latest breaking telugu news
close

తాజావార్తలు


సైబర్‌ చోరుల అంతర్జాలం!
లావాదేవీలపై పారాహుషార్‌
రష్యా హ్యాకర్లు డెమొక్రటిక్‌ పార్టీ నేతల ఈ-మెయిళ్లను హ్యాక్‌ చేసి హిల్లరీ క్లింటన్‌ విజయావకాశాలను దెబ్బతీశారని అమెరికా నిఘా సంస్థలు సూచించాయి.
నిరుడు అక్టోబరులో సైబర్‌ నేరగాళ్లు బడా భారతీయ బ్యాంకులను హ్యాక్‌ (అంతర్జాలం ద్వారా సమాచార తస్కరణ) చేసి 30 లక్షల డెబిట్‌ కార్డుల వివరాల్ని అపహరించారు.
నవంబరులో ఏడు ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల డేటాబేస్‌లను హ్యాక్‌ చేసినవారు, వాటిలోని ఆంతరంగిక సమాచారాన్ని అంతర్జాలంలో బట్టబయలు చేశారు.
డిసెంబరులో లీజియన్‌ అనే హ్యాకర్ల బృందం రాహుల్‌ గాంధీ, విజయ్‌ మాల్య తదితరుల ట్విటర్‌ ఖాతాల వివరాలను తెలుసుకోవడమే కాదు- భారతీయ బ్యాంకులతోపాటు మొబైల్‌ వ్యాలట్‌ పేటీఎమ్‌ను హ్యాక్‌ చేయడం మహా తేలిక అని హెచ్చరించింది.
ఈ ఏడాది జనవరి రెండున పాకిస్థానీ హ్యాకర్లు భారతీయ నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) సైట్‌ను హ్యాక్‌ చేసి అందులో భారత దేశానికి వ్యతిరేకమైన సమాచారాన్ని ఉంచారు.
ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరగాళ్లు కలిగించగల నష్టమేమిటో పై ఉదంతాలు చాటిచెబుతున్నాయి. ప్రపంచంలో వారానికి మూడు కోట్ల కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అంతర్జాలానికి అనుసంధానమవుతున్నాయి. నేడు అంతర్జాలంతో అనుసంధానమైన ప్రజల వల్ల ఉత్పన్నమవుతున్న సమాచారం కన్నా 300 రెట్ల ఎక్కువ డేటా ఈ అనుసంధానిత పరికరాల ద్వారా ఉత్పన్నమవుతోంది. భారత ప్రభుత్వం 130 కోట్ల మంది భారతీయులను నగదురహిత లావాదేవీలకు మళ్లేట్లు చేయడానికి పెద్దనోట్ల రద్దును చేపట్టిన దృష్ట్యా డిజిటల్‌ లావాదేవీలు విజృంభించనున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు, ఈ-వాలెట్ల వినియోగం విస్తృతం కానుంది. మరి వీటిపై సైబర్‌ నేరగాళ్ల దాడులను నివారించి, నిరోధించగల సత్తా భారత్‌కు ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల వినియోగంలో చైనా తరవాత భారతదేశం రెండోస్థానం ఆక్రమిస్తోంది. నేడు 38.8 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఖాతాలు 2020 నాటికి 68.8 కోట్లకు పెరుగుతాయని అంచనా. 4జీ, 3జీ వినియోగం పెరుగుతున్నకొద్దీ అంతర్జాలం వేగంగా వ్యాపిస్తుంది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నందువల్ల మొబైల్‌లో నగదు చెల్లింపులు, జమలు పెరుగుతాయి. వాటితోపాటే సైబర్‌ దాడుల ముప్పూ విజృంభిస్తుంది. 2017నాటికి దేశంలో మొబైల్‌ మోసాలు 60-65 శాతం మేర పెరుగుతాయని అసోచాం, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇవాళ సెల్‌ఫోన్‌ చోరీ అయితే దానిలోని మొబైల్‌ వ్యాలట్‌లో ప్రవేశించడం నేరగాళ్లకు మహా సులువు. అయిదు కోట్లమందికి పైగా వినియోగదారులున్న పేటీఎం పాస్‌వర్డ్‌ ఆధారిత ధ్రువీకరణ విధానాన్ని ఉపయోగించకపోవడం వల్ల సైబర్‌ చోరీలకు తలుపులు బార్లా తెరచినట్లవుతోంది.

భద్రత తక్షణావసరం
సైబర్‌ నేరాలు పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో మరింత అప్రమత్తత అవసరం. 2011లో భారత్‌లో 13,301 సైబర్‌ నేరాలు జరగ్గా, 2015నాటికి అవి మూడు లక్షలకు పెరిగాయి. మన విద్యుత్‌ గ్రిడ్‌లు, అణు విద్యుత్‌ ప్లాంట్లు, స్వయంచాలిత ఉత్పత్తి సంస్థలు, రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ, విమాన ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలకు సైబర్‌ దాడుల నుంచి పకడ్బందీ రక్షణ లేకపోవడం పెద్ద దుశ్శకునం. ఇప్పటికే ర్యాన్‌సమ్‌ వేర్‌ దాడులకు అత్యధికంగా ఎర అవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉందని రష్యన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ క్యాస్పర్‌ స్కీ ల్యాబ్‌ హెచ్చరించింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లలోకి చొరబడి, జనం ఆన్‌లైన్‌లో డబ్బు ముట్టజెప్పేదాకా వాటిని స్తంభింపజేసే సాఫ్ట్‌వేర్‌- ర్యాన్‌సమ్‌ వేర్‌. అమెరికా సంస్థలు తమపై సైబర్‌ దాడి ఏదైనా జరిగితే వెంటనే దాని గురించి ప్రకటించాల్సి ఉంటుంది. భారతదేశంలో అలాంటి నిబంధనేదీ లేకపోవడంతో మన సంస్థలు సైబర్‌ దాడులు జరిగినా వాటి గురించి చెప్పడంలేదు. సంపన్న దేశాల్లో ఎక్కడ, ఎప్పుడు సైబర్‌ దాడి జరిగినా అందరూ తక్షణం అప్రమత్తమై నిరోధక చర్యలు తీసుకుంటారు. భారత్‌లో ఈ పరిస్థితి లేదు. దేశంలోని 2.30 లక్షల ఏటీఎమ్‌లలో 75 శాతం మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తున్నాయి. 2014 నుంచి ఎక్స్‌పీ సిస్టమ్‌లకు మైక్రోసాఫ్ట్‌ మద్దతు ఆగిపోవడంతో హ్యాకర్లకు అడ్డు లేకుండాపోయింది. రిజర్వు బ్యాంకు ఆదేశాన్ని పురస్కరించుకుని అన్ని బ్యాంకులూ సమగ్ర భద్రతా వ్యవస్థను అమర్చుకొంటున్నా, అది పూర్తయ్యేలోపు హ్యాకర్లు ఎంతగానో తెలివిమీరిపోతున్నారు.

భారత్‌ భద్రత సొంత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను రూపొందించుకోనంతవరకు మన డిజిటల్‌ మౌలిక వసతులకు ప్రమాదం తప్పదు. సైబర్‌ నేరాల నిరోధం కోసం చట్టాన్ని మరింత పరిపుష్టీకరించాలి. ఆధార్‌ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం అందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంపై శ్రద్ధ పెట్టాలి. డిజిటల్‌ లావాదేవీలు జరిగినప్పుడు సంబంధిత ఖాతాదారుడి ఆధార్‌ వివరాలతోపాటు వ్యక్తిగత వివరాలూ చోరీ అవుతాయి. భారత్‌లో సైబర్‌ భద్రత చాలా బలహీనం కాబట్టి నేరగాళ్లు మన పౌరుల గుర్తింపును సులువుగా దొంగిలించగలరు. అమెరికా, ఐరోపా దేశాలు తమ పౌరుల గుర్తింపును కాపాడుకోవడానికి మూడు, నాలుగో తరం భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తుంటే, మనదేశం ఇప్పటికీ ఒకటో తరం వ్యవస్థలకే పరిమితమైంది. అంతేకాదు, వ్యక్తిగత గోప్యతా పరిరక్షణకు కాని, సమాచార చౌర్య నిరోధానికి కాని భారత్‌ ఇంతవరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకోలేకపోయింది. ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం జాతీయ భద్రతా విధానాన్ని ప్రకటించినా దాని అమలులో పురోగతి లేదు. సమాచార చౌర్యం జరిగినప్పుడు వినియోగదారులకు పరిష్కారం చూపే ఏర్పాట్లు ప్రస్తుత సమాచార పరిజ్ఞాన(ఐటీ) చట్టంలో లేనే లేవు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు భారతీయ కంప్యూటర్‌ శీఘ్ర స్పందన బృందం (సెర్టిన్‌) కింద రెండు ప్రత్యేక దళాలను నెలకొల్పింది. ఒక దళం సైబర్‌ దాడులపై, రెండో దళం డిజిటల్‌ చెల్లింపులపై నిఘా వేస్తుంది. లీజియన్‌ దాడుల తరవాత ఆర్థిక రంగ ఆడిట్‌కు కేంద్ర సమాచార పరిజ్ఞాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ)ని స్థాపించడంతో దానికి పటిష్ఠమైన సైబర్‌ భద్రత కల్పించడం తప్పనిసరి అయింది. సైబర్‌ దాడులను వెనువెంటనే ఎదుర్కోవడానికి కేంద్రం నెలకొల్పిన జాతీయ సైబర్‌ సమన్వయ సంఘం (ఎన్‌పీసీసీ) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆన్‌లైన్‌ దాడుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి 2000 సంవత్సర సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టాన్ని సమీక్షించాలని ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది. వచ్చే పదేళ్లలో సైబర్‌ దాడుల నిరోధానికి తీసుకోవలసిన చర్యలను నాస్కామ్‌, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ)లు సిఫార్సు చేశాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్‌ సాధనాల్లో చేరిపోయే వైరస్‌లు, మాల్‌వేర్లను తొలగించడానికి ‘బాట్‌నెట్‌’ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ప్రతిపాదనలు కార్యరూపం ధరించే లోపే సైబర్‌ నేరగాళ్లు అంతకంతకూ ఆధునిక పద్ధతులను ప్రయోగిస్తున్నారు. చివరికొచ్చేసరికి ప్రభుత్వ ప్రణాళికలు నిరుపయోగమయ్యే ప్రమాదం ఉంది. సైబర్‌ దాడులను నిర్వీర్యం చేసే సరికొత్త టెక్నాలజీలను, పరికరాలను సమకూర్చుకోవడంలో భారత్‌ ఇంకా వెనకబడే ఉండటం దీనికి కారణం. ఈ లోపాన్ని ప్రభుత్వం తక్షణం సరిదిద్దుకోవాలి.

కిం కర్తవ్యం?
సైబర్‌ నేరాల సెగ ఇప్పటికే మనకు తగులుతున్నందువల్ల దాన్ని ఇంకెంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. దీన్ని ఎదుర్కోవడానికి వడివడిగా చర్యలు తీసుకోవాలి. మొదట డిజిటల్‌ చెల్లింపులకు వేదిక కల్పించే సంస్థలన్నీ పేమెంట్‌ కార్డ్‌ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్‌ (పీసీఐ డీఎస్‌ఎస్‌) 2.0 భద్రతా ధ్రువీకరణను అందించాలి. బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైబర్‌ భద్రత పట్ల ఖాతాదారుల్లో అవగాహన పెంచాలి. చెల్లింపు సంస్థల సాంకేతిక సాధన సంపత్తి ఎప్పటికప్పుడు ఆధునికంగా ఉండేట్లు ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం ఇనుమడిస్తున్నందువల్ల ప్రభుత్వంతోపాటు వినియోగదారులూ తమ జాగ్రత్తలో తాముండాలి. ప్రభుత్వం, వ్యాపార, వ్యాపారేతర సంస్థలు, తమ కార్య నిర్వహణ వ్యవస్థల్లో సైబర్‌ భద్రతా ఏర్పాట్లను కీలక అంతర్భాగం చేయాలి. సామాన్య పౌరుడు కూడా సైబర్‌ ముప్పులను ఆకళింపు చేసుకొన్నప్పుడు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలు విజయవంతం కావడం తథ్యం. స్వచ్ఛ భారత్‌ను చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులకు సైబర్‌ భద్రత కల్పించడానికి సురక్షిత భారత్‌ కార్యక్రమాన్నీ ప్రారంభించాలి. దీనికితోడు సైబర్‌ భద్రతా నిపుణులను తయారుచేసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. 2015లో 7,500 కోట్ల డాలర్లుగా ఉన్న సైబర్‌ భద్రతా విపణి 2020నాటికి 17,000 కోట్ల డాలర్లకు విస్తరించనుంది. 2019కల్లా ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది సైబర్‌ భద్రతా నిపుణులు అవసరపడతారని సిస్కో సంస్థ 2015 నివేదికలో లెక్కగట్టింది. కానీ, అంతమంది తయారయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నేడు ఒక్క అమెరికాలోనే సరైన నిపుణులు దొరక్క 2.09 లక్షల సైబర్‌ భద్రతా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భారతదేశంలో వ్యాపార, సైనిక సమాచారాన్ని కాపాడుకోవడానికి పది లక్షలమంది సైబర్‌ భద్రతా నిపుణులు అవసరమవుతారని నాస్కామ్‌ అంచనా వేసింది. ఈ గిరాకీని తీర్చాలంటే నైపుణ్య భారత్‌ కార్యక్రమం కింద సైబర్‌ భద్రతనూ నేర్పాలి. సైబర్‌ భద్రత లేనిదే డిజిటల్‌ ఇండియా, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేయలేవు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.