Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: జుమాంజి-వెల్‌కమ్‌ టు ది జంగిల్‌
చిత్రం: జుమాంజి- వెల్‌కమ్‌ టు ది జంగిల్‌(ఇంగ్లిష్‌)
నటీనటులు: డ్వేన్‌ జాన్సన్‌.. జాక్‌ బ్లాక్‌.. కెవిన్‌ హర్ట్‌.. కరెన్‌ గిలాన్‌.. నిక్‌ జోన్స్‌.. బాబీ కేనవేల్‌ తదితరులు
కథ: క్రిస్‌ మెకెన్నా
మూలం: జుమాంజి నవల
సినిమాటోగ్రఫీ: గ్యూలా పాడోస్‌
సంగీతం: హెన్నీ జాక్‌మెన్‌
నిర్మాణం: మాట్‌ టోల్‌మాచ్‌, విలియమ్‌ టైట్లర్‌
దర్శకత్వం: జేక్‌ కాస్డన్‌
విడుదల తేదీ:29-12-2017

1995లో విడుదలైన ‘జుమాంజి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. క్రిస్‌ వ్యాన్‌ ఆల్స్‌బర్గ్‌ రచించిన ‘జుమాంజి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 2005లోనూ ఈ నవల ఆధారంగా ‘జుమాంజి: జతురా’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. అయితే.. ‘జుమాంజి’ సినిమాకి మొదటి సీక్వెల్‌గా ‘జుమాంజి: వెల్‌ కమ్‌ టు ది జంగిల్‌’ను తెరకెక్కించారు. కొన్నేళ్ల కిందటి సినిమాకి సీక్వెల్‌ కావడంతోపాటు ఇందులో హాలీవుడ్‌ స్టార్‌ హీరో డ్వేన్‌ జాన్సన్‌ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అమెరికాలో డిసెంబర్‌ 20న విడుదలై కలెక్షన్లు రాబడుతున్న ఈ చిత్రం శుక్రవారం భారత్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది?

కథేంటంటే?: 1996లో అలెక్స్‌ అనే బాలుడు బీచ్‌లో ఆడుకుంటుండగా ‘జుమాంజి’ బోర్డు గేమ్‌ దొరుకుతుంది. కానీ, ఆడటానికి ఇష్టపడని అలెక్స్‌ దాన్ని మూలకు పడేస్తాడు. దీంతో బోర్డు గేమ్‌ కాస్తా వీడియో గేమ్‌ క్యాసెట్‌లా మారిపోతుంది. 20ఏళ్ల తర్వాత నలుగురు యువతీయువకులకు ఆ క్యాసెట్‌ లభిస్తుంది. దాన్ని టీవీకి అనుసంధానించి గేమ్‌ ఆడటం మొదలుపెడతారు. వెంటనే ఆ నలుగురూ టీవీగేమ్‌లోకి వెళ్లిపోతారు. ఓ అటవీ ప్రాంతంలో తిరిగే గేమ్‌లోని నాలుగు పాత్రల్లోకి చేరిపోతారు. అంతేకాదు ఆ అడవిలో అనేక సమస్యల్లో చిక్కుకుంటారు. మరి వాటికి ఎలా ఎదుర్కొన్నారు? ఆ నలుగురూ తిరిగి వాస్తవ ప్రపంచంలోకి వచ్చారా? అన్నదే కథ!

ఎలా ఉందంటే?: అనుకోకుండా వీడియో గేమ్‌ పాత్రల్లో చేరిపోయిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి బయటపడేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. దర్శకుడు జాక్‌ కాస్డన్‌ దీన్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. బోర్డ్‌ గేమ్‌ను వీడియోగేమ్‌గా మార్చి ప్రస్తుత కాలానికి అనుగుణంగా కథను మలిచారు. అది ఆటే అయినా గేమ్‌ నియమాలు అనుసరిస్తూ నిజమైన వ్యక్తులతో గేమ్‌ను ఆడించడం ఆసక్తిగా ఉంటుంది. దీంతో నేటి చిన్నారులకు ఈ సినిమా నచ్చుతుంది. తొలి చిత్రంలోని కొన్ని అంశాలు అలాగే ఉంచి.. కొత్తగా మరికొన్ని అంశాలు జోడించడంతో పాత్రలు చేసే విన్యాసాలు.. పోరాటాలు అలరిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలు లాజిక్‌ లేకుండా సాగుతుంటాయి. కానీ, కథ-కథనం ఆ భావన కలగకుండా చేస్తాయి. 3డీలో చూసే వారు మాత్రం వినూత్న అనుభూతి పొందడం ఖాయం. చాలా వరకు సంభాషణలు హాస్యభరితంగా ఉండి నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే?: డ్వేన్‌ జాన్సన్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. సినిమా ఆసాంతం ఎంతో చలాకీగా.. హుషారుగా నటించాడు. గత చిత్రాల్లో డ్వేన్‌ కామెడీ చేసినా.. ఇందులో తను చేసే కామెడీ అతడిలోని కొత్త కోణాన్ని చూపిస్తుంది. కెవిన్‌ హర్ట్‌ తన కామెడీ టైమింగ్‌తో పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. ఓ యువతి గేమ్‌లోని పురుష పాత్రలో చేరగా, ఆ పాత్రలో నటించిన జాక్‌ బ్లాక్‌ మహిళలాగే ప్రవర్తిస్తూ ఆకట్టుకున్నాడు. కారెన్‌ గిల్లాన్‌ కేవలం ఆకర్షణకే కాకుండా మంచి నటన కనబర్చింది. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా..: క్రిస్‌ మెకెన్నా రాసిన కథను ఎంతో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు జాక్‌ కాస్డెన్‌. అడవిలో ఉండే జంతువులు.. గుట్టలు, కొండలను చక్కగా చూపించాడు. ప్రతీ పాత్రను కథలో భాగం చేశాడు. సంగీతం సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు హెన్రీ జాక్‌మెన్‌ తన నేపథ్య సంగీతంతో సన్నివేశాల్ని మరింత ఆసక్తిగా మలిచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
+ కథ
+ డ్వేన్‌ జాన్సన్‌
+ సంగీతం
+ దర్శకత్వం

బలహీనతలు
- లాజిక్‌ లేని సన్నివేశాలు
చివరిగా: ‘జుమాంజి గేమ్‌’ అలరిస్తుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.