ప్ర‌త్యేక క‌థ‌నం

అమలే ‘అసలు’ సమస్య
కళాశాలలు ఒరిజినల్‌  ధ్రువపత్రాలు తీసుకోవద్దని యూజీసీ ఉత్తర్వులు
  అమలైతే లక్షల మంది విద్యార్థులకు ఊరట
  యాజమాన్యాల సహకారం సందేహమే
ఈనాడు, హైదరాబాద్‌: అసలు విద్యార్హత ధ్రువపత్రాల (ఒరిజినల్‌ సర్టిఫికెట్ల)ను తీసుకొని విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్న కళాశాలలకు ముకుతాడు పడుతుందా? అసలు ధ్రువపత్రాలు తీసుకోవద్దని, నిర్దేశించిన గడువులోపు ప్రవేశాన్ని రద్దు చేసుకుంటే రుసుములు తిరిగి ఇచ్చేయాలని యూజీసీ తాజాగా ఆదేశించిన నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్న ఇది. ఈ నిబంధనతో ఉన్నత విద్యను అభ్యసించే లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించే అవకాశం ఉన్నా రాష్ట్రంలో ఎంత వరకు అమలవుతుందన్నది సందేహంగా మారింది. యూజీసీ తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు ఏ కోర్సులో చేరినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒరిజనల్‌ ధ్రువపత్రాలను కళాశాలల్లో ఇవ్వక్కర్లేదు. నకలు పత్రాల (జెరాక్స్‌)తోపాటు హామీపత్రం ఇస్తే చాలు.

గత నిబంధనలకే గతి లేదు
విద్యార్థులు సెమిస్టర్‌ తర్వాత లేదా ఏడాది తర్వాత చదువు మానుకున్నా.. మరో కళాశాలలకు బదిలీ కావాలనుకున్నా మిగిలిన సంవత్సరాల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని 2016లో ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అమలు చేయాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అన్ని ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కళాశాలలకు ఆదేశాలిచ్చారు. ఇలా ఆదేశాలిచ్చే అధికారం కమిషనర్‌కు లేదని కళాశాలల యాజమాన్యాల సంఘం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ఆదేశాలు అమలు కాలేదు. ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థుల రుసుముల ఆధారంగా నడుస్తాయి కాబట్టి విద్యార్థి మధ్యలో మానేస్తే మిగిలిన సంవత్సరాల ఫీజు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఉందని సాంకేతిక విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే కళాశాలల్లో అసలు ధ్రువపత్రాలు ఇవ్వక్కర్లేదన్న యూజీసీ ఆదేశాల అమలుకు నిబంధనలు మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నతవిద్యామండలి అధికారులు తెలిపారు.

సమస్యలివీ..
ప్రస్తుతం విద్యార్థులు ఏ కోర్సులో చేరినా అసలు విద్యార్హత ధ్రువపత్రాలను కళాశాలల్లో సమర్పించడం తప్పనిసరి. దీనివల్ల మరో కళాశాలలో సీటు వచ్చినా చేరలేకపోతున్నారు.
* ఉద్యోగం వచ్చిందని చెప్పినా ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు.
* ఆసక్తి లేకో, వేరే కారణాల వల్లో చదువు మానుకుంటాం, ధ్రువపత్రాలు ఇచ్చేయమని విద్యార్థులు అడిగితే మిగిలిన సంవత్సరాలకు రుసుం చెల్లించమని కళాశాలలు నిబంధన విధిస్తున్నాయి.
* కోర్సు పూర్తయినా కళాశాలలు తమకు అసలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని వేలమంది విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి బోధనా రుసుములు అందలేదు కాబట్టి మీకు సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు మొత్తం చెల్లించాలని కళాశాలలు పట్టుబడుతున్నాయి.

మరింత స్పష్టత వస్తేనే
తాజా యూజీసీ ఉత్తర్వుల ప్రకారం కళాశాలలు అసలు ధ్రువపత్రాలు తీసుకోరాదు. ప్రవేశాల గడువు ముగిసిన నెల రోజుల్లోపు ప్రవేశాన్ని రద్దు చేసుకుంటే చెల్లించిన రుసుములో 50 శాతం తిరిగి ఇస్తారు. విద్యార్థి బీటెక్‌లో చేరి ఏడాది తర్వాత తాను చదువు మానుకుంటానన్నా, మరో కళాశాలలో చేరతానన్నా  మిగిలిన మూడేళ్ల రుసుం చెల్లించాలా? లేదా? అన్నదానిపై యూజీసీ స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థులు నకలు పత్రాలతోపాటు కళాశాలకు ఏమని హామీపత్రం ఇవ్వాలో కూడా స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.