ప్రధానాంశాలు

కొలువుదీరనున్న మహాగణపతి
57 అడుగుల ఖైరతాబాద్‌ గణనాథుడు
హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్‌ మహా గణపతి ఈసారి ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతి’గా కొలువుదీరనున్నాడు. విగ్రహం ఎత్తు 57 అడుగులు... కాగా వెడల్పు 24 అడుగులుగా ఉంది. విగ్రహం కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు. ఇక నిత్యం లక్షలాదిగా తరలివచ్చే వారితో ఖైరతాబాద్ భక్తజన సంద్రంగా మారనుంది.

ఈ విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చేసే వారికి, మొక్కే భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌ శర్మ సూచనల మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంది. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, శిల్పి షష్టి పూర్తి నేపథ్యంలో విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు. దాంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగులు ఈ పర్యాయం రూపుదిద్దుకుంది. ఆలాగే వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో ఆకట్టుకోనున్నాడు. వినాయకుడి తలపై ఏడు సర్పాలతో విగ్రహం అలంకరణ జరిగింది. పక్కనే ఏడు ఏనుగులు నమస్కరించే ఆకారంలో ఏర్పాటు చేశారు. గణపతి మండపంలోనే కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తు ఉన్నాయి.

ఏడు ముఖాలతో కూడిన వినాయకుడికి 14 చేతులు ఉన్నాయి. ప్రతి చేతిలోనూ ఓ ప్రత్యేకతను చాటుకునేలా అలంకరణ చేశారు. కుడివైపు గల ఏడు చేతుల్లో పైనుంచి కిందకు వరుసగా.. అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వాదం రూపంలో ఉంటాయి. అలాగే ఎడమ వైపు ఏడు చేతుల్లో పైనుంచి కిందకు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డు ఉంటాయి. కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది వెంకటేశ్వరుడి కళ్యాణ సంవత్సరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీనివాస కళ్యాణంలో లక్ష్మీ, విష్ణువు, శివపార్వతి, బ్రహ్మ సరస్వతి, నారదుడు, కుబేరుడు, గరుత్మంతుడు ఉంటారు. ఆలాగే ఎడమ మండపంలో నందిపై శివ పార్వతి కుమారస్వామి లింగాన్ని వినాయకుడు పూజిస్తున్నట్లు, శివుడి తలపై గంగ ఉన్నట్లు రూపొందించారు.

విగ్రహ నిర్మాణంలో ఇనుము, గన్నీ వస్త్రం, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మట్టి, కొబ్బరి పీచు, వాటర్‌ పెయింట్స్‌ ఉపయోగించారు. షెడ్డుకోసం కర్రలు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నుంచి తెచ్చారు. షెడ్డును ఆదిలాబాద్‌కు చెందిన 20 మంది బృందం నిర్మించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ను తమిళనాడులోని తూత్తుకూడి (రాజపాళయం) నుంచి తెప్పించారు. ఇనుము విశాఖ స్టీల్‌ నుంచి రాగా మచిలీపట్నానికి చెందిన బృందం వెల్డింగ్‌ పనులు చేసింది. కొబ్బరి పీచు తమిళనాడులోని సేలం నుంచి తెచ్చారు. మహా గణపతిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.


మరిన్ని

© 1999 - 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers