close

అంతర్యామి

పరమాత్మ ఉనికి

భూమిమీద, సంద్రంలో, గాలిలో, అగ్నిలో, దిక్కుల్లో, రేయింబవళ్ళు, సూర్య చంద్రాదుల్లో, ఓంకారంలో... ఇలా అన్ని చోట్లా ఉంటాడాయన.
‘ఆయనే దగ్గరున్నా, ఆయన దగ్గరున్నా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఆయన అండ ఉంటే సిరిసంపదలకు లోటు ఉండదు. ఆ ఒక్కడే ఎందరితోనో సమానం. ఆ ఒక్కడూ నిర్లిప్తుడైతే జగమంతా శూన్యం. ఇంతకీ ఎవరాయన? ఎలా, ఏ రూపంలో, ఎక్కడ ఉంటాడు? ఆయన ఎవరికి దగ్గరవాడు? ఎవరికి దగ్గరౌతాడు? ఎవరు దగ్గర చేసుకోగలరు? ఎవరికి, ఎలా, ఎందుకు, ఎప్పుడు చిక్కుతాడు- ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం భాగవతం చెబుతోంది. ఆయన పేరు పరమాత్మ.
ఆయన ఎవరికీ చిక్కకపోతే, ఎవరి ఆలోచనలకీ అంతుపట్టకపోతే- అలాంటి ఆయన కోసం ఎందుకీ తహతహ? ఈ సూటి ప్రశ్నకు సమాధానం ‘ఆయన జగదాధారుడు కాబట్టి...’ అని. అలాంటి వాడైతే అందరికీ అందుబాటులో ఉండాలిగాని, అందకుండా ఉంటే ఎలాగని అడిగేవారున్నారు. అలాంటివారికి సమాధానంగా... ‘ఏ మానవుడు ధర్మమార్గాన నడుచుకోడో వాడు చదువుకున్నా మూర్ఖుడే. భౌతికంగా ధనికుడైనా ఆధ్యాత్మిక ధనం లేకపోతే నిరుపేదే. శారీరకంగా బలవంతుడైనా మానసికంగా శక్తిహీనుడే. ధర్మాన్ని అనుసరించకపోతే మనిషిగా పుట్టినా పశుసమానుడే అంటూ భాగవతంలో అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పారు.
ఆయన అనుగ్రహం కోసం చేయవలసిందల్లా... మనసు ఆయన పాదాలపైన, పలుకులు ఆయన గుణాలను వల్లెవేయడం పట్ల, చేతులు ఆయన మందిరాన్ని అలంకరించడంపట్ల, చెవులు ఆయన కథాగాన శ్రవణాభిలాషతో, చూపులు ఆయన రూప వీక్షణాభిలాషతో, శిరస్సు ఆ మూర్తికి కైమోడ్పులు చేస్తూ, పాదాలు ఆయన మందిరం వైపు దారి తీసేవిగా, మనసు ఆయనయందే లగ్నమైనదిగా ఉండాలి. అలా అయిననాడు ఆయనే తనంత తానుగా వశమవుతాడు.
ఆయన వశమయ్యే పరిస్థితులను భాగవతంలో చెప్పిన సందర్భాలు మచ్చుకు కొన్ని...
ప్రథమ స్కంధంలో- ‘మునిశ్రేష్ఠులు రాసిన భాగవతాన్ని సద్భక్తితో వినాలనే కోరిక ఉన్నవారి మనసుల్లో తనంతట తానే చిక్కుబడిపోతాడు మాధవుడు’ అని స్పష్టంగా చెప్పాడు గ్రంథకర్త.
ద్వితీయస్కంధంలో- ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవికాలనే తాపత్రయాల వెంట పరుగులు తియ్యడంతోనే మానవ జీవితం గడిచిపోతుంది. అందువల్ల పరమాత్మను తలుచుకోవడానికి సమయం చిక్కని పరిస్థితి చాలామందికి ఉంది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకుని పరమార్థమేదో దాన్ని మాత్రమే మనసులో నిలిపి, అనుసరించే వారి మనసుల్లో ఆ పరమాత్మ తనంత తానుగా కొలువై ఉంటాడని భాగవతం చెబుతోంది.
నశించేది శరీరం మాత్రమేనని, ఆత్మ కాదని నిజానికి ఆత్మకు మరణం అనేది లేనేలేదని తెలుసుకుని మసలడాన్ని సాంఖ్యయోగం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి గురించి అత్యున్నతమైన వాస్తవ జ్ఞానమే సాంఖ్యం. అది సర్వ మానవాళికీ అత్యంత ఆవశ్యకమైంది. ఆ జ్ఞానం కలిగి ఉంటే ధర్మనిష్ఠ కలుగుతుంది. అది కలిగిననాడు ఏదో ఒక సమయంలో ఆ పరమాత్మ గురించినచింత ఏర్పడుతుంది. అది ఏర్పడిన వారిని ఆ అంతర్యామి వెదుక్కుని వచ్చి మరీ వారికి వశమవుతాడని భాగవతం చెబుతోంది.
 

- అయ్యగారి శ్రీనివాసరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.