
అంతర్యామి
నీకంటూ ఒకరు!
ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు? మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.
అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా, కష్టం వేటువేయగలదా, కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృతహస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయిగానా, యువతిగానా, రాజుగానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా... అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్ల్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకుండాలి. ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి.
ఆ హస్తం మనదే అయితే... అలాంటి హృదయం మనకే ఉంటే... మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు. మనం... ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనక నడిచిరాదా? ఒక్కరు కోటిమందిగా మనకు గొడుగు పట్టరా?
ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలమంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురుదెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజూ ఆ భావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీకృష్ణుడు’ ఆయన.
- చక్కిలం విజయలక్ష్మి
మరిన్ని కథనాలు

- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..