close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవిత్ర హృదయం

హృదయం లేని మనిషి ఉండడు. శారీరక శుభ్రత కన్నా మానసిక పరిశుద్ధత కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన హృదయమే ఆధ్యాత్మికతకు మూలం. నోటికి అందే తిండి మాత్రమే కాదు, ఇంద్రియాల ద్వారా మనసుకు అందే విషయాల్లోనూ ఎటువంటి కల్మషం లేకుండా చూసుకోవాలి.

జ్ఞాన, భక్తి, రాజ యోగాల్లో నైతికత అవసరమని, కర్మయోగంలో అంత ఆవశ్యకం కాదని కొందరు భావిస్తారు. ఇంద్రియ నిగ్రహం, అహింస, సత్యసంధత, అస్తేయం (ఇతరుల వస్తువులను కోరుకొనకపోవడం), అశత్రుత్వం (శత్రువు అన్న భావన లేకపోవడం)- ఈ గుణాలు కర్మయోగ సాధనకు అత్యంత ముఖ్యమని జ్ఞానులు చెబుతారు. ఇవేమీ పాటించకపోతే చేసేది కర్మయోగం కాదు... కర్మ అవుతుంది.

మానసిక పవిత్రతను సాధించే దిశగా సాగే నైతిక నియమావళిని పతంజలి మహర్షి రెండు భాగాలుగా విభజించారు. ఒకటి- యమ (సాధారణం); రెండోది- నియమ (నిర్దిష్టమైనది).

యమలో అహింస, బ్రహ్మచర్యం, సత్యపాలన, అస్తేయం, అపరిగ్రహం (ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడం) అనే అయిదు నీతి సూత్రాలు ఉంటాయి.

నియమ కూడా అయిదు నీతి సూత్రాలు కలిగి ఉంది. అవి... శౌచం- శరీరం, మనసు పవిత్రంగా ఉండటం. తపస్సు- ఇంద్రియ నిగ్రహం. స్వాధ్యాయం- సత్‌ గ్రంథపఠనం. ఈశ్వర ప్రణిధానం- శరణాగతి.

మనం వస్తుమయ ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటి ఆకర్షణలకు లోబడకూడదు. భగవంతుడి మీద మనసుపెట్టి, వీలైనంత స్వచ్ఛంగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనికి అనుబంధ భాషణంగా ‘పడవ నీటిలో ఉండొచ్చుగాని, నీరు పడవలో ఉండకూడదు కదా’ అంటారు శ్రీరామకృష్ణులు.

సహజంగా మనం మన శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తాం. అలాకాక, ప్రతిరోజూ ఇతరుల మంచి కోసం ప్రార్థన చేయడం ఉత్తమ లక్షణమని మహోన్నత స్వభావులంటారు. ధ్యానానికి కూర్చోగానే ‘సర్వప్రాణులకు, నాలుగు దిక్కులకు ప్రేమతో నిండిన ఆకాంక్షను వెదజల్లాలి’ అంటారు వివేకానందస్వామి. ఇది మనోనైర్మల్యానికి ప్రతీక.

మురికి నీరు మురికిని తొలగించలేదు. నిత్యం అపవిత్ర భావాలతో అలరారే వ్యక్తి, మనో పవిత్రతను ఎన్నటికీ పొందలేడు. నిరంతరం ‘పవిత్రత నా జన్మహక్కు, నా నిజ తత్త్వం, నా సహజ ప్రవృత్తి, నేను పరిశుద్ధుణ్ని, ఆనందమయుణ్ని’ అన్న భావపరంపరతో కొనసాగడం- హృదయ స్వచ్ఛతను సూచిస్తుంది, పోనుపోను సాధిస్తుంది.

హృదయ పవిత్రతలో పరిణతి సాధించిన వ్యక్తి అజాత శత్రువు. అడుగుపెట్టిన చోటల్లా గౌరవాభిమానాలు పొందుతాడు. అతడి సమక్షాన్ని అందరూ కోరుకుంటారు. సామీప్యాన్ని అనుభూతించడానికి ఉవ్విళ్లూరుతారు. పునీత భావనలు కలిగిన మహనీయుల కూడికతో, జన సమూహం సత్సంగం స్థాయికి చేరుతుంది. మనసుకు అంటిన మలినాలు ప్రక్షాళన అయినవారంతా ధవళ వర్ణ తేజస్సుతో వెలుగొందుతారు.

దీపాల్లో, కొద్దిసేపటిలో మలిగేవి కొన్ని ఉంటాయి. అఖండ దీపంగా నిలిచి, నలువైపులా వెలుగులు చిందిస్తూ, నిరంతరం తిమిర సంహారం చేసేవి మరి కొన్ని ఉంటాయి.

మనిషిగా పుట్టి నిత్య చైతన్య దీపంలా, దేదీప్యమానంగా వెలుగొందుతూ అంతర్యామిలో అంతర్లీనం కావడమే ముక్తి. అందుకు హృదయ పవిత్రత ఎంతగానో దోహదం చేస్తుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.