ప్ర‌త్యేక క‌థ‌నం


హక్కుల ఉద్యమాలకూ చుక్కాని
మహాత్ముడి అహింస, సత్యాగ్రహ ఉద్యమ స్ఫూర్తితో ప్రపంచంలో పలు ఉద్యమాలు జరిగాయి. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ సారథ్యంలో అమెరికాలో జరిగిన పౌరహక్కుల ఉద్యమం, నెల్సన్‌ మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికాలో జరిగిన వర్ణ వివక్ష వ్యతిరేక, స్వేచ్ఛా స్వాతంత్య్ర ఉద్యమం, మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా   ఆంగ్‌శాన్‌ సూచీ జరిపిన ఉద్యమాలు ఈ కోవలోకే వస్తాయి. లూథర్‌కింగ్‌తో పాటు, పలువురు ఆఫ్రికన్‌ అమెరికన్లకు గాంధీజీ ఆదర్శప్రాయుడు.
మండేలాకు స్ఫూర్తి గాంధీజీ
మా దేశ చరిత్రలో గాంధీజీ అంతర్భాగం. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఈ గడ్డపై నుంచే సత్యాగ్రహాన్ని ఆచరించారు. సత్యాగ్రహాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక పోరాట మార్గంగా అభివృద్ధిచేశారు. దక్షిణాఫ్రికా పరివర్తనలో మహాత్ముడి ఆలోచనలు క్రియాశీల పాత్ర పోషించాయి. ఆయన బోధనల సాయంతో వర్ణ వివక్షను అధిగమించాం
- నెల్సన్‌ మండేలా


 అన్యాయంపై ప్రతిఘటనకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలందుకున్న నల్ల సూరీడు నెల్సన్‌ మండేలాకు మహాత్మాగాంధీ అనుసరించిన అహింస, సత్యాగ్రహాలే స్ఫూర్తి. దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా, నల్లజాతీయుల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అహింసాయత పద్ధతుల్లో ఆయన సుదీర్ఘ పోరాటం సాగించారు. ఏళ్లుగా వేళ్లూనుకున్న వర్ణవివక్షపై విజయం సాధించారు. దక్షిణాఫ్రికా గడ్డపై నుంచే గాంధీజీ భారతీయుల హక్కుల కోసం నిర్వహించిన మొట్టమొదటి సత్యాగ్రహ ఉద్యమం, భారతదేశంలో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిపిన అహింసాయుత ఆందోళనలు మండేలాపై చెరగని ముద్రవేశాయి. గాంధీజీ తన 23వ ఏట దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టినపుడు అక్కడున్న భారతీయులపై తీవ్ర వివక్ష ఉండేది. గాంధీజీ సైతం వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు. ఈ అవమానాలన్నింటినీ భరిస్తూ వచ్చిన గాంధీజీ హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భారతీయులు, చైనీయులు తమ కాలనీల్లో తప్పనిసరిగా పేర్లు నమోదుచేయిచుకోవాలంటూ 1906లో ట్రాన్స్‌వాల్‌ ప్రభుత్వం చేసిన చట్టంపై గాంధీజీ ఉద్యమించారు. ఈ చట్టాన్ని ధిక్కరించాలని భారతీయులకు పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమం చేశారు. ఈ చర్యలతో ఆగ్రహించిన పాలకులు గాంధీని 1906లో ఓల్డ్‌ఫోర్ట్‌ జైలుకు పంపారు. మండేలా తొలిసారిగా అరెస్టయినపుడు ఇదే ఓల్డ్‌ఫోర్ట్‌ జైలులోనే గడపడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల్ని నీచంగా చూసేవారు. ఈ అవమానాలే మండేలాను పోరాటం వైపు ఉసిగొల్పాయి. 1956లో తొలిసారిగా మండేలాపై దేశద్రోహం నేరం నమోదయింది. నల్లజాతీయుల హక్కుల్ని కాలరాస్తున్న చట్టాలపై మండేలా అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమించారు. దీంతో మండేలా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌పై 1960లో నిషేధం విధించారు. మండేలా అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రభుత్వ కూల్చివేతకు కుట్రపన్నారన్న ఆరోపణపై మండేలాను ప్రభుత్వం అరెస్టుచేసింది. మండేలాను రాబిన్‌ఐలాండ్‌ జైల్లో, పోల్స్‌మూర్‌ జైల్లో 27 ఏళ్లపాటు ఉంచారు. 1993లో జైలు నుంచి విడుదలైన మండేలాకు దక్షిణాఫ్రికా ఘనస్వాగతం పలికింది. దేశాధ్యక్షుడిగా ఎన్నుకుంది. భారతరత్న, నోబెల్‌ బహుమతి అందుకున్నారు.

లూథర్‌కింగ్‌కు ఎందుకు ఆదర్శం
ఏసుక్రీస్తు మాకు లక్ష్యాల్ని నిర్దేశిస్తే... మహాత్మాగాంధీ వ్యూహాల్ని అందించారు. గాంధీ సిద్ధాంతం లోతుల్లోకి వెళ్లేకొద్దీ నాకో విషయం అర్థమయింది. క్రైస్తవం బోధిస్తున్న ప్రేమతత్వాన్ని- గాంధీ అనుసరించిన అహింసాయుత పద్ధతుల్లో ఆచరిస్తే.. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న అణగారిన వర్గాలకు అత్యంత శక్తిమంతమైన ఆయుధం అవుతుంది
- మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌
ఆఫ్రికా నుంచి బానిసలుగా తీసుకువచ్చిన నల్లజాతీయుల పట్ల అమెరికాలో తీవ్ర వివక్ష కొనసాగేది. దాదాపు 350 ఏళ్లకు పైగా ఇదే పరిస్థితి. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మాంట్‌గొమేరీ(అలబామా)లోని డెక్స్ట్‌ర్‌ అవెన్యూ బాప్టిస్ట్‌ చర్చి పాస్టర్‌గా పనిచేసిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ సైతం పౌర హక్కుల ఉద్యమంలోకి అడుగుపెట్టారు. వర్ణ వివక్ష విష సంస్కృతి నుంచి అమెరికాను విముక్తం గావించడానికి- గాంధీజీ తరహాలో అహింసాయుత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనిని ఆధునిక అమెరికా పౌర హక్కుల ఉద్యమంగా అభివర్ణించొచ్చు. జాతి సమానత్వం కోసం లూథర్‌కింగ్‌ నడిపిన 13 ఏళ్ల ఉద్యమం(1955 డిసెంబరు నుంచి 1968 ఏప్రిల్‌ 4 వరకు) అంతకుముందు 350 ఏళ్లలో సాధించలేని విజయాలెన్నింటినో సాధించింది. భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గాంధీజీ నడిపిన అహింసాయుత ఆందోళన సాధించిన మహోన్నత విజయం లూథర్‌కింగ్‌ మదిలో చెరగని ముద్రవేసి, ఉద్యమపథం వైపు నడిపించింది. 1955 డిసెంబరు 2వ తేదీన రోసా పార్క్‌ అనే మహిళ అరెస్టు లూథర్‌ కింగ్‌ ఉద్యమానికి నాంది. అమెరికా బస్సుల్లో నల్లజాతీయులు, తెల్లవారికి వేర్వేరు వరుసలుండేవి. తెల్లజాతీయుల వరుసలు పూర్తిగా నిండిపోతే.. కొత్తగా బస్సెక్కే తెల్లవారి కోసం నల్లజాతీయులు సీట్లను ఖాళీచేయాల్సి వచ్చేది. రోసాపార్క్‌ అనే మహిళ దీనికి అంగీకరించలేదు. దీంతో అమెరికా ప్రభుత్వం ఆమెను అరెస్టుచేసింది. సరిగ్గా ఆమె విచారణ రోజే లూథర్‌కింగ్‌ తదితరులు బస్సు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇది మాంట్‌గొమేరీలోని నేతలు, తెల్లజాతీయుల్లో ఆగ్రహం తెప్పించింది. 1956 జనవరిలో లూథర్‌కింగ్‌ ఇంటిపై బాంబులు వేశారు. దీనిపై ప్రతీకారం తీర్చుకుందామని నల్లజాతీయులు ఊగిపోయినా లూథర్‌కింగ్‌ వారిని వారించారు. ఆ రోజు తన మద్దతుదారులకు లూథర్‌కింగ్‌ స్వేచ్ఛను ఇచ్చిఉంటే వారు మాంట్‌గొమేరీని తగులబెట్టేవారు. అదే జరిగి ఉంటే లూథర్‌కింగ్‌ ఇంతగా కీర్తిని  పొందేవారు కాదు. అహింసాయుత ఆయుధమే లూథర్‌కింగ్‌ను అమెరికా చరిత్రలోనే ఓ ముఖ్య ఉద్యమ నేతగా నిలిపింది. న్యాయ పోరాటాలకు అహింస ఎంతటి గొప్ప ఆయుధంగా పనిచేస్తుందో బస్సు బహిష్కరణ ఉద్యమం ఉదాహరణగా నిలిచింది. అహింసాయుత సామాజిక మార్పుల కోసం తాము అనుసరిస్తున్న వ్యూహాలకు గాంధీజీ మార్గదర్శకుడిగా నిలిచారని లూథర్‌కింగ్‌ చెప్పేవారు. మహాత్మాగాంధీపై పుస్తకాలెన్నింటినో లూథర్‌కింగ్‌ చదివారు. గాంధేయవాదులతో సంప్రదింపులు జరిపేవారు.
సూచీకి ఆదర్శుడు
నా జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల్లో గాంధీ ముఖ్యులు. ఆయన స్ఫూర్తితో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం
- సూచీ
ఇష్టా రాజ్యంగా పాలిస్తున్న మయన్మార్‌ సైనిక సర్కారుకు వ్యతిరేకంగా, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం సుదీర్ఘకాలం పోరాటం సాగించిన ఆంగ్‌శాన్‌ సూచీ- గాంధీజీ అనుసరించిన అహింసామార్గాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. సూచీ దిల్లీలో ఉన్న రోజుల్లో గాంధీ సిద్ధాంతాలు, నెహ్రూ ఆశయాలకు ఆమె ఎంతగానో ఆకర్షితురాలయ్యారు. చాన్నాళ్లు ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న సూచీ 1988లో మయన్మార్‌కు తిరిగొచ్చారు. ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలపై జరుగుతున్న క్రూరమైన దాడులు ఆమెను కలచివేశాయి. దీంతో ఆమె ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలోకి అడుగుపెట్టారు. దీంతో సైనిక పాలకులు ఆమెను 15 ఏళ్లు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ ప్రతిఘటనలో చివరికి విజయం సాధించారు.
గాంధీ బాటలో..
‘‘మహాత్ముడు నాకు ఆరాధ్యుడు. ఆయనో గొప్ప మానవతావాది. మనుషుల జీవితాల్ని లోతుగా అర్థంచేసుకున్న మహనీయుడు. గాంధీ జీవితం నాకు ఎంతగానో స్ఫూర్తి’’
- దలైలామా
టిబెటన్ల హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం సాగిస్తున్న దలైలామా చెప్పిన మాటలివి. గాంధీజీ అహింసాయుత ఆందోళనల్ని స్ఫూర్తిగా తీసుకుని దలైలామా- టిబెట్‌లో చైనా అణచివేతలపై పోరాడుతున్నారు.

మహాత్ముడిగా మలిచింది వీరే...
మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడిగా పరివర్తన చెందడం వెనుక ప్రభావం చూపిన వ్యక్తులెందరో.. ఉపకరించిన పుస్తకాలెన్నో!! రాయ్‌చంద్‌భాయ్‌, గోపాలకృష్ణ గోఖలేలను గాంధీజీ తన గురువులుగా చూసుకునేవారు. సుప్రసిద్ధ రచయితలు లియో టాల్‌స్టాయ్‌, జాన్‌ రస్కిన్‌ల పుస్తకాలు, అమెరికా రచయిత హెన్రీ డేవిడ్‌ థోరో దృక్పథం గాంధీజీని మహోన్నతుడిగా తీర్చిదిద్దాయి. భగవద్గీతాసారం, బైబిల్‌, ఉపనిషత్తులు గాంధీజీకి జీవితాంతం స్ఫూర్తిగా నిలిచాయి.
రాయ్‌ చంద్‌భాయ్‌
(శ్రీరాజ్‌చంద్ర)
జైన సిద్ధాంతి రాయ్‌చంద్‌భాయ్‌ 1867లో గుజరాత్‌లో జన్మించారు. ప్రపంచ ఒత్తిళ్లకు దూరంగా, స్వయం నిష్ఠతో ఎదిగిన తపస్వి ఈయన. గాంధీజీ లండన్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే బొంబాయిలో రాయ్‌చంద్‌భాయ్‌ని కలుసుకున్నారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వం, నిజాయితీ గాంధీజీని కట్టిపడేశాయి. శ్రీరాజ్‌చంద్రతో అనుబంధాన్ని గాంధీ ఎంతో ఇష్టపడేవారు. రాజ్‌చంద్రను తన ఆధ్యాత్మిక గురువుగా, ఆదర్శప్రాయుడిగా చెప్పుకొన్నారు. ఆయనకు తరచూ ఉత్తరాలు రాసేవారు. హిందూ పవిత్ర గ్రంథాలను సునిశితంగా చదవడంలో రాజ్‌చంద్ర నుంచి గాంధీజీ స్ఫూర్తిపొందారు.
గోపాల కృష్ణ గోఖలే
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1866లో జన్మించిన గోపాలకృష్ణ గోఖలే గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, ప్రొఫెసర్‌. భారత జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత, సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీని స్థాపించిన వ్యక్తి. ఆధునిక రాజకీయాల్లో అణిముత్యం అనదగిన గోఖలేతో పరిచయం గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పింది. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన వ్యక్తిగా ఆయనను ఆరాధించేవారు. తన జీవిత చరిత్ర పుస్తకంలో గాంధీజీ గోఖలేకు ఏడు అధ్యాయాల్ని కేటాయించారు.
టాల్‌స్టాయ్‌
సుప్రసిద్ధ రచయిత లియో టాల్‌స్టాయ్‌ రష్యాలో 1828లో జన్మించారు. ఏసుక్రీస్తు బోధించిన అహింసతో మానవాళి ఏదైనా సాధించగలదనేది టాల్‌స్టాయ్‌ అభిప్రాయం. దీనినే ఆయన తన పుస్తకం ‘ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ వితిన్‌ యూ’లో బలంగా వాదించారు. ఈ పుస్తకం గాంధీజీ జీవితంపై ఎనలేని ప్రభావాన్ని చూపింది. టాల్‌స్టాయ్‌తో గాంధీకి సుదీర్ఘ అనుబంధం. ఇద్దరూ పరస్పరం ఉత్తరాలు రాసుకునేవారు. సత్యం, నైతికతలపై ఇద్దరిదీ ఒకే అభిప్రాయం. ఇద్దరికీ బుద్ధుడు, మహమ్మద్‌ ప్రవక్త, సోక్రటీస్‌లు హీరోలు. గాంధీ, టాల్‌స్టాయ్‌లు తాము నమ్మిన సిద్ధాంతాల్ని మానవాళికి బోధించిన తాత్వికులు. టాల్‌స్టాయ్‌ అంటే గాంధీకి అపార గౌరవం ఉండేది. అందుకే దక్షిణాఫ్రికాలో తాను ఏర్పాటుచేసిన ఆశ్రమానికి ‘టాల్‌స్టాయ్‌ ఫాం’ అని గాంధీజీ నామకరణం చేసుకున్నారు.
జాన్‌ రస్కిన్‌
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శ్రేయోభిలాషి అయిన జాన్‌ రస్కిన్‌ 1819లో బ్రిటన్‌లో జన్మించారు. విక్టోరియా హయాంలో గొప్ప విమర్శకుడిగా పేరొందిన రస్కిన్‌ నాలుగు వ్యాసాల సంకలనమైన ‘అన్‌టు దిస్‌ లాస్ట్‌’ పుస్తకాన్ని 1862లో వెలువరించారు. పారిశ్రామిక పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని, ప్రపంచానికి అది చేస్తున్న నష్టాల్ని అందులో తూర్పారబట్టారు. అందరి సంక్షేమంలోనే వ్యక్తి శ్రేయస్సు ఉందని, పనిచేసి సంపాదించే, జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కార్మికుడి జీవితమూ ఎంతో విలువైనదనే రస్కిన్‌ వాదనలు గాంధీని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్‌టు దిస్‌ లాస్ట్‌ పుస్తకాన్ని గాంధీజీ ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీలోకి అనువదించారు.
హెన్రీ డేవిడ్‌ థోరో
రచయిత, సిద్ధాంతకర్త, పన్నల వ్యతిరేకి, చరిత్రకారుడు అయిన హెన్రీ డేవిగ్‌ థోరో 1817లో అమెరికాలో జన్మించారు. పౌరహక్కులు, సామాజిక శ్రేయస్సుపై ఆయన చేసిన రచనలెన్నో మానవాళిని కదిలించాయి. థోరో రాసిన ‘వాల్డెన్‌’ పుస్తకాన్ని 1906లో గాంధీజీ చదివారు. శాసనోల్లంఘనపై డేవిడ్‌ థోరో రాసిన వ్యాసం గాంధీజీని ఎంతగానో కదిలించింది. స్వయం సమృద్ధిపై థోరోకున్న బలమైన అభిప్రాయాలు, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడటం(ఆఖరికి జైలుకైనా వెళ్లడానికి సిద్ధపడటం) గాంధీజీ ఆశయాలపై ప్రభావం చూపాయి.
ఒక రుషితో...మరో రుషి..!
ఇలాంటి మనిషి ఒకరు ఈ భూ మండలంపై నడయాడారని భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చంటూ... గాంధీజీ ఔన్నత్యాన్ని చాటుతూ 1944లో ఐన్‌స్టీన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం యథాతథంగా...
 " A leader of his People, unsupported by any outward authority, a politician whose success rests not upon craft nor the mastery of technical devices, but simply on the convincing power of his personality; a victorious fighter who has always scorned the use of force; a man of   wisdom and humility, armed with resolve and inflexible consistency, who has devoted all his strength to the uplifting of his people and the betterment of their lot; a man who has confronted the brutality of Europe with the dignity of the simple human being, and thus at all times rises superior. Generations to come, it may be, will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth."

మరిన్ని

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.