close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్వాణ షటకం

స్వాభావికమైన భౌతిక ఆనందానికన్నా దివ్యమైన ఆనందాన్ని అనుభవించడానికి నేనెవరిని అనే జ్ఞాన విచారమే చక్కని సాధనమని శ్రీ రమణ మహర్షులు చెప్పేవారు. సప్త ధాతువులతో ఏర్పడిన స్థూల దేహం ‘నేను’ కాదని సాధకులకు ఆయన సూచించేవారు. మనిషిలోని అయిదు జ్ఞానేంద్రియాలు సైతం ‘నేను’ కాదు. మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎన్ని ఊహలు పుడితేనేం... ఒక్కో ఊహ పుట్టగానే అది ఎవరికి కలిగింది అని తనను తాను ప్రశ్నించుకోవాలి. ‘నాకు’ అని తోస్తుంది. అప్పుడు నేనెవరినని శోధించగలిగితే ఆ సంశోధన ఫలించి మనసు అంతర్ముఖం అవుతుంది. శ్రీ శంకర భగవత్పాదులు తన ఎనిమిదో ఏటనే తానెవరో తనకు తెలుసునని నిర్వాణ షటకంలో వెల్లడించారు. ఆరు చరణాల పద్యకృతిలో సాగిన ఈ ఛందోనియతి శివోహం శివోహం అంటూ ముగుస్తుంది.

నిర్వాణ షటకాన్ని ఆత్మషటకం అనీ వ్యవహరిస్తారు. ఆదిశంకరులు ఎనిమిదేళ్ల వయసులో తనలో మెదులుతున్న ఎన్నో ఆధ్యాత్మిక సంశయాల పరిష్కారం కోసం నర్మదా నదీ తీరంలో వెదకసాగాడు. నర్మద ఒడ్డున ఓ గుహలో దర్శనమిచ్చిన గోవింద భగవత్పాదులకు శంకరులు నమస్కరించారు. ఆయన బాలబ్రహ్మచారిని ‘నీవెవరు’ అని ప్రశ్నించారు. ఆదిశంకరులు అందుకు సమాధానంగా ‘నేను మనసు కాదు, బుద్ధి కాదు చిత్తం కాదు, నేను పంచేంద్రియాలు కాదు, పంచభూతాలూ కాదు. నేను చిదానంద రూపాన్ని, శివుడను’ అన్నారు. అంతటితో ఆగక... ‘నేను ప్రాణాన్ని కాదు. నా దేహంలోని పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు కాదు. కర్మేంద్రియాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. శివుణ్ని’ అన్నారు. గోవింద భగవత్పాదులు మనోహరంగా నవ్వుతూ ‘అంతేనా’ అనగా, శంకరులు పారవశ్యంతో ‘నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్థకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని’ అన్నారు. ‘ఓ మహానుభావా... నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాణ్ని నేను కాదు. అనుభవించదగిన వస్తువును సైతం నేను కాదు. అనుభవాన్ని నేను కాదు. నాకు జనన మరణాలు లేవు. జాతి భేదాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు...’ అనీ విడమరచారు.

విభజనలేని జ్ఞానసారాన్ని విశదం చేస్తూ ఆ పసి వయసులోనే అద్వైత సంబంధమైన జ్ఞానాన్ని ఆయన ప్రస్ఫుటీకరించారు. జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనకు ఈ షటకం ద్వారా తొలినాళ్లలోనే ఆయన పునాదులువేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత- ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అంటారు. అన్నింటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటి ఆదిశంకరులు జగద్గురువులయ్యారు. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా ‘తత్వమసి’ అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని అద్వైతం తెలుపుతోంది. ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారే జీవన్ముక్తులు, మహాత్ములు. జిజ్ఞాసువులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు, శ్రీశంకర భగవత్పాదులు సృజించిన వాంగ్మయాలు శుద్ధ బ్రహ్మస్వరూపాలు.

- అప్పరుసు రమాకాంతరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.