త్రానికి మీరు చేసిన కృషి ఏమిటి?
రెండు దశాబ్దాల పాటు చెల్లుబాటులో ఉన్న షార్ట్‌ రేంజ్‌ ఎండిమిజం(ఎస్‌ఆర్‌ఈ) అనే సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించాను. ఫలితంగా భారతీయ బయోజియోగ్రఫీ రంగంలో కొత్త కోణం వెలుగుచూసినట్లయింది. ఇది జాతి ఆవిర్భావాలకు సంబంధించి సైద్ధాంతిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడింది.

షాబుద్దీన్‌ అందుకున్న అవార్డులు
షేక్‌ షాబుద్దీన్‌ జంతుశాస్త్రంలో చేస్తున్న పరిశోధనలు, సేవలను వివిధ జాతీయ వైజ్ఞానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ఈ మేరకు ఆయన్ను పురస్కారాలతో సత్కరించాయి.
* 2016లో డాక్టర్‌ కేవీ రావు సైంటిఫిక్‌ సొసైటీ నుంచి యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు
* 2017లో ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి యువ శాస్త్రవత్తే పురస్కారం
* 2017లో జె.నాగరాజు మెమోరియల్‌ రీసెర్చ్‌ అవార్డు.
* దాదాపు రెండున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక లిన్నేయస్‌ సొసైటీ(లండన్‌) ఫెలోషిప్‌ 2017లో లభించింది. భారత్‌ నుంచి ఈ ఫెలోషిప్‌ పొందిన అతి పిన్న వయస్కుడు షాబుద్దీన్‌.
* నూతన జంతువుల అన్వేషణ, వాటి ఆవాసాలపై చేస్తున్న కృషికి గాను జూలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ ఫెలోషిప్‌కు ఈ ఏడాది సెప్టెంబరులో ఎంపిక.
* గత ఆగస్టులో జాన్‌కే ట్రావెల్‌ పురస్కారానికి ఎంపిక.
* 24 జీవుల గురించి వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన వ్యాసాలు.

మరిన్ని

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.