kalanjali_200
Comments
0
Recommend
0
Views
72
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహం
మంత్రులతో తరచూ భాజపా నేతల భేటీలు
దిల్లీ: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు పనితీరుపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలనాథులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులతో పార్టీ నేతలు తరచూ సమావేశం కావడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు సమర్థవంతంగా తెలియజెప్పే వీలుంటుందని భాజపా భావిస్తోంది. పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభులతో సమావేశమయ్యారు. తమతమ శాఖలు సాధించిన అంశాలను గురించి ఈ శాఖలు వీరికి సవివరంగా తెలిపాయి. ఇతర కీలక శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అరుణ్‌జైట్లీ (ఆర్థిక), నితిన్‌ గడ్కరీ (రహదారి రవాణా, జాతీయ రహదారులు), నిర్మలా సీతారామన్‌ (వాణిజ్యం), పియూష్‌ గోయెల్‌ (విద్యుత్తు, బొగ్గు)లతోనూ ఇలాంటి భేటీలు త్వరలో జరగనున్నాయి. నీతి ఆయోగ్‌ సభ్యుడు వివేక్‌ దేబ్‌రాయ్‌ కూడా పార్టీ నేతలకు తగినంత సమాచారం సమకూర్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రజలకు తెలియజేయడమే ఈ కసరత్తు ముఖ్యోద్దేశమని భాజపా జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ తెలిపారు. పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్‌ సహస్రబుద్ధే నేతృత్వంలోని భాజపా సుపరిపాలన విభాగం ఈ కసరత్తును పర్యవేక్షిస్తుండగా, దానిలో సింగ్‌ ఒక సభ్యుడు. త్వరలోనే కేంద్రం పూర్తిస్థాయి రెండో బడ్జెట్టును ప్రవేశపెట్టనుండడంతో ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్‌ దూకుడుగా విమర్శనాత్మక ప్రచారం చేస్తోంది. దీనిని ఎదుర్కోవడంలో భాగంగా మంత్రుల నుంచి, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా ప్రభావం కనిపించే శాఖల్ని చూస్తున్న ఆమాత్యుల నుంచి తాజా సమాచారం కోసం తరచూ నేతలతో వారి భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజానుకూల విధానాలపై సమర్థంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందని భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో, మంత్రిమండలి భేటీల్లో ప్రధాని నరేంద్రమోదీ చెబుతూ వస్తున్నారు.
Your Rating:
-
Overall Rating:
5.0