close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆత్మహత్య మహాపాపం

లుకల బాధకు ఇల్లు కాలబెట్టుకోవడం అవివేకం. మనసు చేసే పొరపాట్లకు శరీరాన్ని బలిచేయడం అజ్ఞానం. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు చోదకుల్ని వదిలేసి వాహనాన్ని నిందిస్తారా? తప్పు ఒకరిదైతే వేరొకరిని శిక్షిస్తారా? లేదు. ఆత్మశక్తికి, దేహానికి మధ్య వారధిలా పనిచేసేదే మనసు. అది దృఢంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు మరమ్మతులతో వంతెనను సరిచేసుకోవాలి. అంతేగాని, గట్టును కూల్చేయడం ఎవరూ మెచ్చని పని.

ఎంతో మేలుచేసే మనసూ కొన్నిసార్లు భరించ వీలుకానన్ని ఇబ్బందులు పెడుతుంది. అనేక సమస్యలకు దారితీస్తుంది. స్వల్ప కాలవ్యవధిలోనే పలు ప్రమాదాలకు గురిచేస్తుంది. క్షణికావేశానికి లోనుచేసి జీవితాల్ని బుగ్గిపాలు చేస్తుంది. ఇలా ఎన్నో తిప్పలు పెట్టే మనసును అప్పుడే గట్టిగా పట్టుకోవాలి. దానితోనే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలి. నిద్రావస్థలో ఉన్న బుద్ధి మేల్కొని రంగంలోకి దిగాలి.

శుభ్రంగా లేని పాత్రలో వండిన వంటలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మనసు మంచిగా లేనప్పుడు చేసే ఆలోచనలు జీవిత రథాన్ని పక్కదారి పట్టిస్తాయి. అందుచేత భాండశుద్ధి చేసినట్లుగా మనసునూ కడగాలి. అందుకోసం మనసుకు ఉదయం, సంధ్యాకాలాల్లో లోపల స్నానం చేయించాలి. ఆ పని ధ్యానంలో సాధికారికంగా జరుగుతుంది. ధ్యాన సాధనలో మనసు గరిష్ఠంగా సున్నితత్వాన్ని పొందుతుంది. మహావృక్షం గంభీరంగా, బలంగా ఉండవచ్చుగాక కానీ, అది పెను తుపానుకు కుప్పకూలిపోతుంది. చిన్నమొక్కలు చాలా లేతగా ఉంటాయి. అవీ ప్రకృతి విపత్తులకు పడిపోతాయి. మళ్ళీ లేచి నిలబడతాయి. వాటి ఉన్నతిని చూసి ఓర్వలేక ఎవరైనా పెరికివేస్తారేమోగానీ వాటికవే నశించిపోవు. అంటే ‘ఆత్మహత్య’ చేసుకోవు.

వాస్తవానికి ఆత్మను ఎవరూ హత్య చెయ్యలేరు. అది అసాధ్యం. ఎందుకంటే, గీతలో చెప్పినట్లుగా ఆత్మను నీరు తడపలేదు. అగ్ని దహించదు. గాలి ఆర్పనూ లేదు. ఖడ్గం ఛేదించ వీలుకాదు. ఆత్మ నాశనం లేనిది.

‘ఆత్మహత్య’ క్షణికావేశంలో జరిగే పని. అది- అనైతికం, అమానవీయం, చట్టరీత్యా నేరం, ఆధ్యాత్మిక దృష్ట్యా మహాపాపం. తాత్విక కోణంలో చూస్తే- జీవితాన్ని యథాతథంగా స్వీకరించే ధైర్యం లేని పిరికి చర్య. వ్యవస్థపై, విధిపై, తనపై కసి తీర్చుకునే ఒక అనాలోచిత అనాగరిక ప్రక్రియ.

ఒక రోజులో రాత్రింబవళ్లు ఉన్నట్లే మానవ జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. చీకటి వెలుగుల్ని ప్రకృతి సమానంగా స్వీకరిస్తుంది. పంచభూతాత్మకమైన ఆ ప్రకృతిలోంచే వచ్చిన మనిషి మాత్రం సౌఖ్యం కావాలంటాడు. బాధను వద్దంటాడు. ఆ రెండూ కోరికలే. గౌతమ బుద్ధుడు ‘కోరికలే దుఃఖానికి మూలం’ అన్నాడు. ఆ మహనీయుడి మాటల్లోని విస్తృతమైన, లోతైన అర్థాన్ని అవగాహన చేసుకోవాలి. అంతేగాని కోరికలు, లక్ష్యాలు లేకుండా నిస్సారంగా జీవితం గడిపేయడం కాదు. సంకల్పాలు కార్యోన్ముఖుల్ని చేసే ఉత్ప్రేరకాలు. భక్తిప్రపత్తులతో, పూర్తి ఎరుకతో చేసే ప్రతికార్యం ఒక ప్రార్థన అవుతుంది. వయసుతోపాటు వచ్చే జ్ఞానం వల్ల ‘పనే దైవం’ అనే భావనా కలుగుతుంది.

పని వల్ల శరీరం శ్రమిస్తుంది. మనసూ పరధ్యానంలో పడిపోక ధ్యానాత్మకమై నిలుస్తుంది. ఫలితంగా, దేహానికి ఆరోగ్యం సమకూరుతుంది. మనసుకూ సంతోషం కలుగుతుంది. మానవ జీవిత ప్రగతి రథం ముందుకు కదులుతుంది.

ఆనందంగా ఉండే వ్యక్తి ‘ఆత్మహత్య’ చేసుకుంటాడా? లేదు. జీవితం పట్ల అపార ప్రేమ కలిగి ఉంటాడు. బాధ్యతాయుతంగా, స్వచ్ఛందంగా అభివృద్ధి పథంలో పాలుపంచుకుంటాడు. ఇదంతా ధ్యానం వల్ల సాధ్యమవుతుంది!

- మునిమడుగుల రాజారావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు