close

నేత్రపర్వంగా శ్రీ సీతారామ కళ్యాణం

సింగపూర్: సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న స్థానిక శ్రీశ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పి.జి.పి. హాల్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం అట్టహాసంగా, భక్తుల రామనామ సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నయనానందకరంగా జరిగిన కల్యాణాన్ని సింగపూర్ వాసులు తిలకించి పులకించారు. భద్రాచలం నుంచి వచ్చిన అర్చక బృందం ఈ కల్యాణాన్ని నిర్వహించారు. దివ్యమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి పూర్ణకుంభం స్వాగతంతో, భాజాభజంత్రీలు, వేదమంత్రోచ్చరణలు, భక్తుల కోలాహలం మధ్య కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనంపై అమ్మవారిని, స్వామివారిని ఆసీనులను గావించారు. అనంతరం తిరువారాధన, విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం జరిపించి మండపశుద్ధి చేశారు. మోక్షబంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ రజత యగ్నోపవీత ధారణం చేశారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. పుష్పాభరణాలతో సీతారాములను అలంకరించి సకలోపచారాలు చేసి, మధుపర్కప్రాసన అనంతరం మహాసంకల్పం పఠించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి , కార్యదర్శి సత్య చిర్ల, కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి దంపతులు సింగపూర్ వాసుల తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్థానిక వడపథిర కాళియమ్మన్, సీతారామ దేవాలయం తరుపున ఆలయ ధర్మకర్త సెల్వనాయకి మల్లిక గారు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో సీతారాముల కల్యాణం నిర్వహించిన విధంగానే ఇక్కడా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కల్యాణం నిర్వహించేందుకు సహకరించిన భద్రాచల దేవస్థానం సమన్వయక్త పద్మజారెడ్డి గారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండువేల మంది పైగా హాజరయ్యారని, హాజరు కాలేనివారు సామాజిక మాద్యమాల ద్వారా వీక్షించారని కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించిన కార్యవర్గ సభ్యలు, స్థానిక దేవాలయాల కమిటీలు, కల్యాణంలో పాల్గొన్నవారికి, దాతలు, స్వయం సేవకులు, కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.