పరిష్కార పక్షం
15 రోజులపాటు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన
ఫిబ్రవరి 28లోపు తేల్చేస్తారు
క్రమబద్ధీకరణకు అవకాశం లేకుంటే కూల్చివేతలే
ఈనాడు - హైదరాబాద్‌
లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకున్న దరఖాస్తులను ఫిబ్రవరి 28లోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. నోటీసులు జారీ చేసిన తర్వాత నిర్ణీత గడువులోగా అపరాధ రుసుములు చెల్లించని దరఖాస్తులను తిరస్కరించాలని సూచించింది. క్రమబద్ధీకరణకు అవకాశం లేని భవనాలను నిబంధనల మేరకు కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలికలు, మున్సిపాలిటీల కమిషనర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌), భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) కింద పురపాలకశాఖ దరఖాస్తులను స్వీకరించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల ప్రకారం దరఖాస్తుల గడువు 2016 డిసెంబరు 31తో ముగిసింది. గడువు ముగిసిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఆయా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. అయితే పరిపాలన, సాంకేతిక కారణాలతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కుడా, ఇతర మున్సిపాలిటీల్లో గడువులోగా పరిష్కారం కాలేదు. ఒక్కో దరఖాస్తు పరిశీలనకు ఎక్కువ సమయం పట్టడం, దరఖాస్తుల్లో పేర్కొన్న సమాచారం.. ఆ మేరకు అవసరమైన పత్రాలు లేకపోవడం, హక్కు వివాదాలు, వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమైందని ఆయా కమిషనర్లు ప్రభుత్వానికి వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ దరఖాస్తులపై ఈనెల 12న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా దరఖాస్తుల్ని పరిష్కరించాలని   ఆదేశించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలకశాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 తర్వాత ఆయా దరఖాస్తుల పరిష్కారానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని పేర్కొంది. బీపీఎస్‌ కింద వచ్చిన దరఖాస్తులు, పరిశీలించినవి, క్రమబద్ధీకరణకు అర్హమైనవి, తిరస్కరించిన వాటి వివరాలు ఈనెల 22లోగా అందజేయాలని సూచించింది. క్రమబద్ధీకరణకు అర్హం కాని భవనాలపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని ఆదేశించింది. తెలంగాణలోని 73 మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల సేకరణకు ఆటోట్రాలీల కొనుగోలుకు రుణాన్ని ఇచ్చేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది. ఎస్‌బీఐ సీజీఎం స్వామినాథన్‌, పురపాలక కమిషనర్‌ శ్రీదేవి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
వచ్చేనెల 5కు  తేలిపోయినట్లే
* అపరిష్కృత దరఖాస్తులన్నీ 15 రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలి. సంబంధిత అధికారులు తనిఖీ, పరిశీలన సిబ్బందికి ఆదేశాలివ్వాలి.
* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ భూముల సెక్షన్‌ అధికారులు ఆయా ప్లాట్లు, లేఅవుట్ల యాజమాన్య హక్కులను పరిశీలించి.. 10 రోజుల్లో వివరాలు నమోదు చేయాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో పరిశీలన పూర్తి చేయాలి.
* తిరస్కరించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తిరస్కరణ లేఖలు, అనుమతించిన వారికి రుసుము చెల్లింపు నోటీసులు ఫిబ్రవరి 5లోగా అందించాలి. అర్హులైన అర్జీదారులు 15 రోజుల్లోగా మిగతా అపరాధ   సొమ్ము చెల్లించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. నోటీసుతోపాటు అందిన అపరాధ రుసుము, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. అర్హులైన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు అనుమతి పత్రాలు ఫిబ్రవరి 28లోగా మంజూరు చేయాలి. గడువులోగా అపరాధ రుసుము, అవసరమైన పత్రాలు ఇవ్వని దరఖాస్తులను తిరస్కరించి.. సమాచారాన్ని అర్జీదారులకు పంపించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.