close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మానవ సేవే మాధవసేవ

మన పురాణాలు, ఇతిహాసాలు ‘మానవ సేవే మాధవసేవ’ అని ఘోషిస్తున్నాయి. సేవాతత్పరతను మించిన గుణం లేదంటారు తాత్వికులు.

వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధం సేవతోనే ముడివడి ఉంటుంది. సేవానిరతితోనే అనుబంధాలు బలపడతాయి. హృదయ మార్దవం చిగుళ్లు తొడుగుతుంది. సేవాగుణం వల్ల ఒంటరిగా ఉన్నామన్న భావనే కలగదు.

నిజమైన సేవ ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించదు. ప్రచారాన్ని, ప్రశంసలను కోరుకోదు. తోటివారి శ్రేయస్సును మాత్రమే అభిలషిస్తుంది.

సేవ అంటే పరుల మనసును కష్టపెట్టేది కాదు. పరుల కార్యాలను నష్టపరచేదీ కాదు. మంచిని ఇతరులకు పంచడం, పదిమందితో కలిసి వారు చేసే పనిలో భాగస్వామి కావడమే సేవ లక్షణం.

రామాయణంలో శ్రీరాముడు మున్యాశ్రమాల సేవలో తరించాడు. భరతుడు శ్రీరామ పాదుకలను సేవిస్తూ, అదే తన భాగ్యమని తలపోస్తూ రాజ్యపాలన చేశాడు. ఆంజనేయుడు సుగ్రీవుడికి మంత్రిగా, రాముడికి బంటుగా మెలగుతూ అద్భుతమైన సేవాధర్మాన్ని ప్రదర్శించి ఉత్తమ సేవకుడిగా నిలిచిపోయాడు.

మహాభారతం అంతటా వ్యక్తుల సేవాధర్మాన్ని విపులీకరించే కథలు అనేకం ఉన్నాయి. భగవత్సేవ, పితృసేవ, మాతృసేవ, పతిసేవ, వృద్ధసేవ... ఇలా ఎన్నో సేవలకు భారతం ప్రాధాన్యం ఇచ్చింది.

గరుత్మంతుడు తల్లి దాస్యం విడిపించడానికి నాగులకు సేవ చేయడమే కాక అమృతాన్ని కూడా సాధించి తెచ్చాడు. ఇది మాతృసేవ. ధర్మవ్యాధుడి కథ మాతాపితరుల సేవ గొప్పతనాన్ని వివరించింది. భీష్మాదులు ధర్మతత్వం తెలిసినవారైనప్పటికీ దుర్యోధనుడి పక్షం వహించి పోరాడటం రాజసేవ. సావిత్రి ఉపాఖ్యానం పతిసేవను, వృద్ధ సేవను తెలుపుతుంది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఆపద్ధర్మాలను బోధిస్తూ ఒక పావురాల జంట కథ చెబుతాడు. అతిథి ఆకలి తీర్చడం కోసం పావురం తనను తాను అగ్నికి సమర్పించుకుంటుంది. ఇది అతిథిఫ సేవ. ఇలా పలురకాలైన సేవల గొప్పతనాన్ని భారతం విపులీకరించింది.

సేవ గొప్పతనాన్ని వివరిస్తూ స్వామి వివేకానంద ఇలా అంటారు. ‘నిర్మలంగా ఉంటూ పరులకు వీలైనంత సహాయం చేయాలన్నదే పూజలన్నింటి సారాంశం. పేదల్లోను, వ్యాధిపీడితుల్లోను ఈశ్వరుణ్ని చూసి వారికి సహాయం చేసేవాడే నిజమైన సేవకుడు. అతడే ఈశ్వరుడికి ప్రీతి పాత్రుడు. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారి కష్టాలను తొలగించి వారికి చేయూతనివ్వాలి. అప్పుడే అతడు చిరస్మరణీయుడవుతాడు. ఎవరైతే పరులకోసం జీవిస్తారో వారే నిజంగా జీవించినట్లు, మిగతావారు జీవించి ఉన్నా మృతతుల్యులే.’

సేవ అంటే మనకున్నదంతా ఇతరులకు ఇచ్చి మనం కష్టాల పాలవడం కాదు. మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలి. వారికి ఆనందం కలిగించాలి. మన విధులను నిబద్ధతతో, నిస్వార్థంతో నిర్వరిస్తూ ఆర్తులకు చేయూతనివ్వాలి.

స్వార్థభావం వీడినప్పుడు, సేవాభావం అలవరచుకున్నప్పుడు మాత్రమే మనిషికి నిజమైన సుఖశాంతులు లభిస్తాయి.

మనకోసం చేసిన పని ఎంత గొప్పదైనా మనతోనే అంతమవుతుంది. పరుల మేలు కోసం చేసే సేవ మాత్రమే మనల్ని చిరస్మరణీయుల్ని చేస్తుంది. అందుకే తోటివారికి తోడ్పడటంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లభించదంటారు విజ్ఞులు.

ఇతరులకు ఎలాంటి సేవ చేసినా నిష్కల్మషమైన మనసుతో చేయాలి. అదే మాధవసేవ. ఆ సేవే భగవంతుడికి ప్రీతికరమైనది. దానికి మెచ్చిన మాధవుడు మన హృదయంలోనే కొలువై ఉంటాడు!

- విశ్వనాథ రమ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.