Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ఇన్సీడియస్‌-ది లాస్ట్‌ కీ
చిత్రం: ఇన్సీడియస్‌-ది లాస్ట్‌ కీ(ఇంగ్లిష్‌)
నటీనటులు: లిన్‌ షాయే.. అంగస్‌ సామ్సన్‌.. జోష్‌ స్టెవార్ట్‌ తదితరులు
కథ: లీ వానెల్‌
సినిమాటోగ్రఫీ: టొబి ఒలివర్‌
సంగీతం: జోసెఫ్‌ బిషరా
నిర్మాణం: బ్లమ్‌హౌస్‌ ప్రొడక్షన్స్‌, స్టేజ్‌ 6 ఫిల్మ్స్‌
దర్శకత్వం: ఆడమ్‌ రాబిటెల్‌
విడుదల తేదీ: 05-01-2018

హారర్‌ చిత్రాలు ఏ చిత్రసీమలో వచ్చినా.. ప్రేక్షకులు ఆదరిస్తారు. ముఖ్యంగా హాలీవుడ్‌ హారర్‌ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెడుతూ ఆకట్టుకుంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే ‘ఇన్సీడియస్‌’. 2010లో తక్కువ బడ్జెట్‌తో హారర్‌ సినిమాగా వచ్చి వూహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో 2013లో ‘ఇన్సీడియస్‌- చాప్టర్‌2’, 2015లో ఇన్సీడియస్‌-చాప్టర్‌3’ సీక్వెల్స్‌ తీశారు. ఆ చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా మూడో సీక్వెల్‌గా ‘ఇన్సీడియస్‌-ది లాస్ట్‌ కీ’ తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరీ గత చిత్రాలతో పోటీగా భయపెట్టిందా? ప్రేక్షకులను మెప్పించిందా?

కథేంటంటే?: పారాసైకాలజిస్టు డా.ఎలిస్‌ రైనిర్‌(షాయే)తన ఇద్దరు మిత్రులు స్పెక్స్‌(వానెల్‌), టక్కర్‌(అంగస్‌ సామ్సన్‌)లతో కలిసి ఆత్మలను కనిపెట్టే ఓ సంస్థను నిర్వహిస్తుంటుంది. ఓ రోజు ఆమెకు న్యూ మెక్సికోలోని ఫైవ్‌ కీస్‌ పట్టణం నుంచి టెడ్‌ గార్జా(కిర్క్‌ ఎసివెడో)అనే వ్యక్తి ఫోన్‌ చేసి తమ ఇంట్లో చిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని.. తమని రక్షించమని కోరతాడు. కానీ, ఎలిస్‌ అతడి వద్దకు వెళ్లేందుకు విముఖత చూపుతుంది. ఆ తర్వాత ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఫైవ్‌ కీస్‌లోని టెడ్‌ ఇంటికి వెళ్లి సమస్య ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తన స్నేహితులతో కలిసి ఆ ఇంటికి వెళ్తుంది. అయితే ఎలిస్‌ బాల్యం ఆ ఇంట్లోనే గడవటం ఆసక్తికర విషయం. అక్కడికి చేరుకున్న ఎలిస్‌కు తన చిన్ననాటి గుర్తులు వేధిస్తూ.. అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. ఆత్మలు.. ఆమె వెంట పడుతుంటాయి. ఇంతకీ ఆ ఆత్మలు ఆమె వెంట ఎందుకు పడుతున్నాయి? తనకు ఎదురైన సమస్యలు ఎలా పరిష్కరించకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: కథలో పెద్దగా కొత్తదనం లేకున్నా స్క్రీన్‌ప్లేతో సినిమాని ఆసాంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు దర్శకుడు. హారర్‌ చిత్రంలో భయపెట్టడమే ఒక్కటే ప్రధానంగా చూసే ప్రేక్షకుడికి ఈ చిత్రంలో ఫ్యామిలీ సెంట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది. ఈ సిరీస్‌ గత చిత్రాల్లోని పాత్రలు.. సన్నివేశాలకు, ఎలిస్‌ బాల్యానికి ముడి పెట్టి కథను నడిపించారు. చాలా సీరియస్‌గా వెళ్తున్న సన్నివేశాల మధ్య ఎలిస్‌ సహోద్యోగులు పండించే హాస్యం అలరిస్తుంది. సంగీతం కూడా చిత్రానికి బలం చేకూర్చింది. ఆత్మలు కంటపడే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం ప్రేక్షకులను చాలానే భయపెట్టిస్తుంది.

ఎవరెలా చేశారంటే?: ప్రధాన పాత్రధారి లిన్‌ షాయే కథను తన భూజాలపై వేసుకొని నడిపించింది. ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా నటించి మెప్పించింది. అంగస్‌ సామ్సన్‌, లి వానెల్‌లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. రోటీన్‌ కథనే పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు ఆడ‌మ్‌ రాబిటెల్‌. నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఉత్కంఠ భరితంగా మార్చింది. సినిమాట్రోగ్రఫీ విషయానికి వస్తే.. ఎక్కువగా చీకటి, పొగకు ప్రాధాన్యమిచ్చి చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా: ‘ఇన్సీడియస్‌’ ఇబ్బంది పడకుండా.. భయపడుతూ చూడొచ్చు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.