Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ


రివ్యూ: ఇది నా ల‌వ్‌స్టోరీ
చిత్రం: ఇది నా ల‌వ్‌స్టోరీ
న‌టీన‌టులు: త‌రుణ్‌.. ఓవియా.. ఖయ్యూం.. మంచు మ‌నోజ్ (అతిథి పాత్ర‌లో) త‌దిత‌రులు
స‌ంగీతం: శ్రీనాథ్ విజ‌య్‌
ఛాయాగ్ర‌హ‌ణం: క‌్రిస్టోఫ‌ర్ జోసెఫ్‌
కూర్పు: శ‌ంక‌ర్‌
నిర్మాత‌: ఎస్‌.వి.ప్ర‌కాష్‌
ద‌ర్శ‌క‌త్వం:  ర‌మేష్.. గోపి
సంస్థ‌: రామ్ ఎంటర్ టైనర్స్
విడుద‌ల‌: 14-02-2018

ప్రేమికుల రోజు... ప్రేమ‌క‌థా చిత్రం... ల‌వ‌ర్‌బోయ్ ఇమేజ్ ఉన్న క‌థానాయ‌కుడు. ఇంతకు మించిన కాంబినేష‌న్ ఇంకేం ఉంటుంది?  ఒక‌ప్పుడు వ‌రుస‌గా ప్రేమ‌క‌థా చిత్రాలు చేసి ల‌వ‌ర్‌బోయ్ అనిపించుకొన్న త‌రుణ్ విజ‌యం అందుకొని చాలా కాల‌మైంది. మ‌ధ్య‌లో సుదీర్ఘ‌మైన విరామం వ‌చ్చింది. కానీ, ఆయ‌న త‌న‌కున్న ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌రోసారి ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొని `ఇది నా ల‌వ్‌స్టోరీ` చేశాడు. ప్రేమికులంతా పండుగ జ‌రుపుకొంటున్న వేళ విడుద‌లైన ఆ ప్రేమ‌క‌థా చిత్రం ఎలా ఉంది? అందులో త‌రుణ్ ఎలా ఒదిగిపోయాడు?

కథేంటంటే: అభిరామ్‌(తరుణ్‌) ఓ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. తన చెల్లెలి కోరిక మేరకు ఆమె ప్రేమించిన అబ్బాయి అరవింద్‌ కోసమని అరకు వెళ్తాడు. దారి మధ్యలోనే ఒక అందమైన అమ్మాయిని చూసి.. మనసు పారేసుకుంటాడు. అరవింద్‌ ఇంటికి వెళ్లగానే అక్కడ అంతకుముందు దారిలో చూసిన ఆ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అన్నయ్య వాళ్లు బయటకు వెళ్లారని తను అరవింద్‌ చెల్లెలు శ్రుతి(ఒవియా) అని పరిచయం చేసుకుంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇద్దరూ ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటారు. ఇద్దరి జీవితాల్లో ప్రేమ చేసిన గాయం గురించి చెప్పుకొంటారు. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడతారు. అంతలోనే శ్రుతి పోలీసులకు ఫోన్‌ చేసి అభిరామ్‌ను అరెస్టు చేయిస్తుంది. అలా ఎందుకు చేసింది? అభిరామ్‌ చేసిన తప్పేంటి? శ్రుతి నిజంగా అరవింద్‌ చెల్లెలేనా? ఇందులో అభియన అనే అమ్మాయి కథేంటి? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కన్నడలో విజయవంతమైన ‘సింపుల్‌ ఆగి ఒందు లవ్‌స్టోరీ’కి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమిది. మూడు కోణాల్లో ఓ ప్రేమకథతో దీనిని రూపొందించారు. ప్రేమకథలకు మంచి ఫీల్‌తో పాటు నాయకనాయికల మధ్య కెమిస్ట్రీ ముఖ్యం. కానీ, దర్శకులు ఆ విషయాన్ని మర్చిపోయి. కేవలం సంభాషణలపైనే దృష్టి పెట్టారు. తమ పాండిత్యం ప్రదర్శించుకోవడానికే అన్నట్లు అయిన దానికీ, కాని దానికీ పాత్రలతో పేజీల కొద్దీ సంభాషణలు పలికిస్తూ సినిమాను పక్కదారి పట్టించారు. ఆ సంభాషణలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. ‘కుక్క బిస్కెట్లలో కుక్క ఉండదు గానీ, క్రీమ్‌ బిస్కెట్లలో క్రీమ్‌ ఉంటుంది’, ‘హారన్‌ కొడితే సైడ్‌ వస్తుంది.. స్మైల్‌ ఇస్తే లిఫ్ట్‌ వస్తుంది.’ తరహా సంభాషణలు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి. కుక్క ఫిలాసఫీ నేపథ్యంలోనే సినిమాలో ఒక ఆరేడు సంభాషణలు వస్తాయంటే ఆ ఉద్ధృతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెరపై నాయకనాయికల ప్రేమ కథలు సాగే విధానం కూడా గందరగోళంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్తలో కాస్త ఉపశమన. అయితే పతాక సన్నివేశాలను సాగదీయడంతో సినిమా సంతృప్తినివ్వదు. తరుణ్‌-ఓవియా జంట తెరపై అందంగా కనిపించినప్పటికీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీని పండించడంలో దర్శకులు తడబడ్డారు. చాలా సన్నివేశాలు సంభాషణల వల్లే సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కథ వరకూ చూస్తే అందులో కొత్తదనం ఉన్నప్పటికీ దాన్ని సరైన రీతిలో తెరపై చూపించలేకపోయారు.

ఎవరెలా చేశారంటే: తరుణ్‌, ఓవియా పాత్రలే సినిమాలో కీలకం. ఆ ఇద్దరి పాత్రలు మినహా తెరపై ఎప్పుడో గానీ, కొత్త పాత్ర కనిపించదు. నాయకనాయికలు ఇద్దరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి అందంగా కనిపించారు. ఇక పాటల్లో మంచు మనోజ్‌ తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ హీరోగా తెరపై కనిపిస్తాడు. సాంకేతికంగా సినిమాకు పెద్దగా మార్కులు పడవు. సంగీతం, ఛాయాగ్రహణం విభాగాలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేశారు. వారికిదే ఇదే తొలి సినిమా. వాళ్ల అనుభవలేమి తెరపై కనపడుతుంది. పలు లేయర్లుగా సాగే ఈ కథను డీల్‌ చేయడంలో దర్శకులు తడబడ్డారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బలాలు
+ కథలో మలుపులు
+ పాటలు

బలహీనతలు
- కథ, కథనాల్లో ఫీల్‌ లేకపోవడం
- పసలేని సంభాషణలు
- సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా: ఇది సాదాసీదాగా సాగే లవ్‌స్టోరీ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.