Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ఏ మంత్రం వేసావె

సినిమా పేరు: ఏ మంత్రం వేసావె

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, శివానీ సింగ్‌, ఓమ్యా విరాక్‌, నీలాక్షి సింగ్‌, రాజ బాబు, ఆశిష్‌ రాజ్‌, ప్రభావతి, దీపక్‌ తదితరులు

సంగీతం: అబ్దూస్‌ సమద్‌

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

నిర్మాత: మల్కాపురం శివకుమార్‌

దర్శకత్వం: శ్రీధర్‌ మర్రి

విడుదల తేదీ: 09-03-2018

తొలి నుంచి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’తో ఓ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ‘ఏ మంత్రం వేసావె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో విజయ్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారా? ఆయన వేసిన ‘మంత్రం’ ఫలించిందా? చూద్దాం.

కథేంటంటే: కంప్యూటర్‌, వీడియో గేమ్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటుంది రాగమాలిక (శివానీ సింగ్‌). హింసతో కూడిన ఆటలకు భిన్నంగా మానవత్వంతో కూడిన ఆటలను డిజైన్‌ చేయాలనేది ఆమె ఆశయం. కంప్యూటర్‌ గేమ్స్‌కి బానిసైన ఓ యువకుడు నిఖిల్‌ (విజయ్‌ దేవరకొండ). బయట ప్రపంచాన్ని మర్చిపోయి వారాలు, నెలలు తరబడి గేమ్స్‌ ఆడుతుంటాడు. అమ్మాయిలతో చాట్‌ చేస్తుంటాడు. బయటి కంటే కూడా కంప్యూటర్‌లోనే ఓ ప్రపంచం ఉందని నమ్ముతుంటాడు. తన ఫేస్‌బుక్‌ స్నేహితుల ద్వారా రాగమాలికను చూస్తాడు. ఆమెతో కూడా స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. తనతో స్నేహం చేయాలంటే ఒక ఆట ఆడాలని అడుగుతుంది. కొన్ని క్లూస్‌ ఇచ్చి తన చిరునామా తెలుసుకోవాలని చెబుతుంది. మరి తన కంప్యూటర్‌ ప్రపంచాన్ని వదిలిపెట్టి రాగమాలికను వెతికేందుకు బయలుదేరిన నిఖిల్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ ఇద్దరూ ఏ పరిస్థితుల్లో ఎక్కడ కలుసుకున్నారు?వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: కథలో కొత్తదనం ఉంది. కథనం పరంగా కూడా కసరత్తులు బాగానే చేశాడు దర్శకుడు. కానీ వాటికి తెర రూపం ఇచ్చే ప్రయత్నమే సరిగ్గా కుదరలేదు. కంప్యూటర్లో మన స్నేహితుడు ఒకడు సరదాగా ఓ గేమ్‌ ఆడుతుంటే చూస్తున్నట్లు, మనమే కంప్యూటర్‌లో ఓ షార్ట్‌ ఫిలిం చూస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సినిమా. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఎప్పుడైతే కథానాయిక తెరపైకి వచ్చి ఆట మొదలుపెడుతుందో అప్పటినుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆమెను వెతికే క్రమమంతా సాగదీతగా అనిపించినప్పటికీ ఆ సన్నివేశాలన్నీ ఓ గేమ్‌ని తలపించడంతో ఆ గేమ్‌ ఎక్కడ ముగుస్తుందో చూడాలనే ఆసక్తి కొనసాగుతుంటుంది. సోషల్‌మీడియా వెనక చీకటి కోణాన్ని కూడా ఈ కథలోని ఓ పార్శ్వంలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు మాత్రం సినిమా ఉద్దేశాన్నే మార్చేశాయి. కథనంపై ఇంకొంత కసరత్తు చేసుంటే ఈ సినిమా ఫలితం మరొకలా ఉండేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: విజయ్‌ దేవరకొండ లుక్‌ పరంగా, నటన పరంగా ఆకట్టుకున్నారు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ పాత్ర పరిధి మేరకు చక్కటి ప్రభావం చూపిస్తారు. కథానాయిక శివానీ సింగ్‌ కూడా నటన పరంగా ఆకట్టుకుంది. గ్లామర్‌ పరంగా మాత్రం ఆమెకు పెద్దగా మార్కులు పడవు. మిగతా తారాగణం ఆయా పాత్రలకు తగ్గట్టు నటించారు. పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రం కావడంతో పేరున్న నటీనటులు తెరపై కన్పించరు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. వర్తమాన పరిస్థితులను ప్రతిబింబించేలా కథ రాసుకున్నారు. కథనం పర్వాలేదనిపించినప్పటికీ సన్నివేశాలు రెండున్నర గంటల సినిమాకు తగ్గట్టుగా లేవు. సంగీతం, కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు నాసిరకంగా అనిపిస్తాయి.

బలాలు:

+కథ

+విజయ్‌ దేవరకొండ నటన

బలహీనతలు:

-వాణిజ్యాంశాలు లేకపోవడం

-సాగదీతగా అనిపించే ద్వితీయార్థం

-నిరాశపరిచే పతాక సన్నివేశాలు

చివరగా: ఇదొక ఆట

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.