తొలి ఏకాదశి
close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి ఏకాదశి

విశ్వమంతా ఆవరించి ఉన్న చైతన్యకారకశక్తి విష్ణుతత్త్వం. సర్వవ్యాపి అయిన పరమాత్మ విష్ణువుగా భాసిల్లుతున్నాడు. అలాంటి శ్రీమన్నారాయణుడి దివ్య దేహంనుంచి ఆవిష్కృతమైన సాత్విక రూపక శక్తి- ఏకాదశి తిథి. ఏడాది పొడుగునా ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది.

కృతయుగంలో మురాసురుడు వరబల గర్వితుడై దేవతలపై విజృంభించాడు. ఆ అసురుడితో ఏళ్ల తరబడి యుద్ధం చేసిన శ్రీహరి విశ్రాంతి కోసం యోగనిద్రకు ఉపక్రమించాడు. ఆ తరుణంలో విష్ణువును బాధించడానికి దానవులు సిద్ధమయ్యారు. వారి చర్యను గమనించిన పరమాత్మ, తన శరీరంనుంచి సృజించిన యోగమాయ ఏకాదశీదేవిగా రాక్షస సంహారాన్ని నిర్వర్తించింది. మురాసురుణ్ని తన దివ్యశక్తితో వధించిన ముకుందుడు, మురారిగా వర్ధిల్లాడు. భగవానుడి ఇరవైనాలుగు రూపాలు కేశవ మొదలు శ్రీకృష్ణ వరకు చతుర్వింశతి మూర్తులుగా పురాణాగమ ప్రసిద్ధాలయ్యాయి. పరంధాముడి స్వరూప సంపదగా భావించే మార్గశిర మాసంనుంచి మొదలుకుని కార్తికమాసం వరకు ఉండే పన్నెండు మాసాల్లోని ఏకాదశుల్ని విష్ణువు దివ్యకళలుగా ‘పారమేశ్వర సంహిత’ ప్రతిపాదించింది. ప్రతి మాసానికి ఒక్కో విష్ణు స్వరూపం అధిష్ఠాతగా ఉంటుంది. ఆ క్రమంలో ఆషాఢమాసానికి వామనమూర్తి అధిష్ఠాన దైవం.

మహా ఏకాదశిగా, హరివాసరంగా ఖ్యాతిగాంచిన తొలి ఏకాదశిని శయనైకాదశిగా వ్యవహరిస్తారు. క్షీరసాగరంలో శేషపాన్పుపై శ్రీహరి తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడంటారు. క్షీరసాగరం విశాల విశ్వానికి సంకేతమైతే, శేషుడు అనంత కాలగమనానికి సూచిక. కాలాత్మకుడిగా కాలరూపుడిగా మూర్తీభవించే విష్ణువు యోగనిద్ర ద్వారా, అంతర్వీక్షణతో సమస్త జగద్రక్షణ చింతన చేస్తుంటాడు. తన అంతర్భాగంలో ఉన్న విశ్వాన్ని సదా పరిరక్షిస్తుంటాడు.

తొలి ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు గోచరమవుతాడు. జీవుల్లో చేతనాశక్తి పెంపొందడానికి సూర్యగమన పరివర్తన ఉపకరిస్తుంది. అందుకే తొలి ఏకాదశినుంచి ఆర్ష సంప్రదాయంలో పర్వదినాలు ఆరంభమై, దైవారాధన ముఖ్య భూమిక పోషిస్తుంది. ఏకాదశినాడు వ్రతవిధాన పూర్వకంగా, నియమాల సమాహారంగా విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఏకాదశినాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాసదీక్ష పాటిస్తారు. విష్ణుస్తోత్రాలతో షోడశోపచార పూజ నిర్వహిస్తారు. ద్వాదశినాడు అన్నార్తులకు భోజనం పెట్టి, ఆపై లక్ష్మీనారాయణుల్ని పూజించి, తీర్థప్రసాదాల్ని స్వీకరించి ఏకాదశవ్రత దీక్షను విరమించాలని వ్రత చూడామణి నిర్దేశించింది.

అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాల్ని కలిపి ఇంద్రియ దశకం అంటారు. ఇంద్రియాల్లో కీలకమైనది మనసు. పదకొండో ఇంద్రియమైన మనసు ఎంత ముఖ్యమైనదో, పదకొండో తిథి అయిన ఏకాదశి అంతటి ప్రశస్తమైనదిగా చెబుతారు. అందుకే ఏకాదశిని వామన పురాణం నియామక శక్తిగా అభివర్ణించింది. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది. అందుకే శ్రీహరి ఈ ఏకాదశినుంచి కార్తికశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలంలో చేసే పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, ఆరాధనా ప్రక్రియల సమ్మేళనాన్ని చాతుర్మాస్య వ్రతంగా పేర్కొంటారు.

వ్రతం అంటే కామ్యాల్ని నెరవేర్చేది. అయితే ఏకాదశి వ్రతాన్ని నిష్కామంగా చేయాలి. అలాంటి భక్తులనే సత్వరం స్వామి అనుగ్రహిస్తాడని వరాహ పురాణోక్తి.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు