close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమృతం అంటే ఏమిటి?

దేవదానవులు మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకగా ఉద్భవించింది అమృతమన్నది పురాణ కథనం. అమృతాన్ని సేవించాకే దేవతలు అమరులు అయ్యారన్నది పురాణ వచనం.

అమృతం అంటే పానీయం అన్నది లోక విదితం. మృత్యువు అంటే మరణమే కాదు- ఆశా పాశ వ్యామోహాలు. వీటి భ్రాంతిలో ఉండే మనిషి సాలెగూడులో చిక్కుకున్న కీటకంలా గిలగిల్లాడి ప్రాణం విడుస్తాడు. ‘ఇహ సౌఖ్యాల పట్ల ఆకర్షితం కాకుండా, మృత్యువు బారిన పడకుండా అమృతత్త్వంవైపు నన్ను నడిపించు భగవంతుడా’ అని ముముక్షువులు నిరంతరం ప్రార్థిస్తారు. ముక్తి కూడా అమృతమే అన్నది నిఘంటు అర్థం.

ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అరటిపండ్ల కలయిక పంచామృతం. కొంతమంది ఫలోదకాల బదులు కొబ్బరి నీటిని ఉపయోగిస్తారు. ఇది శ్రేష్ఠమైనది. ఆరోగ్యానికి మంచిది. హైందవ పూజా విధానంలో పంచామృతానికున్న స్థానం విశిష్టమైనది.

భగవంతుడి మాటలు తేనెల ఊటలు, త్యాగరాజు తన కృతిలో- పలుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా అంటాడు. మాటలు అలా అమృతోపమానంగా ఉంటే శ్రద్ధగా వినబుద్ధవుతుంది. వీనుల విందైన కమ్మని మాటలు- ఆలకించే వారిని సమ్మోహపరుస్తాయి. ఆకళింపు చేసుకున్నవారిని మంచిదారుల్లో నడిపిస్తాయి. పూర్వం రాజులు రాచరిక కార్యాల్లో మంత్రుల సలహాలు, సూచనలు పాటించినా- ఆధ్యాత్మిక, ధర్మ సంబంధమైన విషయాల్లో గురువుల మాటలు శ్రద్ధగా ఆలకించేవారు. గురువులు ఎలా చెబితే అలా నడుచుకునేవారు. ఆ కాలాల్లో ధర్మం నాలుగు పాదాలా నడిచేది. రాజ్యం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండేది. ఆయా రాజుల ధర్మనిరతి దశదిశలా వ్యాపించి వారిని చరితార్థులను చేసేది.

కొంతమంది చూపులు పున్నమి చంద్రుడి వెన్నెల సోనలా అమృతం కురిపిస్తాయి. అలాంటి వాత్సల్యపూరిత దృక్కుల కోసం ఎంత దూరమైనా పయనమవుతారు. ఆ కనుసన్నల్లో మెలగేందుకు ఉవ్విళ్లూరుతారు. అమృతం సేవించిన దేవతలా, మనిషి శరీరపరంగా చిరంజీవి కాలేకపోవచ్ఛు సదాశయాలతో, సత్కర్మాచరణతో తన జీవితాన్ని పండించుకుని పూర్ణ సాఫల్యంతో చిరంజీవత్వాన్ని పొందవచ్ఛు పుడమిపై జన్మించే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోవచ్ఛు మనిషి జీవితం బుద్బుదప్రాయం. అది ఏ క్షణాన నీటి బుడగలా పగిలిపోతుందో తెలియదు. ఇలాంటి ఎరుక ఉన్న మనిషి తన జీవిత కాలాన్ని అనవసరమైన విషయాల నుంచి మరల్చి, ఉత్తమ కార్యాచరణలో నిమగ్నం చేసుకుంటాడు.

సేవాగుణం పరమావధిగా కలిగిన వ్యక్తి సాధారణ స్థాయి నుంచి సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎదిగినా- తదనుగుణంగా సేవ చేయడంలోనూ తన పరిధిని విస్తృతం చేసుకుంటాడు. స్వార్థ చింతన లేకుండా పరోపకారం కోసం అహర్నిశలు ఆలోచించేవాడికన్నా లోకంలో వేరే భగవంతుడు ఉండడు.

ఎంతో కాలం నుంచి ఎందరెందరో ఈ భూమ్మీద జన్మించినా కొంతమంది మాత్రమే మానవుల మనసుల్లో, నాలుకలపై నిలిచిపోవడానికి కారణం- వారి సేవాదృక్పథం, కార్యశీలత, అమృతానికి పర్యాయపదంగా నిలవడం. ప్రకృతిపరంగా, మానవుల దుష్ట ఆలోచనల కారణంగా- నిత్యం ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా... క్రమంగా అవి సమసిపోవడానికి కారణం మానవుడిలోని అమృతత్త్వ మాధవ గుణమే. సృష్టి మనుగడకు ఇదే మూల సూత్రం.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.