సమీక్ష

జ్ఞాపకాల పూలతోట

జీవితమే ఓ మహానాటకం. ఆ మలుపుల్ని ఓ పట్టాన వూహించలేం. ఉత్తరప్రదేశ్‌లోని జమీందారీ కుటుంబంలో పుట్టిన కైఫీ ఆజ్మీ...ఇల్లు వదిలి వచ్చేశాడు. ముంబయి కార్మిక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. ఓ ముషాయిరా కోసమని హైదరాబాద్‌ వచ్చి...నిజాం సంస్థానంలో ఉన్నతోద్యోగి కూతురైన షౌకత్‌తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. కైఫీ దశాబ్దాలపాటూ ఉర్దూ కవితా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. షౌకత్‌ రంగస్థలంమీదా, సినిమాలమీదా తనదైన ముద్రవేశారు. కళాకారులుగా ఎవరి ప్రత్యేకత వారిదే అయినా, వ్యక్తులుగా మాత్రం...అర్దనారీశ్వరతత్వమే. ఆ అనుబంధానికి షౌకత్‌ అక్షరరూపమే ‘తలపుల తోవ’. ఇందులో పాఠ్యపుస్తకాలకెక్కని అసలు సిసలు చరిత్ర ఉంది, సున్నితత్వంలో పూలరెక్కలతో పోటీపడే ప్రేమభావన ఉంది. అక్కడక్కడా మృదుమధురమైన ఉర్దూ కవిత్వం వినిపిస్తుంది.

తలపుల తోవ
కైఫీ ఆజ్మీతో అర్ధ శతాబ్ది
రచన: షౌకత్‌ కైఫీ; తెలుగు: ఎన్‌ వేణుగోపాల్‌
పేజీలు: 160; వెల: రూ.100/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
- చక్రపాణి


ఓ యోధుడి కథ

శ్యపాపురం అనే రాజ్యం చుట్టూ అల్లుకున్న చారిత్రక నవల ఇది. చిన్నచిన్న రాజ్యాల అనైక్యతనూ, ప్రజల్లోని అసంతృప్తినీ, పాలన వ్యవస్థలోని బలహీనతలనూ, సామాజిక పరిస్థితుల్నీ ఆసరాగా చేసుకుని... ఉమ్మాయద్‌ అనే పాలకుడు సైన్యాన్ని పంపి కోటను ఆక్రమించుకుంటాడు. శత్రువుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువరాజు ప్రాణాలు కోల్పోతాడు. అతడి మిత్రుడూ చాణక్యవంశజుడూ అయిన నరేంద్రుడు... ఓ తండాలో ఆశ్రయం పొందుతాడు. ఆ గిరిజనుల నాయకుడు నిలువెత్తు విజ్ఞానసర్వస్వం. అతడి సమక్షంలోనే...అసలు సిసలు చరిత్రనూ హేతువాదాన్నీ తెలుసుకుంటాడు. గిరిజన దండు సాయంతో తురుష్క పాలకుల్ని ఓడించి...ప్రజాపాలనా వ్యవస్థను నెలకొల్పడంతో నవల ముగుస్తుంది.

కశ్యప యోధుడు (నవల)
రచన: డాక్టర్‌ జూకూరి
పేజీలు: 260; వెల: రూ.200/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తక కేంద్రాలు.
- బి.గోపాలకృష్ణ


అచ్చమైన మధ్యతరగతి

నిజమే, మధ్యతరగతి జీవితాలకు మించిన కథా వస్తువు ఏం ఉంటుంది? గొప్పగా సుఖపడుతున్న దాఖలాలుండవు, అలా అని అడుక్కుతిని బతకాల్సిన దుస్థితీ అఘోరించదు. ఒకట్రెండు ఆస్తులుంటాయి, ఆ మేరకు అప్పులూ ఉంటాయి. ఓ వైపు బంధాల కోసం సర్వస్వమూ ధారపోయాలన్న తపన, మరోవైపు అడుగు ముందుకేయనివ్వని ఆర్థిక పరిమితులు. ఆ విస్తృత జీవన వైవిధ్యమే రచయిత్రి చంగల్వల కామేశ్వరితో ‘చెప్పుకుంటే కథలెన్నో...’ శీర్షికతో ఇన్ని కథలు రాయించింది. ‘దెబ్బతిన్న మనసు’ తరాల పురుషాధిపత్యాన్ని నిర్భయంగా నిలదీస్తుంది. ‘పిపాసి’లోనూ ఆ తరహా నిలదీతే కనిపిస్తుంది. ‘కొత్తజన్మ’ మగవాడి పొగడ్తలకు పడిపోయే అమాయక మహిళలకు ఓ హెచ్చరిక.

చెప్పుకుంటే కథలెన్నో...
రచన: కామేశ్వరి చెంగల్వల
పేజీలు: 168; వెల: రూ.120/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- ప్రతాప్‌


తెలుగు దిగ్గజాలు

‘విశాలాంధ్రము’...ఎనభై ఎనిమిది మంది తెలుగు ప్రముఖుల జీవన చిత్రణల సమాహారం. బులుసు సాంబమూర్తి, టంగుటూరి ప్రకాశం, కె.కోటిరెడ్డి, కొమ్మూరి కాశీవిశ్వనాథం...ఇలా ఎవరికివారు ఉద్దండులే. నమ్మిన విలువల కోసం సర్వస్వమూ ధారపోసిన త్యాగధనులే. ఆవటపల్లి నారాయణరావు...ఆయా ప్రముఖుల జీవితాల్నీ ఆలోచనల్నీ కళ్లకు కట్టినట్టు రాశారు. ఆ భాష జీవనదిలా సాగిపోతుంది. అందులోనూ ఆయన ఎంచుకున్న నాటకీయ శైలి పాఠకుడిని వూపిరి తిప్పుకోనివ్వదు. 1940లో తొలిముద్రణ వచ్చిన ఈ పుస్తకాన్ని మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో... బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌వారు వెలుగులోకి తీసుకొచ్చారు.

విశాలాంధ్రము
రచన: ఆవటపల్లి నారాయణరావు
సంపాదకులు: మోదుగుల రవికృష్ణ
పేజీలు: 279; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- రామకృష్ణ


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.