Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: టిక్ టిక్ టిక్

చిత్రం: టిక్ టిక్ టిక్
నటీనటులు: జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్, జ‌య‌ప్ర‌కాష్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ త‌దిత‌రులు.
సంగీతం: డి.ఇమ్మాన్‌
కెమెరా : వెంక‌టేష్‌
ఎడిట‌ర్: ప్ర‌దీప్‌
ఆర్ట్: మూర్తి
నిర్మాత : ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ‌
ద‌ర్శ‌క‌త్వం : శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌
విడుద‌ల‌: 22-06-2018
సంస్థ‌: శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్

భార‌తీయ తొలి అంత‌రిక్ష చిత్రంగా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన చిత్రం ‘టిక్ టిక్ టిక్‌’. మ‌నం భిన్న నేప‌థ్యాల‌తో కూడిన క‌థ‌ల్ని స్పృశించిన‌ప్ప‌టికీ... హాలీవుడ్‌లో త‌ర‌చుగా తెర‌కెక్కే అంత‌రిక్షం నేప‌థ్య చిత్రాల్ని మాత్రం తీయ‌లేదు. అందుకు నిర్మాణ వ్య‌యం, సాంకేతిక‌త త‌దిత‌రాలు కార‌ణాలు కావొచ్చు. అయితే ఇటీవ‌ల ప్ర‌పంచ‌స్థాయి సాంకేతిక‌త‌ని మ‌నం కూడా అల‌వోక‌గా అందిపుచ్చుకుంటూ హాలీవుడ్‌కి దీటుగా సినిమాలు తీస్తున్నాం. ఈ ద‌శ‌లోనే త‌మిళంలో భార‌తీయ తొలి అంత‌రిక్ష చిత్రంగా ‘టిక్ టిక్ టిక్‌’ తెర‌కెక్కింది. జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఆ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? అంత‌రిక్ష నేప‌థ్యం ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని పంచింది.

క‌థేంటంటే?: ఒక గ్ర‌హ‌శ‌క‌లంతో భార‌త‌దేశానికి పెనుముప్పు ఏర్ప‌డ‌నుంద‌నే విష‌యాన్ని శాస్త్ర‌జ్ఞులు గుర్తిస్తారు. ఆ గ్ర‌హ‌శ‌కలాన్ని విచ్ఛిన్నం చేసే శ‌క్తిగ‌ల అణ్వాయుధం మ‌రొక దేశానికి చెందిన అంత‌రిక్ష కేంద్రంలో ఉంద‌ని, దాన్ని దొంగిలించి ప్ర‌యోగిస్తే త‌ప్ప భార‌త‌దేశానికున్న ముప్పును త‌ప్పించ‌లేమ‌ని క‌నుగొంటారు. వేటినైనా తెలివిగా దొంగిలించ‌డంలోనూ, దారిమ‌ళ్లించ‌డంలోనూ నిష్ణాతుడైన వాసు (జ‌యం ర‌వి)ని వ్యోమ‌గాములుతో క‌లిపి అంత‌రిక్షంలోకి పంపిస్తారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌రి వాసు వేరొక దేశానికి చెందిన అంత‌రిక్ష కేంద్రంలోని అణ్వాయుధాన్ని ఎలా దొంగిలించాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? గ‌్ర‌హ‌శ‌కలం నుంచి పొంచి ఉన్న ముప్పుని త‌ప్పించాడా? లేదా? త‌దిత‌ర విష‌యాల‌తో చిత్రం సాగుతుంది.

ఎలా ఉందంటే?: స‌గ‌టు ద‌క్షిణాది మాస్ క‌థ‌ని అంత‌రిక్షంలోకి పంపితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. మ‌న హీరోలు ఏమైనా చేయ‌గ‌ల‌రు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా స‌రే.. ఒంటిచేత్తో ఎదుర్కొని అనుకొన్న‌ది సాధిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. కాబ‌ట్టి మ‌నం నిశ్చితంగా, ఎటువంటి కంగారు లేకుండా శుభం కార్డు వ‌ర‌కు చూస్తే చాల‌న్న‌ట్టుగా సాగుతుంటాయి. ఈ క్ర‌మంలో క‌థ‌ల్లో సంక్లిష్ట‌త‌, ఉత్కంఠ‌, తర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి త‌గ్గిపోతుంటుంది. ఈ సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. భార‌తీయ తొలి అంత‌రిక్ష నేప‌థ్యంతో కూడిన సినిమాకి త‌గ్గ‌ట్టుగానే కాన్సెప్టు... తెర‌పై స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతాయి. మ‌నం చూడ‌ని ఓ కొత్త ర‌క‌మైన సినిమాని చూస్తున్న భావ‌న అడుగ‌డుగునా క‌లుగుతుంది. అక్క‌డి వ‌ర‌కు చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాన్ని అభినందించ‌వ‌చ్చు.

కానీ, ఈ క‌థ‌లోనే సంక్లిష్ట‌త కొర‌వ‌డింది. అంత‌రిక్ష నేప‌థ్యం అన‌గానే ప్ర‌తి విష‌యం అథెంటిక్‌గా, సీరియ‌స్‌గా సాగాలి. అయితే ఈ సినిమాలో ఆ సీరియ‌స్‌నెస్ ఎక్క‌డా క‌నిపించ‌దు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ముందుగానే తెలిసిపోతుంటుంది. మ‌న ప్రేక్ష‌కుడికి తెలియ‌ని నేప‌థ్యం క‌దా, మ‌నం ఏం చూపించినా ప‌ర్లేదనుకొన్నాడో ఏమో ద‌ర్శ‌కుడు సినిమాటిక్ లిబ‌ర్టీని మ‌రీ ఎక్కువ‌గా వాడుకొని క‌థ‌లో స‌హ‌జ‌త్వం కోల్పోయేలా చేశాడు. వేరొక దేశ అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న అణ్వాయుధాన్ని దొంగిలించ‌డం అంటే ఎన్ని స‌వాళ్లుంటాయి. కానీ, ఆ స‌వాళ్లని కూడా చాలా పేల‌వంగా చూపించాడు. ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు మాత్రం కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బాగుంది. అందులో జ‌యం ర‌వి త‌న‌యుడు ఆరవ్ త‌ళుక్కున మెరుస్తాడు. మొత్తంగా మ‌న సినిమాలో ఎప్పుడూ చూడ‌ని విజువ‌ల్స్‌... నేప‌థ్యం కోసమైతే ఈ సినిమాని చూడొచ్చు.

ఎవ‌రెలా చేశారంటే?: జ‌యం ర‌వి ఎస్కేపిస్ట్‌గా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. ఈ మిష‌న్‌లోకి చేర‌క‌ముందు... అంత‌రిక్షంలోకి వెళ్లాక ఆయ‌న చేసే హంగామా ఆక‌ట్టుకుంటుంది. డ్యూయెట్లు, అన‌వ‌స‌ర‌మైన ల‌వ్‌ట్రాక్‌లు లేకుండా సినిమా సాగుతుంది. క‌థానాయిక నివేదా పేతురాజ్ పాత్ర కూడా ప‌రిధికి త‌గ్గ‌ట్టుగానే, స‌హ‌జంగానే సాగుతుంది. బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు లేక‌పోవ‌డం ఈ సినిమాకి మైన‌స్‌గా మారింది. సాంకేతికంగా మాత్రం సినిమా అబ్బుర‌ప‌రుస్తుంది. అంత‌రిక్ష నేప‌థ్యంలో స‌న్నివేశాలు, గంట‌కు పైగా సాగే విజువ‌ల్ ఎఫెక్ట్స్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతిని పంచుతాయి. వెంకటేష్ కెమెరా ‌ప‌నిత‌నం, డి.ఇమ్మాన్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బలాలుగా నిలిచాయి. నిర్మాణ విలువ‌ల్లో మ‌న ప‌రిధులు క‌నిపిస్తూనే ఉంటాయి. ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర్‌రాజ‌న్ ప్ర‌య‌త్నం బాగుంది. కానీ, క‌థ‌లో ఇంకాస్త సంక్లిష్ట‌త‌, వాస్త‌విక‌త‌ని జోడించుంటే బాగుండేది. క‌థ వ‌ర‌కు బాగానే రాసుకొన్నా, క‌థ‌నం ప‌రంగా ఆయ‌న మరిన్ని కసరత్తులు చేస్తే బాగుండేదనిపిస్తుంది.

బలాలు
+ క‌థా నేప‌థ్యం
+ జ‌యం ర‌వి న‌ట‌న
+ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌నం
- లాజిక్ లేని స‌న్నివేశాలు
చివ‌రిగా: ‘టిక్ టిక్ టిక్’... ప్ర‌య‌త్నం బాగుంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.