మనిషిని చదవాలి!
close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనిషిని చదవాలి!

నం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర  డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగించాలి? ఎంత వరకు పెంచుకోవాలి? ఎంతకాలం పటిష్ఠంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు? ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అనిపించుకుంటుంది. మన జీవన యానానికి, భవిష్యసాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం.
మనిషిని చదివే చదువు గ్రంథాలు, ప్రబంధాలు అధ్యయనం చేసినంత మాత్రాన వచ్చేది కాదు. అయితే వాటి అధ్యయనం కొంత వరకు తోడ్పడవచ్చు. కాని ఎదుటి మనిషి సంభాషణ, నడత, వృత్తి, ప్రవృత్తి, పరిశీలించి పరిచయాన్ని గాని, స్నేహాన్ని గాని పెంచుకోవడం మనిషికి శ్రేయోదాయకం. కొందరు పరిచయం కాగానే చనువు పెంచుకుని అతిగా స్నేహం చేస్తారు. అది మంచికి దారి తీయవచ్చు. కీడే కలిగించవచ్చు. ఏదయినా ‘అతి’ అనర్థదాయకమే! కొందరు ప్రతి మనిషిని, మాటను అనుమానిస్తారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం ఉండదు. దీనివల్ల శత్రువులు పెరుగుతారు.
ఎదుటి మనిషిలోని నిజాయతీని గ్రహించగలగడానికి కూడా స్వతంత్రాలోచనశక్తి ఉండాలి. సానుకూల దృక్పథం అలవరచుకోవాలి. సహనశీలత పెంచుకోవాలి. నిందలను సహించేవారు వందనీయులే. శ్రీకృష్ణుడు నీలాపనిందకు గురైనా సత్యజిత్తును దూషించలేదు. ఆ నిందను తొలగించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. సాత్వికగుణం సాటివాణ్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. రకరకాల విమర్శలకు గురవుతాం. అంతటితో కుంగిపోనక్కర్లేదు. అది సద్విమర్శయితే అంతర్‌ విశ్లేషణ చేసుకుంటాం. అసూయతో చేసిన కువిమర్శయితే నిర్లిప్తంగా వదిలేస్తాం.
రామాయణ, భారత, భాగవతాల్లో అనేక సందర్భాల్లో ఈ విషయానికి సంబంధించిన పాత్రలెన్నో కనిపిస్తాయి. ధర్మ పక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక, అహంకరించి దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు. ధర్మస్వరూపుడు శ్రీరాముడి శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు నిహతుడైపోయాడు. గోపికల మనసులను చదివిన కృష్ణ పరమాత్మ వారికి తోడునీడై ఆదుకున్నాడు.
మనిషిని చూడ్డానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేనివాడు సమాజంలో జీవించలేడు. మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితైషులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడని సాటి మనిషిని గ్రహించగలిగితే, ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించే మనిషిని మాత్రం మరచిపోకూడదు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు