
అంతర్యామి
పారవశ్యం
పారవశ్యం అంటే పరులకు వశమైపోవడం అనేది సామాన్యార్థం. పర అనే పదానికి ‘ఇహం కానిది, పైన ఉండేది’ అనేవి సరైన అర్థాలు. పరమందు(పైను)న్నవాడు కాబట్టి సర్వాత్మకుణ్ని ‘పరమాత్మ’ అంటారు. ఆయనకు వశమైనవాడు పరవశుడు. అతడు పొందే స్థితి పారవశ్యం. ఆ స్థాయికి చేరుకున్నవారు పొందేది అనురాగ ద్వేషాలకు అతీతమైన నిర్వికార స్థితి. లోక కల్యాణమే వారి ధ్యేయం.
భాగవతాన్ని వ్యాసుడు రచించింది, పోతన అనువదించింది- ఆ స్థితికి చేరుకున్నాకే. అందుకే భాగవతాన్ని చదివే/వినేవారికి సైతం క్రమేపీ నిర్వికార స్థితి కలుగుతుంది.
పారవశ్య ప్రాథమిక దశలు ఆత్మానందం, శరణాగతి. ఆ స్థితిలో చేసిన ఏ పనైనా నిష్కామంగానే ఉంటుంది. తాము దృష్టి సారించిన విషయం తప్ప మరొకటి వారి తలపుల్లోకి రాదు. అందుకే పలువురిని ఆకట్టుకుంటుంది. అలా ఆకర్షితులైనవారు సైతం క్రమేపీ అప్రయత్నంగా కొందరు, ఇష్టపూర్వకంగా మరికొందరు ఆ స్థితికి చేరతారు. అప్పుడు వారిలో ఐహికాముష్మికాలు రెండింటికీ దోహదపడే ఆలోచనలు కలుగుతాయి. కాబట్టే భాగవతం చదివేవారు భక్తి, ఆర్ద్రత, ఆనందం, హాయి లాంటి అనుభూతులు పొందుతారు. ఫలితంగా ముక్తి కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
భాగవతాన్ని రచించిన, అనువదించిన ఇద్దరిలోనూ వ్యాసుడు మనశ్శాంతి కోసం రచించాడు. పోతన మాత్రం అంతకు మించిన విశాల భావనతో అనువాదాన్ని చేపట్టాడు. భగవంతుడిగా పిలిచే సర్వవ్యాపకుడి గుణగణాలు, ఉనికి, లక్షణాలు, ఆయనను చేరుకునే మార్గాలు... అన్నింటినీ విశదీకరించాడు.
‘నీవే తప్ప మరొకరు రక్షించలేరు’ అని గజేంద్రుడి చేత అనిపించడంలోని ఆంతర్యం ఏమిటి? ‘భక్తులను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే’ అనే బోధనను అంతర్లీనంగా చేయడం.
‘తాపసమందార నాకు దయసేయగదే’ అని సుదాముడు అడగడంలో కోరిక అదే.
పరమాత్మ స్వరూపాన్ని దక్షుడితో కళ్లకు కట్టినట్లు ఆరో స్కంధంలో చెప్పించాడు పోతన. ‘ఒక్కడు, నిత్యుడు, అంతం/ జన్మ జరా మరణాదులు లేనివాడు. అన్నింటా ఉండి అన్నీ తానే అయినవాడు; స్థూల సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మమైన రూపం కలవాడు స్వయం ప్రకాశుడై లోకాలను ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మ.
అంతేకాదు ‘నామ, రూప రహితుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్వికల్పుడాయన. ఆ సర్వాత్మకుడి అనుగ్రహం వల్లే జగత్తంతా స్వస్థితిలో ఉంది. ఆయన అనుగ్రహం నాకు కలిగితే నా జన్మ చరితార్థమవుతుంది’ అని చెప్పించాడు. ఇంకా అనేక చోట్ల ‘ముక్తి కోరుకునేవారు తప్పకుండా భగవత్కథలు వినా’లనే సూచన చేశాడు. భాగవతం చదివేవారికి ఆయా పాత్రల పారవశ్య స్థితి అర్థమవుతుంది.
వ్యాసుడి రచనలోనూ అనేక సందర్భాల్లో ఇదే భావం కనిపిస్తుంది. ఆయన ఒకచోట ఉద్దవుడి చేత, ‘ఆత్మజ్ఞానం కలిగి ఉండేదెప్పుడు / లేకుండా పోయేదెప్పుడు అనే ఎరుక కలిగినవాడే ధీమంతుడు. ఆ జ్ఞానం నిష్కామ స్థితి పొందినప్పుడే కలుగుతుంది.’ అని చెప్పించాడు. అలా చెప్పడంలోని ఆంతర్యం- ‘లోకంలో అన్నీ నశించిపోయేవే. పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు’ అని బోధించడమే. సర్వవ్యాపి ఔన్నత్యాన్ని తెలుసుకున్న పారవశ్యమే అలా అనిపించడానికి కారణం. ఇంకా అనేక సందర్భాల్లోనూ ‘లోకాలను రక్షించేవాడు ఆ అంతర్యామే’ అని బోధన చేయడంలో ఆ పాత్రల తాదాత్మ్యత, ఆ కవుల పారవశ్యం ద్యోతకమవుతుంది.
ఇంత పారవశ్యంతో రచించింది కాబట్టే అంతరంగంలో ఆత్మతత్వం, వ్యక్తీకరణలో మార్గసూచనం, బోధనలో లాలిత్యం లాంటి కారణాలు కలిగి భాగవతం పురాణంగా నిలిచింది.
- అయ్యగారి శ్రీనివాసరావు
మరిన్ని కథనాలు

- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు