క్షేత్రం - క్షేత్రజ్ఞుడు
close

అంతర్యామి

క్షేత్రం - క్షేత్రజ్ఞుడు

మహాభారతాంతర్గతమైన భగవద్గీత సకల మానవాళికీ నిత్య పఠనీయ గ్రంథం. శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో అనేక విషయాలను ప్రబోధించిన పద్దెనిమిది అధ్యాయాల్లో ప్రత్యంశమూ మానవ జీవనానికి ఉపయోగపడేదే. ఆధిభౌతిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక సత్యాలకు ఈ గ్రంథం నెలవు. ఇందులోని పదమూడో అధ్యాయాన్ని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పిలుస్తారు. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అనే విషయాలను వివరించి చెప్పిన ఈ అధ్యాయంలోని విషయాలన్నీ అమూల్యాలే.

క్షేత్రం అంటే శరీరమే. ఇందులో పంచ మహాభూతాలు (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, దశేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, చైతన్యం, ధృతి... ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి శరీరాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కలగడానికి మనిషి కొన్ని అర్హతలు సాధించాలి. తానే గొప్పవాడినని భావించకూడదు. డాంబికాన్ని వదిలిపెట్టాలి. హింస చేయడం మానివేయాలి. క్షమించే గుణాన్ని పెంచుకోవాలి. మనసులోనూ మాటల్లోనూ మృదుత్వాన్ని కలిగి ఉండాలి. పూజ్యులైన పెద్దలను గౌరవించాలి. ఇంటా బయటా నిర్మలమైన ప్రవర్తన కలిగిఉండాలి. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అన్నివిధాలా భోగాలపై ఆసక్తిని తగ్గించుకోవాలి. అహంకారాన్ని వదిలేయాలి. జననం, మృత్యువు, ముసలితనం, రోగాల వల్ల కలిగే దుఃఖాలను, దోషాలను తెలుసుకొని జాగరూకత వహించాలి. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మొదలైనవాటిపై అతి మమకారాన్ని పెంచుకోరాదు. భగవద్భక్తిని, ఏకాంత పవిత్ర వాసాన్ని అలవరచుకోవాలి. సుఖాలపై ఆసక్తిని తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానంపై అనురక్తిని పెంచుకొని, స్థిరంగా ఉండాలి. తత్త్వజ్ఞానానికి లక్ష్యం భగవత్ప్రాప్తి ఒక్కటే అని గ్రహించాలి. దీన్నే క్షేత్రజ్ఞానం అంటారు. దీనికి విరుద్ధంగా ఉండేదంతా అజ్ఞానం.

క్షేత్రం అంటే ఏమిటో తెలిసింది కనుక, ఆ క్షేత్రాన్ని అధిష్ఠించి ఉండే పరమాత్మ ఉనికిని తెలుసుకోవాలి. క్షేత్రాన్ని గురించి తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు. అతడే భగవంతుడు. అతణ్ని తెలుసుకోవడమే మనిషికి పరమావధి. అతడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇంద్రియాలతో తెలుసుకొనే విషయాలన్నీ భగవంతుడికి తెలుసు. ఇంద్రియాలకు అతడు అతీతుడు. అతడికి దేనిపైనా ఆసక్తి లేకున్నా, జగత్తును పోషిస్తాడు. అతడు నిర్గుణుడు. అంటే అన్ని గుణాలకూ అతీతుడు. ప్రకృతితో సంబంధం ఉన్నందువల్ల అతడికి గుణానుభవాలు ఉంటాయి.

చరాచరాల రూపంలో వేర్వేరుగా ఉన్నట్లు గోచరించినా, అతడు ఏ రూపానికీ అందడు. బ్రహ్మదేవుడి రూపంలో సృష్టి చేస్తాడు. విష్ణువు రూపంలో అందరినీ కాపాడుతాడు. రుద్రుడి రూపంలో లయం చేస్తాడు. ఇలా క్షేత్రాన్ని గురించి, క్షేత్రజ్ఞుణ్ని గురించి తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం.

యథార్థ జ్ఞానాన్ని అందుకోవడానికి యత్నించడమే మనిషి కర్తవ్యం. అదే మనిషికి శాంతినిస్తుంది. కేవలం ప్రాపంచిక విషయాలు తెలుసుకొంటే చాలదు.

ప్రపంచంలో సకల కర్మలు ప్రకృతి వల్లనే జరుగుతుంటాయి. అనేక రూపాల్లో ఉన్న ప్రాణులన్నీ పరమాత్మ నుంచి విస్తరిస్తున్నాయి. ప్రాణుల శరీరాల్లో ఉన్న ఆత్మ స్వరూపుడైన భగవంతుడికి ఏ కర్మలూ అంటవు. కర్మలు జీవులనే బంధిస్తాయి కానీ పరమాత్మను బంధించలేవు.

క్షేత్ర-క్షేత్రజ్ఞులను గురించి తెలుసుకోవడమే గీతాసారాంశం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న