గోపకాంతలు
close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోపకాంతలు

విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు- పూర్ణావతారాలు. ఈ రెండు అవతారాలకూ అవినాభావ సంబంధాన్ని కలిపినవారు గోపికలు. ఎవరీ గోపికలు? భగవానుడి జగన్మోహన రూపమే గోపికల ఆవిర్భావానికి కారణమైందని గర్గ భాగవతం స్పష్టం చేస్తోంది.
గోపికల్లో శ్రుతిరూప, ఋషిరూప, మిథిలా, కోసల, అయోధ్యాపుర, యజ్ఞసీతా స్వరూప, పుళింద, రమాసఖ్యాది... మొదలైన వారున్నారు. ఆయా గోపికల పేర్లకు ముందున్న పై విశేషణాలు వారి వారి చరిత్రను తెలుపుతాయి.
వేదాలు భగవానుణ్ని ఎన్నో రకాలుగా ప్రస్తుతించాయి. అవి ఒకసారి  ఏకరూపెత్తి ‘భగవాన్‌, నీ  గురించి మేము చేసిన వర్ణనలతో తృప్తి చెందని పురాణ పురుషులు, జ్ఞానులు నిన్ను ఆనంద స్వరూపుడని అభివర్ణిస్తారు. ఆ రూపాన్ని మాకూ చూపించవా?’ అని అడిగాయట. వాటి అభ్యర్థ్ధన మేరకు తన జ్ఞానానంద రూపాన్ని వాటికి చూపాడట. అప్పుడు శ్రుతులు ‘భగవాన్‌! నీ జగన్మోహన రూపాన్ని చూశాక మేం నిన్ను విడవలేక పోతున్నాం. కాబట్టి మాకు నీతో విహరించే అదృష్టాన్ని ప్రసాదించు’ అని ప్రార్థించాయట. ‘ద్వాపరయుగంలో నందవ్రజంలో నేను గోపాలుడిగా అవతరిస్తాను. అప్పుడు మీరు గోపికలై నాతో ఆనంద విహారం చేసే అవకాశం కలుగుతుంది’ అని  వరమిచ్చాడట. వారే శ్రుతి (వేదం) రూప గోపికలు. వీరు నిష్కామ సాన్నిహిత్యంతో మెలగారు.
శ్రీరాముడి వనవాస సమయంలో అక్కడి రుషులంతా ఆయన సుందర రూపానికి ముగ్ధులై ‘స్వామీ, సీతలా మాకూ మీ సాన్నిహిత్యాన్ని ప్రసాదించండి’ అని వేడుకున్నారట. అప్పుడు రాముడు ‘లక్ష్మణుడిలా సేవచేయాలని మీరు కోరి ఉంటే ఇప్పుడే నెరవేరేది. కానీ మీరు సీతలా సాన్నిహిత్య ప్రేమ పూర్వకంగా సేవ చేయాలని భావించారు. నేను ఏకపత్నీ వ్రతుణ్ని. ఇప్పుడు మీ కోరిక నెరవేరదు. ద్వాపరయుగంలో నెరవేరుతుంది’ అని వరం ఇచ్చాడు. వారే రుషిరూప గోపికలు.
శివధనుర్భంగ సమయంలో మిథిలా నగర స్త్రీలు శ్రీరాముణ్ని చూసి మోహితులై మనసులోనే ఆయన అండ కోరుకున్నారట. ఆయన అనుగ్రహంతో వారి కోరిక ప్రకారం నవనందుల ఇళ్లలో జన్మించి సఫల మనోరథులైన వీరు మిథిలా గోపికలు.
కోసల దేశ స్త్రీలు శ్రీరాముడి మోహన మూర్తిని హృదయాల్లో నిలిపి,  ఆయన అనుగ్రహంతో ఉపనందుల కుమార్తెలుగా జన్మించి, కృష్ణుడితో అమలిన శృంగారంతో రాసలీలలాడి తరించారు. వారు కోసల గోపికలు.  
ఒకసారి అయోధ్యలోని స్త్రీలు శ్రీరాముడు తమకు పతి అయితే బాగుండునని కోరుకుంటే, వారినీ అనుగ్రహించాడట. వారంతా సింధుదేశంలో చంపక నగరంలో విమలుడనే రాజుకు కుమార్తెలై జన్మించి దేవదేవుణ్ని చేరుకున్నారు. వారంతా స్నేహ మాధుర్యపు మధురిమలు గ్రోలారు. వారు అయోధ్యాపుర గోపికలు.
సీతను అడవులకు పంపిన తరవాత బంగారంతో యజ్ఞ సీత ప్రతిమలు(యజ్ఞశాలల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి) చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి యజ్ఞం నిర్వహించాడు శ్రీరాముడు. ఆయన సరసన కూర్చున్న ఆ ప్రతిమలు ప్రాణవతులై తమను స్వీకరించమని కోరిన ఫలితంగా  ద్వాపరయుగంలో గోపకాంతలుగా జన్మించి అనురాగపు మధురిమలు పంచారు. వారు యజ్ఞసీతా స్వరూప గోపికలు.  
వీరే కాకుండా దివ్యాదివ్య త్రిగుణావృత్తి, దేవకన్యా స్వరూప, జాలంధర/ సముద్ర కన్యాది గోపికలు వంటివారూ వేరువేరు కారణాల వల్ల ఆయన అనుగ్రహంతో గోపికలుగా అవతరించి ఆయనతో రాసలీలలో తరించారు.

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు