Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ఛల్‌ మోహన్‌ రంగ

సినిమా పేరు: ఛల్‌ మోహన్‌ రంగ

నటీనటులు: నితిన్‌, మేఘా ఆకాశ్‌, మధునందన్‌, రావు రమేశ్‌ తదితరులు

సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌

నిర్మాణ సంస్థలు: శ్రేష్ఠ్‌ మూవీస్‌, పీకే క్రియేటివ్‌ వర్క్స్‌

నిర్మాతలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌ కల్యాణ్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య

విడుదల తేదీ: 05-04-2018

విజయాల్ని, పరాజయాల్ని సమానంగా చూసిన కథానాయకుడు నితిన్‌. ఆయన ఆరంభమే ఓ సంచలనం. వరుసగా విజయాలు అందుకొన్నారు. ఆ తర్వాత అదే స్థాయిలోనే ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు వీడకుండా ప్రయత్నాలు చేశారు. కథానాయకుడిగా ఆయన‌ది పాతిక సినిమాల ప్రయాణం. చిన్నప్పటి నుంచి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమాని అయిన నితిన్‌.. తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంలో నటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అదీకాకుండా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. మరి పవన్‌-నితిన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే: మోహన్‌ రంగ(నితిన్‌) చిన్నప్పుడే మేఘ (మేఘా ఆకాశ్‌)ను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోతుంది. దీంతో మేఘ కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. రంగ పెద్దయ్యాక అమెరికా వీసా సంపాదించి ఆ దేశంలో అడుగుపెడతాడు. అమెరికాలో రంగకి మేఘ కన్పిస్తుంది. కానీ తానే మేఘ అని తెలీదు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారన్నదే కథ.

ఎలా ఉందంటే: త్రివిక్రమ్‌ అందించిన కథ ఇది. అయితే కథలో మ్యాజిక్‌ ఏమీ ఉండదు. సాధారణమైన కథే. దానికి సరదా సన్నివేశాలు జోడించాడు దర్శకుడు. కథానాయకుడి పాత్ర చిత్రించిన విధానం.. అమెరికా వెళ్లడానికి అతను పడే పాట్లు.. అక్కడ హెచ్‌1బీ వీసా కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ నవ్విస్తాయి. రంగ, మేఘ మధ్య జరిగే రోడ్డు ట్రిప్‌ కూడా సరదాగా సాగిపోతుంది. తొలి సగంలో కథ ఏమీ లేకపోయినా ఆ సన్నివేశాలతోనే ప్రేక్షకులను సంతృప్తి పరుస్తాడు దర్శకుడు. అమెరికా అందాలు, చక్కని సంగీతం, వినోదం, ఇవన్నీ మేళవించడంతో తొలి సగం టైమ్‌పాస్‌ అయిపోతుంది. రంగ, మేఘ విడిపోవడానికి బలమైన కారణాలు చూపించలేదు. ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. రంగ మేఘను వెతుక్కుంటూ మళ్లీ ఊటీ వెళ్లేంతవరకు కథ ట్రాక్‌ ఎక్కదు. అక్కడ దర్శకుడు మళ్లీ తనదైన వినోదాన్ని నమ్ముకోవడంతో రంగ ప్రేక్షకులకు నచ్చడం ప్రారంభిస్తాడు. దర్శకుడి బలం వినోదమే. అది పండించిన చోటల్లా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటుంది. పతాక సన్నివేశాలకు ముందు సుదీర్ఘమైన పార్టీ ఎపిసోడ్ ‌ఒకటి ఉంది. అది త్రివిక్రమ్‌ స్థాయిలో సరదాగా సాగిపోతుంది. ఒక విధంగా ద్వితీయార్థాన్ని నిలబెట్టే సన్నివేశం ఇదే కావచ్చు. కథలో యాక్షన్‌కు చోటులేకపోయినా ఓ చోట పోరాట ఘట్టాన్ని చూపించారు. అది మాస్‌కు నచ్చుతుంది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా సాగినా ఈ కథకు సరైన ముగింపే ఇచ్చాడనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: రంగగా నితిన్‌ అభినయం ఆకట్టుకుంటుంది. తొలి సగంలో వీసా కోసం అతను పడే పాట్లలో నితిన్‌ అల్లరి అందంగా కనిపిస్తుంది. హీరో పాత్రతోనే చాలా సన్నివేశాలు నడిచిపోతాయి. మేఘా ఆకాశ్‌ అందంగా కన్పించారు. అభినయంగానూ వంక పెట్టలేం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. రావు రమేశ్‌, నరేశ్‌, మధునందన్‌, నర్రా శ్రీనివాస్‌కు కీలక పాత్రలు దక్కాయి. చాలా కాలం తర్వాత నటి లిజి తెరపై కన్పించారు. కథంతా నితిన్‌, మేఘల చుట్టూనే నడిచింది. మిగిలిన వారంతా వీరిద్దరికీ సపోర్ట్‌ చేశారు. తమన్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. ‘నువ్వు పెద్దపులి’ పాట మాస్‌కు నచ్చుతుంది. మిగిలినవన్నీ మెలొడీ ప్రధానంగా సాగేవే. ‘ఘ..ఘ..మేఘ’ అనే పాట చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కువగా అమెరికా నేపథ్యంలో సాగిన కథ ఇది. అక్కడి లొకేషన్లు, ఊటీ అందాల వల్ల ఈ కథకు కొత్త ఫ్లేవర్‌ వచ్చింది. ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో ఉంది. దర్శకుడు సంభాషణల విభాగంలో తన పనితనాన్ని చూపించాడు. చాలా చోట్ల త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు త్రివిక్రమే రాశారేమో అనిపిస్తాయి. బలమైన కథ ఎంచుకుని ద్వితీయార్థంలోనూ ఇంకాస్త వినోదం ఉండి ఉంటే ‘ఛల్‌ మోహన్‌ రంగ’ మరింత చక్కగా వచ్చేది.
బలాలు:
+ నితిన్‌, మేఘా ఆకాశ్‌
+వినోదం
+డైలాగులు
+లొకేషన్లు
బలహీనతలు:
- తెలిసిన కథ
- సెకండాఫ్‌
చివరగా: ‘ఛల్‌ మోహన్‌ రంగ’ సరదా ప్రయాణం.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.