close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేదం ఏం చెబుతోంది?

వేదం మానవాళికి ఇచ్చే సందేశం ఒక్కటే- మనిషిగా పుట్టినందుకు మానవతా విలువలు మరవకుండా జీవించమని. జంతుప్రవృత్తిని రాక్షస స్వభావాలను వదిలి, మనిషికి ఉండవలసిన ప్రేమ, దయ, జాలి, కరుణ అనే గుణాలను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే- ముక్తి సహజసిద్ధంగానే లభిస్తుందంటుంది వేదం. పుట్టిన ప్రతి వాంఛను తీర్చుకోవాలనేది జంతులక్షణం. హింసించి అయినా అనుకున్నది సాధించాలన్నది రాక్షసత్వం. ఈ రెండు మనోవృత్తులూ మనిషికి తగవు. సృష్టిలోని కోట్ల జీవరాశుల్లో వివేకంతో జీవించే అవకాశం మనిషికే ఉంది. ప్రయత్నపూర్వకంగా ప్రేమతత్వాన్ని పెంచుకుని మానవతా విలువలు ఆచరిస్తే మనిషి వివేకవంతుడవుతాడు. తమను తాము సంస్కరించుకుని ఉన్నత స్థితికి ప్రయత్నించే అవకాశం పశుపక్ష్యాదులకు లేదు. చివరకు దేవతలకు సైతం దక్కని ఈ సదవకాశాన్ని వినియోగించుకునే మనిషే ధన్యజీవి అవుతాడు.
మానవత్వమే ముక్తి మార్గమని వేదం చెబుతుంది. దీన్ని ఆచరించి చూపేందుకు దైవం రామావతారం దాల్చాడు. నారాయణుడి పది అవతారాల్లో రామావతారం చాలా ప్రత్యేకమైంది. మనిషిగా పుట్టి సాధారణ మనిషిగానే అసాధారణ కార్యాలు సాధించాడు. ఎక్కడా దివ్యశక్తులు ప్రదర్శించలేదు. రామావతారం ఆచరణలో చూపింది మానవతావాదాన్ని. సాక్షాత్తు రుద్రుడే హనుమగా అవతరించి ఈ మానవోత్తముడికి దాసుడయ్యాడు. దేవతలు సైతం మానవతా విలువలు పాటించేవారికి దాసులనే విషయం ఈ రుద్రావతారం చెప్పకనే చెబుతుంది.
మానవతా విలువలను ఆచరించడమే- గొప్ప సాధన, ముక్తికి హేతువు. మనిషి మనిషిగా జీవిస్తే ముముక్షత్వం సహజంగానే సిద్ధిస్తుంది. తనను తాను సంస్కరించుకోకుండా మనిషి ఎన్ని తీర్థయాత్రలు చేసినా, పూజాది క్రతువులు నిర్వహించినా, ముక్కు మూసుకుని తపమాచరించినా ఒరిగేదేమీ లేదు. ప్రేమతత్వం అనే అసలు విషయాన్ని విస్మరిస్తే, సాధనవల్ల ప్రయోజనమేమీ లేదు. మనసులో ప్రేమతత్వం పుష్కలంగా ఉంటే అది మానవత్వంగా పరిమళిస్తుంది. ప్రేమతత్వం దైవం వైపు మరలితే భక్తి, సాటి మనిషిపై చూపిస్తే మానవసేవ అవుతుంది.
నాటకాల్లో కావ్యాల్లో ఇతివృత్తం కథానాయకుడి చుట్టూ తిరిగినట్లే, వేదవాఙ్మయమంతా మనిషి చుట్టూ పరిభ్రమిస్తుంది. వేదాలు స్పృశించని విషయం ఏదీ లేదు. సృష్టిలో మనిషికి ఉపయుక్తమయ్యే ఏ చిన్న విషయాన్నీ చెప్పకుండా వదలలేదు. అండ పిండ బ్రహ్మాండ విజ్ఞానమంతా వేదాల్లో ఇమిడి ఉంది. దేవతా స్తుతులు, ప్రకృతి శక్తుల గురించి వేదం ఎక్కువ చెబుతున్నట్లు పైకి అనిపించినా, నిజానికి మనిషికే మూలస్థానమిచ్చింది. మనిషే దైవమని, సర్వశక్తి సంపన్నుడని, శాశ్వతుడని, సత్‌ చిత్‌ ఆనందస్వరూపుడని వెల్లడించింది. దేవతా స్తుతులైన సంహితలతో ప్రారంభమైన వేదం, మనిషే దైవమనే ఉపనిషత్తు వాక్యంతో ముగుస్తుంది. మానవత్వాన్ని మరవకుండా మనుగడ సాగిస్తే, మనిషి తనలో దాగి ఉన్న ఆ దివ్య స్వరూపుణ్ని దర్శించగలడంటుంది.
సూర్యచంద్రాదులు ఉదయించినా, మేఘాలు వర్షించినా, భూమి సమృద్ధిగా పంటలందించినా, నక్షత్ర గ్రహకూటాలు గతి తప్పక సంచరించినా- ఇదంతా మానవాభ్యుదయం కోసమేనని వేదమంటుంది. ప్రకృతికి మానవసేవ తప్ప వేరే స్వప్రయోజనం ఏదీ లేదు. వేదం ప్రకృతికి ప్రభుస్థానం ఎక్కడా కల్పించలేదు. మనిషి కోసమే అది అనేక రూపాలు పొందుతోంది. మానవసేవలో తరిస్తోంది, మానవోన్నతికి తపిస్తోంది. ఆ సేవాభావనే ముక్తికి మార్గమని ప్రకృతి సైతం బోధిస్తోంది. మనిషిని సేవించి తరించమని వేదం సందేశమిస్తోంది.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు