వైకాపా, జనసేన, భాజపా ఒకే తాను ముక్కలు
తుపాను బాధితుల్ని పరామర్శించే తీరిక లేని రాజ్‌నాథ్‌సింగ్‌
  ధ్వజమెత్తిన తెదేపా నేతలు
ఈనాడు, అమరావతి: తుపాను దెబ్బకు కకావికలమైన శ్రీకాకుళం జిల్లాలో ప్రజల్ని ఆదుకోడానికి ముందుకు రాని వైకాపా, జనసేన, భాజపాలు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. అవి ఒకేతాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రానికి వచ్చి కూడా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం దారుణమని మండిపడ్డారు.

ప్రజల్ని రెచ్చగొడుతున్న వైకాపా కిరాయిగూండాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడాన్ని వైకాపా, జనసేన, భాజపాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.   శ్రీకాకుళం జిల్లాలో వైకాపా కిరాయిగూండాలు ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాల్ని అడ్డుకుంటున్నారు. జగన్‌ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో స్పష్టం చేయాలి. వారసత్వం గురించి మాట్లాడే అర్హత పవన్‌కల్యాణ్‌కు లేదు. వారసత్వం కారణంగానే ఆయన సినిమాల్లోనికి వచ్చారు. వైకాపా, భాజపా, జనసేనలు తమ చీకటి ముసుగును తొలగించుకుని ఒకే వేదికపైకి వచ్చి పోరాడితే వారి బలమేంటో, మా బలమేంటో తెలుస్తుంది. నిజాయతీగల కమ్యూనిస్టు పార్టీలు మోదీ దర్శకత్వంలో నడుస్తున్న జగన్‌, పవన్‌లను ప్రశ్నించి తీరాలి.

- బుద్ధా వెంకన్న, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌

భాజపా నేతలు కేంద్రానికి ఒక్క నివేదికన్నా ఇచ్చారా?
రాష్ట్రంలోని భాజపా నాయకులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట నివారణ చర్యలపై కేంద్రమంత్రికి ఒక్క నివేదికైనా ఇచ్చారా? ఆపార్టీ రాష్ట్ర నాయకులకు జగన్‌, పవన్‌లపై ఉన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంపట్ల లేకపోవడం విచారకరం. పేద, బలహీన వర్గాలు, రైతులను ఉద్ధరించామని చెప్పిన రాజ్‌నాథ్‌... రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు రూ.350కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?

- పంచుమర్తి అనురాధ, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి

పవన్‌ దిల్లీలో కవాతుచేస్తే బాగుండేది
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పవన్‌ కల్యాణ్‌ దిల్లీలో కవాతు చేస్తే బాగుండేది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న ఆయన ఎప్పుడు, ఏవిధంగా మాట్లాడతారో తెలియడంలేదు. కాటన్‌ బ్యారేజ్‌పై కవాతు నిర్వహించిన ఆయన అక్కడకు వచ్చిన వారికి ఏ సందేశం ఇచ్చినట్టు? ఒక జాతి నిర్మాణం గురించిగానీ, రాజకీయ వ్యవహారాల గురించిగానీ తెలియని ఆయన ముఖ్యమంత్రిని, లోకేష్‌ని విమర్శించడం ఆయనలోని అభద్రతాభావానికి నిదర్శనం. జనసేన పార్టీలో సామాజిక న్యాయం లేదు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావుల గురించి అవహేళనగా మాట్లాడటం, వారి కుటుంబాలను అవమానించడం పవన్‌కే చెల్లింది.

-జూపూడి ప్రభాకరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

తుపాను సాయంపై ఉదాసీనతÅ
జగన్‌, పవన్‌లు తుపాను బాధితుల ఇబ్బందులపై బాధ్యతారహితంగా, పసలేని విమర్శలు చేస్తున్నారు. వారు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తక్షణ సహాయం కింద నిధులు ఇవ్వాలని అడగకపోవడం శోచనీయం. తుపాను బాధితుల్ని ఆదుకోవడానికి వెంటనే రూ.1200 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఆ దిశగా రాజ్‌నాథ్‌సింగ్‌ ఎలాంటి చొరవా చూపలేకపోయారు. విభజన చట్టంలోని హామీల అమలు పర్యవేక్షణ బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖదే. రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు.

- లంకా దినకర్‌, తెదేపా అధికార ప్రతినిధి

రాజకీయం

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.