హామీలపై విస్తృత ప్రచారం
లబ్ధిదారులకు, ప్రజలకు నేరుగా సమాచారం
తెరాస అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
పలువురితో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి
ఈనాడు, హైదరాబాద్‌:  పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో ప్రకటించిన హామీలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంచేయాలని, లబ్ధిదారులతో పాటు ప్రజలందరికీ ఈ సమాచారాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస నేతలను, అభ్యర్థులను ఆదేశించారు. నిరుద్యోగ భృతిపైనా యువతను చైతన్యపరచాలన్నారు. బుధవారం సీఎం తెరాస ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పలువురు పార్టీ అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికపై ప్రజాస్పందనను తెలుసుకున్నారు. ప్రణాళికకు మంచి స్పందన వస్తోందని, ప్రధానంగా రైతులు, పింఛనర్లలో హర్షం వ్యక్తమవుతోందని, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని అభ్యర్థులు తెలిపారు. అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలతో సంబురాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం సీఎం రైతుబంధు, ఆసరా, రైతు బీమా పథకాల లబ్ధిదారులతో, మహిళా సంఘాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా కొందరు పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ, మిగిలిన వర్గాలు సైతం కొన్ని హామీలను ఆశిస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నెలాఖరుకు తుది ప్రణాళిక వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. మంగళవారం ప్రకటించిన హామీలపై బ్రోచర్లు రూపొందించి పంపిణీ చేయాలని సూచించారు. కీలకమైనహామీలను వెల్లడించినందున అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పారు.

యువతకు సమాచారం అందాలి
నిరుద్యోగ భృతిపై యువతకు సమాచారం చేరేలా చూడాలని సీఎం ఆదేశించారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగం నేతలతో ఆయన మాట్లాడారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నిరుద్యోగ భృతిపై ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. మహిళా సంఘాలకు ఆహారశుద్ధి పరిశ్రమల వివరాలను అందించాలని తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలికి చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో..
తెరాస ఎన్నికల ప్రణాళికలో తీసుకున్న హామీలపై సామాజికమాధ్యమాల్లో ప్రచారంచేయాలని సామాజిక మాధ్యమ ప్రచారం కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కల్వకుంట్ల కవితకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూలు
దసరా తర్వాత ఒకట్రెండు రోజుల్లో సీఎం ఎన్నికల ప్రచార సభల షెడ్యూలును విడుదల చేయనున్నారు. దీనిపై బుధవారం నేతలతో చర్చించారు.

కడియంతో ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతల భేటీ
సీఎం కేసీఆర్‌ మంగళవారం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక పథకాల రూపకల్పనపై  ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం పని ప్రారంభించారు. పలువురు ఎస్సీ,ఎస్టీ సంఘాల నేతలు ఆయనను కలిశారు. పలు ప్రతిపాదనలు అందించారు. ఇప్పటికే బీసీలకు అమలు చేస్తున్న ఆర్థిక పథకాలపైనా ఆయన సమాచారం తెప్పించుకొని పరిశీలించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.