సర్వాంతర్యామికి స్వర్ణ రథోత్సవం
ఈనాడు, అమరావతి, తిరుమల, కర్నూలు, న్యూస్‌టుడే: దేవదేవుడు శ్రీవేంకటేశ్వరునికి స్వర్ణ రథోత్సవం బుధవారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథాన్ని అధిష్ఠించి తిరువీధుల్లో విహరించారు. భక్తకోటి గోవిందనామస్మరణ చేస్తూ రథానికి ఉన్న పగ్గాలను లాగుతుండగా తిరువీధుల్లో రథోత్సవం జరిగింది. రాత్రి అశ్వవాహనంపై అంతర్యామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీమలయప్పస్వామి కల్కి అవతారంలో వాహనాన్ని అధిరోహించి ఒక చేతిలో అశ్వం కళ్లెములను చేతబూని, మరొక చేతిలో చెర్నాకోలను ధరించి అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ యజ్ఞసమాప్తికి చిహ్నంగా చక్రస్నానం ఘట్టం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా జరగనుంది. రాత్రి జరిగే కైంకర్యాలతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం
విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారంతో దసరా వేడుకలు ముగియనున్నాయి. చివరి రోజు అమ్మవారు నవమి, దశమి సందర్భంగా రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట నుంచి గురువారం ఉదయం 11గంటల వరకూ మహిషాసురమర్దిని అవతారంలో కనిపిస్తారు. అనంతరం రెండు గంటలు దర్శనాలను నిలిపేసి అమ్మవారి అలంకారం మారుస్తారు. ఒంటిగంట నుంచి రాత్రి 11 వరకూ రాజరాజేశ్వరి రూపంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక అంతరాలయం, ఆశీర్వచనాలను నిలిపేస్తున్నట్టు కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం, ఈవో కోటేశ్వరమ్మ ప్రకటించారు. దర్శనాల టిక్కెట్ల విక్రయాలు సైతం నిలిపేస్తున్నట్టు తెలిపారు. అన్ని క్యూలైన్లు ఉచితమేనన్నారు. సాయంత్రం 5గంటల నుంచి కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది.
జగన్మాత సేవలో జస్టిస్‌ శ్యామ్‌ప్రసాద్‌
విజయవాడలోని దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్‌ మూర్తి దుర్గమ్మ క్యాలెండరు, ప్రసాదాలను అందజేశారు.

జోగులాంబకు పట్టువస్త్రాల సమర్పణ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో వెలసిన జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున కర్నూలు కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

మహాగౌరీ అలంకారంలో భ్రమరాంబ
శ్రీశైల భ్రమరాంబాదేవి మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించి రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

భ్రమరాంబాదేవికి స్వర్ణ ఖడ్గం బహూకరణ
శ్రీశైల భ్రమరాంబాదేవికి హైదరాబాద్‌కు చెందిన కంకర రవీంద్రారెడ్డి అనే భక్తుడు స్వర్ణ ఖడ్గాన్ని బహూకరించారు. వజ్రాలు పొదిగిన స్వర్ణ ఖడ్గం బరువు 405 గ్రాములు, విలువ రూ.15 లక్షలు ఉన్నట్లు దాత తెలిపారు. బంగారు ఖడ్గానికి సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం ఈవో శ్రీరామచంద్రమూర్తికి అందజేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.