Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: రెయిడ్‌

సినిమా పేరు: రెయిడ్‌ (హిందీ)

నటీనటులు: అజయ్‌ దేవగణ్‌, ఇలియానా, సౌరభ్‌ శుక్లా తదితరులు

సంగీతం: అమిత్‌ త్రివేది, తనిష్క్‌ బాగ్చి

కూర్పు: బోధాదిత్య బెనర్జీ

కథ: రితేశ్‌ షా

నిర్మాతలు: అభిషేక్‌ పథక్‌, కుమార్‌ మంగత్‌ పథక్‌, భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్‌

దర్శకత్వం: రాజ్‌ కుమార్‌ గుప్తా

విడుదల తేదీ: 16-03-2018

బాలీవుడ్‌లో ఇటీవలికాలంలో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కోవలో తెరకెక్కిన చిత్రమే ‘రెయిడ్‌’. ఆదాయపు పన్నుశాఖ దాడుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించారు. ఆయన సరసన ఇలియానా కథానాయికగా కనిపించారు. ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ‘రెయిడ్‌’ చిత్రంతో అజయ్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారా? చూద్దాం.

కథేంటంటే: ఆదాయపు పన్ను శాఖ అధికారి అమయ్‌ పట్నాయక్‌(అజయ్‌ దేవగణ్‌) అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం. ఎవరి ఒత్తిడికీ తలొగ్గక అవినీతిపరుల భరతం పడుతుంటాడు. అంతటి నిబద్ధతతో వ్యవహరించే అజయ్‌.. ఏడేళ్లలో 49 సార్లు బదిలీ అవుతాడు. అయినా ఇసుమంత కూడా రాజీ పడడు. అతనికి ఉత్తర్‌ప్రదేశ్‌లో తౌజీ అనే ఓ పేరుమోసిన ధనవంతుడి కేసు అప్పగిస్తారు. తౌజీ తన పలుకుబడితో సమాజంలో పెద్దమనిషిగా చలామణీ అవుతుంటాడు. తౌజీ వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికితీసి అతన్ని కోర్టుకీడ్చడం అంత సులువు కాదని పట్నాయక్‌కు అర్థమవుతుంది. అయినా వ్యూహానికి పదునుపెట్టి తౌజీ ఇంటిపై దాడి చేస్తాడు. అది ఆదాయపు పన్ను శాఖ చరిత్రలోనే అదిపెద్ద దాడిగా నిలుస్తుందని పట్నాయక్‌కి కూడా తెలియదు. తౌజీ అసలు రంగును పట్నాయక్‌ ఎలా బయటపెట్టాడు? మాలిని (ఇలియానా)తో అతని అనుబంధం ఎలాంటిదన్న విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: 1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అతిపెద్ద ఐటీ రెయిడ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. నేరాలు, పన్నులు ఎగ్గొట్టడాల నేపథ్యంలో ప్రథమార్థం నడిపించారు. రితేష్‌ షా రాసిన కొన్ని డైలాగులు ప్రేక్షకుడి చేత ఈలలు వేయిస్తాయి. భారతదేశ విలువల గురించి చెప్తున్న డైలాగులు గర్వపడేలా చేస్తాయి. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసే నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి పన్ను ఎగ్గొట్టి చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అన్న విషయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా నిరూపించారు.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాకి ప్రధాన బలం అజయ్‌ దేవగణే. ఐటీ శాఖ అధికారి పాత్రలో ఆయన ఇమిడిపోయారు. ఆయన నటన ఎక్కడా విసుగుపుట్టించదు. ఇలియానా చీరల్లో అందంగా కన్పిస్తూ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. ప్రతినాయకుడి పాత్రలో సౌరభ్‌ శుక్లా ఒదిగిపోయారు. తెరపై సౌరభ్‌ని చూస్తున్నంత సేపు ఓ పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌ని చూస్తున్నట్లే ఉంటుంది. మిగతా వారంతా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి.

బలాలు:

+ అజయ్‌ దేవగణ్, సౌరభ్‌ శుక్లా నటన‌

+ డైలాగులు

+ పాటలు

బలహీనతలు:

- ద్వితీయార్థంలో సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరగా: అవినీతిని నిర్మూలించే ‘రెయిడ్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.