Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ఫన్నే ఖాన్‌

సినిమా పేరు: ఫన్నే ఖాన్‌(హిందీ)

నటీనటులు: ఐశ్వర్య రాయ్‌, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌, పీహూ సంద్‌, దివ్యా దత్తా తదితరులు

సంగీతం: అమిత్‌ త్రివేది

కూర్పు: మోనిషా ఆర్‌ బల్దావా

సినిమాటోగ్రఫీ: తిరు

నిర్మాణ సంస్థలు: టి-సిరీస్‌ ఫిలింస్‌, అనిల్‌ కపూర్‌ ఫిలింస్‌, కమ్యునికేషన్‌ నెట్‌వర్క్‌

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అతుల్‌ మంజ్రేకర్‌

నిర్మాతలు: భూషణ్‌ కుమార్‌, అనిల్‌ కపూర్‌, రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా

విడుదల తేదీ: 03-08-2018

ల్టీస్టారర్‌ చిత్రాలంటే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే వేరు. ఇద్దరు ముగ్గరు తారలు తెరపై సందడి చేయబోతున్నారంటే సినిమాలో కచ్చితంగా ఏదో ఆసక్తికరమైన అంశం ఉంటుందని ఆశిస్తారు. అలాంటి మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఒకటైన ‘ఫన్నే ఖాన్‌’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐశ్వర్య రాయ్‌, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్‌ తర్వాత ఐష్‌ నటించిన చిత్రమిది. 2000లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన బెల్జియన్‌ చిత్రం ‘ఎవ్రీబడీస్‌ ఫేమస్‌’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అతుల్‌ మంజ్రేకర్‌ తెరకెక్కించారు. మరి.. చాలా కాలం తర్వాత అనిల్‌ కపూర్‌, ఐశ్వర్య కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే: ప్రశాంత్‌ శర్మ అలియాస్‌ ఫన్నే ఖాన్‌(అనిల్‌ కపూర్‌) ఓ ఆర్కెస్ట్రాలో గాయకుడిగా పనిచేస్తుంటాడు. మహమ్మద్‌ రఫి అంతటి పెద్ద గాయకుడు కావాలని కలలు కంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతని కోరిక నెరవేరదు. దాంతో తన కూతురు లత(పీహూ సంద్‌)ను లతా మంగేష్కర్‌ అంత గొప్ప గాయకురాలిని చేసి తన కలను తీర్చుకోవాలని తపిస్తుంటాడు. అందుకే తనకు లత మంగేష్కర్‌ అని నామకరణం చేస్తాడు. లతకు కూడా పాడటం అంటే ఆసక్తి. కానీ ఆమె చాలా లావుగా ఉంటుంది. దాంతో ప్రదర్శనలకు వెళ్లినప్పుడల్లా ఎదురయ్యే అవమానాలతో కుమిలిపోతుంటుంది.

కూతురి ప్రతిభను తెలియజెప్పేందుకు ఆమెతో ఓ ఆల్బమ్‌ రూపొందించాలనుకుంటాడు ఫన్నేఖాన్‌. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. అప్పుడే అతనికి ప్రముఖ పాప్‌ గాయకురాలు బేబీ సింగ్‌(ఐశ్వర్యరాయ్‌) గురించి తెలుస్తుంది. ఒక్కో పాటకు రూ.లక్షల్లో పారితోషికం తీసుకునే బేబీను కిడ్నాప్‌ చేయాలనుకుంటాడు. దానికి ఆధిర్‌ ‌(రాజ్‌కుమార్‌ రావ్‌) సాయం తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి బేబీని ఒక చోట బంధిస్తారు. ఇంతకీ ఫన్నేఖాన్‌ ఎందుకు బేబీని కిడ్నాప్‌ చేశాడు? బేబీ మాయలో పడ్డ ఆధిర్‌ ఏం చేశాడు? ఆ తర్వాత ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? కూతురిని పెద్ద గాయకురాలిని చేయాలన్న ఫన్నేఖాన్‌ కోరిక నెరవేరిందా? అనే విషయాలకు చిత్రాన్ని చూడాల్సిందే.

ఎలా ఉందంటే: గాయకుడిగా అనిల్‌ కపూర్‌ పడిన కష్టాలను, కూతురిని గాయనిని చేయాలన్న అతని తపనను దర్శకుడు ప్రథమార్థంలో చూపించాడు. రాన్రాను కథనం పక్కదారి పడుతున్నట్లు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలతో నడిపించేశాడు దర్శకుడు. బేబీ సింగ్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్న కక్కడ్‌(గిరీష్‌ కులకర్ణి) ఆమె చేత రియాల్టీ షో చేయించాలనుకోవడం, ఇందుకోసం స్టేజ్‌పై ఆమె దుస్తులు జారిపోయేలా ప్రయత్నాలు చేయాలనుకోవడంలో లాజిక్‌ కనిపించదు. అతని వేషధారణ కూడా వికారంగా ఉంటుంది.

కొంచెం కామెడీ, కొన్ని భావోద్వేగపు సన్నివేశాలతో సాగాల్సిన సినిమా దారి తప్పి మెలోడ్రామా వైపు వెళుతుంది. ఓ సెలబ్రిటీ జీవితం ఎలా ఉంటుంది? వారిపై జనాల్లో ఉండే అపోహలేంటి? అన్న విషయాలను అతుల్‌ తెరపైకి తీసుకొచ్చారు. బేబీసింగ్‌, ఆధిర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వారిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. సినిమాలోని ‘తేరే జైసా తూ హై’ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే: అనిల్‌ కపూర్‌, పీహూ, రాజ్‌కుమార్‌ రావ్‌ల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. అనిల్‌, ఐష్‌, రాజ్‌కుమార్‌ తమ నటనతో అదరగొట్టేశారు. ఎప్పటిలాగే ఐష్‌ తన అందంతో హోయలొలికించారు. తెరపై 20 నిమిషాలు కన్పించినప్పటికీ నాలుగు పదుల వయసులోనూ ఐష్‌ వేసిన డ్యాన్స్‌ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. కూతురిని గాయనిని చేయాలని అనిల్‌ పడే తపన, అక్కడకక్కడా అనిల్‌ కపూర్‌, పీహూ మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి.

బలాలు:

+ ఐష్‌ డ్యాన్స్‌

+ రాజ్‌కుమార్‌ రావ్‌, అనిల్‌ కపూర్‌ నటన

+ పాటలు

బలహీనతలు:

- అక్కడక్కడా సన్నివేశాల్లో ఓవర్‌ మెలోడ్రామా

చివరగా: ఫన్నేఖాన్‌..ఓ మంచి తండ్రి కథ

గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.