
అంతర్యామి
గాయత్రి ప్రశస్తి
శ్రీ గాయత్రీదేవి వేదమాత. లోకమాత. ఉపాస్య మాన పరదేవత. బ్రహ్మ స్వరూపమైనది గాయత్రీ మంత్రం. అగ్ని ఆమెకు ముఖమని, బ్రహ్మ శిరస్సని, విష్ణువు హృదయమని, రుద్రుడు శిఖ అని శ్రుతులు గాయత్రీ స్వరూపాన్ని పేర్కొంటున్నాయి. బ్రహ్మాది దేవతలు, వేదాధిష్ఠాన దేవతాపురుషులు గాయత్రిని త్రికాలాల్లో భక్తిశ్రద్ధలతో ఉపాసిస్తారని ఆర్హ వాఙ్మయం చెబుతోంది. పరదేవత అయిన గాయత్రిని విభిన్న భావాలు కలిగిన శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణాపత్యులు- ఇంకా ఎందరో ఉపాసిస్తారు, ధ్యానిస్తారు. గాయత్రీ మంత్రం సర్వదేవతా స్వరూపం.
ఓమ్, భూః, భువః, సువః, తత్, సవితుః, వరేణ్యం, భర్గో, దేవస్య- ఈ విధంగా నవవిధ వర్ణ స్వరూపం. ‘ధీమహి’- ఇది ధ్యానానికి సంబంధించింది. ‘ధియోయోనః ప్రచోదయాత్’- నాకు సద్బుద్ధి కలిగించమని చేసే ప్రార్థన. ఈ విధంగా గాయత్రీ మంత్రం వర్ణన, ధ్యానం, ప్రార్థనల సమాహార స్వరూపం. జ్ఞానం పొందాలంటే విద్యలు నేర్వాలి. ఆ విద్యల్లో బ్రహ్మవిద్య శ్రేష్ఠం. గాయత్రీ మంత్రం బ్రహ్మవిద్య. ధర్మార్థమోక్ష ప్రదాయిని మహాశక్తి స్వరూపిణి. అవిద్య నుంచి విద్యకు చేరుస్తుంది. అసత్యం నుంచి సత్యానికి మరల్చుతుంది. మృత్యువును పారదోలి అమృతత్వ స్థితినందిస్తుంది. పుష్పాల్లో ఉండే సారం మకరందమైనట్లు, పాలలోని సారం నేయి అయినట్లు- సర్వవేదాల సారం గాయత్రి అయిందని ‘బృహద్యోగ యాజ్ఞవల్క్యం’ పేర్కొన్నది.
బ్రహ్మదేవుడు సృష్టికార్యం కోసం సమాధి స్థితిలో ఉండగా అతడి శరీరం సగం స్త్రీ రూపం, సగం పురుష రూపం అయిందని ఆ స్త్రీ రూపానికే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని వ్యవహారమని మత్స్యపురాణం చెబుతోంది. గాయత్రీ మంత్రానికి గాయత్రియే ఛందస్సు, విశ్వామిత్రుడు రుషి, సవిత దేవత. ప్రాణ- అపాన- వ్యాన- ఉదాన- సమాన అనే పంచప్రాణాలతో తెల్లని రంగు గలది. 24 అక్షరాలుగలది. మననం చేసేవారిని రక్షించేది మంత్రం.త్రాణమంటే సంసారాన్ని అనుగ్రహించడం. గాయత్రీ మంత్రం ఏడు కోట్ల మహా మంత్రాలకు తల్లి లాంటిదంటారు. ఈ మంత్రాల్లో శైవమంత్రాలు ఒక కోటి. సూర్య మంత్రాలు రెండు కోట్లు. గణేశ మంత్రాలు 50 లక్షలు. వైష్ణవ మంత్రాలు 50 లక్షలు. శక్తి మంత్రాలు మూడు కోట్లు. వీటికి ఆది మంత్రం గాయత్రీ మంత్రమని ఒక భావన.
వ్యవస్థా భేదాన్ని బట్టి అంతఃకరణానికి నాలుగు పేర్లున్నాయి- మనసు, చిత్తం, అహంకారం, బుద్ధి. ఈ నాలుగు తత్త్వాల్లో అనేకత్వం గోచరిస్తుంది. ఆయా స్థితుల్లో భేదం ఉంటుంది. గాయత్రీ మంత్రం ఈ అనేకత్వాల్లోని ఏకత్వాన్ని నిరూపిస్తుంది. బుద్ధి పెట్టి మననం చేస్తేనే ఏ మంత్రమైనా బీజాక్షరమవుతుంది. లేకపోతే అది కేవలం అక్షరం మాత్రమే. బుద్ధి పెడదోవ పట్టకుండా ప్రేరేపించేది గాయత్రి. మంచి బుద్ధి కోసం ముందు గాయత్రీ మంత్రాన్ని పఠించి తరవాత సద్బుద్ధితో ఇతర మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతారు.
వ్యాసభారతం అనుశాసన పర్వం గాయత్రీ మంత్రజప ఫలశ్రుతిని పేర్కొన్నది. ఉత్తమ మైన గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే గొప్ప స్థితిని పొందుతారని, మంత్ర సాధకుడికి రాజ- పిశాచ రక్కసి- అగ్ని- జల- వాయు- గురు మొదలైన భయాలు రావని సకల జనులకూ శాంతి చేకూరుస్తుందని ఈ మంత్రోపాసకులు ఉత్తమ గుణాలు పొందగలుగుతారని వ్యాసమహర్షి అనుశాసనం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
మరిన్ని కథనాలు

- నమ్మించి మోసం చేశారు: జయలలిత
- శశికళ సంచలన నిర్ణయం
- డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
- రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్
- నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్
- ఆలుమగల మధ్య అమెరికా చిచ్చు
- ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
- హీరోయిన్స్ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే