ఐదింతలు బాదేశారు!
దసరా రద్దీలో ప్రయాణికుల నిలువు దోపిడీ
సువిధ స్పెషల్‌లో రూ.210 టికెట్‌కు రూ.1105 వసూలు
హైదరాబాద్‌-విజయవాడ సెకండ్‌ ఏసీ టికెట్‌ రూ.4వేలు
ఆర్టీసీ బస్సుల్లో 50% అదనం.. ప్రైవేటులో 100%పైగా పెంపు
ఈనాడు-హైదరాబాద్‌: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్దామని సరదాపడిన ప్రజలకు రైళ్లు, బస్సులు ప్రత్యేక ధరలతో చుక్కలు చూపాయి. విమాన టికెట్లకు మించిన ధరలతో రవాణా సంస్థలు ప్రయాణికులపై అధిక భారం మోపాయి. సొంతూరుకు చేరడానికి ముందే ప్రయాణికుల సంతోషం అదనపు ఛార్జీలు, ప్రత్యేక ఛార్జీల రూపంలో ఆవిరైపోతోంది. హైదరాబాద్‌ నుంచి దిల్లీ.. దాదాపు 1,600 కిమీ దూరం. ప్రయాణ తేదీకి కొద్దిరోజుల ముందు టికెట్‌ తీసుకుంటే సుమారు రూ.3 వేలల్లోనే విమానంలో వెళ్లొచ్చు. కానీ 270 కి.మీ దూరం ఉండే హైదరాబాద్‌-విజయవాడ మధ్య ప్రయాణానికి బుధ, గురువారాల్లో (ఈనెల 17, 18 తేదీల్లో) సువిధ ప్రత్యేక రైళ్లలో (సెకండ్‌ ఏసీ) ధర ఎంతుందో తెలుసా? అక్షరాలా రూ.నాలుగువేలు. అంటే దిల్లీకి విమానంలో వెళ్లడం కంటే విజయవాడకు రైల్లో వెళ్లడమే ప్రియం! ఒక్క రైళ్లలోనే కాదు.. ఆర్టీసీ, ప్రైవేటు అన్న తేడా లేకుండా బస్సుల్లోనూ భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రైళ్లలో విమానాల తరహాలో డైనమిక్‌, తత్కాల్‌ ఛార్జీలతో బాదితే.. టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీలు 50 శాతం అదనంగా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలుచేశాయి. ప్రైవేటు బస్సుల్లో (స్లీపర్‌) అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.1,500-2,000 వరకు వసూలుచేస్తున్నారు. ఛార్జీలను భారీగా పెంచేసినా రైళ్లలో, బస్సుల్లో టికెట్లు లభించలేదు. బుధవారం పండగ రద్దీతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లు.. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు కిటకిటలాడాయి.

సువిధ స్పెషల్‌.. ధరలు బహువిధ..
రైలు (నం.82709) సువిధ స్పెషల్‌లో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు బుధవారం (ఈ నెల 17వ తేదీ) స్లీపర్‌ టికెట్‌ ధర ఎంతో తెలుసా? రూ.1,105. సాధారణంగా విజయవాడకు స్లీపర్‌ టికెట్‌ రూ.210-రూ.250. సువిధ స్పెషల్‌లో రైల్వేశాఖ టికెట్‌ ధరను ఐదురెట్లు పెంచింది. అయినా టికెట్లు దొరకలేదు. థర్డ్‌ఏసీ రూ.3,155, సెకండ్‌ ఏసీ టికెట్‌ ధర రూ.4,450. ఇదే రైల్లో గురువారం (18వ తేదీ) టికెట్ల ధరలు స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీలకు వరుసగా.. రూ.1,105, రూ.2,640, రూ.4,450గా ఉన్నాయి. అదే విమానంలో అయితే, హైదరాబాద్‌-విజయవాడకు 18వ తేదీన టికెట్‌ రూ.నాలుగు-నాలుగున్నర వేలల్లో ఉంది. సాధారణ రోజుల్లో అయితే విమాన టికెట్‌ రూ.రెండు వేలకే దొరుకుతుంది.

తత్కాల్‌ బాదుడు: విజయవాడకు.. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ఏసీ టికెట్‌ రూ.560.. తత్కాల్‌లో రూ.1,050కి, సెకండ్‌ ఏసీ టికెట్‌ రూ.800.. తత్కాల్‌లో రూ.1,470కి పెంచారు. దాదాపు అన్ని మార్గాల్లోని రైళ్లలో 17,18 తేదీల్లో ఇదే పరిస్థితి.

అరకొరగా అదనపు బస్సులు, రైళ్లు
పండగ సమయంలో రద్దీ గురించి రైల్వేశాఖకు, ఉభయ రాష్ట్రాల ఆర్టీసీలకు తెలుసు. కానీ రద్దీకి తగ్గట్లు అదనపు సర్వీసులు నడపలేదు. ప్రత్యేక బస్సుల పేరుతో టీఎస్‌, ఏపీఎస్‌ఆర్టీసీలు 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేశాయి. అయినా ఈ బస్సులు ప్రయాణికుల రద్దీకి సరిపోలేదు. రైల్వేశాఖ అయితే నామమాత్రంగా అదనపు రైళ్లు నడిపింది. దీంతో ప్రత్యేక రైళ్లలో ప్రీమియం తత్కాల్‌, డైనమిక్‌ ఫేర్లతో విమానాల టికెట్‌ ధరలకు మించి ఛార్జీలు వసూలుచేశారు.

తిరుగు ప్రయాణంలో, దీపావళికీ ఇదే వరస!
దసరా పండగ తర్వాత తిరుగు ప్రయాణంలో, అదేవిధంగా దీపావళి సమయంలోనూ అటు రైళ్లలో, ఇటు బస్సుల్లో టికెట్ల రిజర్వేషన్‌ దాదాపుగా పూర్తయింది. టికెట్లు రిజర్వు చేసుకోని వారికి అప్పుడూ ఇదే తరహా ఛార్జీల బాదుడు ఉంటుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.