రామరాజ్యం
close

అంతర్యామి

రామరాజ్యం

త్యం, అహింస, స్వధర్మపాలన, కార్యాచరణల్లో నిష్కామత- మనిషి మరచిపోకూడని మౌలిక విలువలని, అవి పాటించి తీరాలని సనాతన ధర్మం చెబుతుంది. ఆ విలువల్లో మార్పులు చూస్తున్నప్పుడు, ‘ఇదేమైనా రామరాజ్యమా... ఇది కలియుగం’ అంటూ కొంతమంది నిర్లిప్తతతో వ్యాఖ్యానిస్తుంటారు.
రాముడు త్రేతాయుగంలో రాజ్యమేలిన మహారాజు. వ్యక్తిగా పాలకుడిగా శాస్త్ర విహితమైన అన్ని ధర్మాల్నీ విధిగా పాటించి, ప్రజానురంజకంగా పాలించాడు. పటిష్ఠమైన పాలన వ్యవస్థను నిర్మించాడు. ఆయన ఏలుబడిని ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించి ఉన్న రాజ్యంలోని అప్పటి ప్రజలందరూ ఆమోదించారు. అతడిని దైవాంశసంభూతుడిగా మర్యాదా పురుషోత్తముడిగా కీర్తించారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు పాలించినదైనా- అలౌకికమైన  సుపరిపాలనతో రూపొందిన రాజ్యవ్యవస్థగా చెరగని ముద్రవేసుకుని రామరాజ్యం  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రామరాజ్యంలో పాలనకు, రాజుకు ఉన్న మంచి ఉద్దేశాలే మార్గదర్శకాలు. రాముడు ధర్మవిరుద్ధమైన అంశాలు పాలనలోకి చొరబడకుండా చూసుకుంటూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తన పాలననుంచి వచ్చే ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలనే పరమార్థతతో పాలించాడు. అతడి మంత్రులు, అధికారులు- పాలన రాజుకొక్కడికే భారం కాకుండా సహకరించేవారు. విధి నిర్వహణలో అప్రమత్తులై వ్యవహ రించేవారు. రాజుగా రాముడు కూడా, ధర్మసంకటాలనిపించే పరిస్థితులు ఎదు రవుతున్నప్పుడు, పాలనతో సంబంధం ఉన్నవారందరినీ సంప్రతిస్తూ సర్వ సమ్మతితో పాలన పద్ధతులకు మెరుగులు దిద్దేవాడు. జరిగింది చిన్నతప్పయినా విమర్శలకు అవకాశ మిచ్చేవాడు కాదు. జనవాక్యాన్ని సమీకరించడమే కాక గౌరవించాలనే సత్‌సంప్రదాయం రామరాజ్యంలో కని పించే కీలకమైన అంశం. తన భార్య పరపురుషుడి చెరలో బందీగా ఉన్న విషయం తెలిసి తన రాజ్యంలో తప్పు పట్టేవారు కొందరున్నారని తెలిసి ఆయన తక్షణమే స్పందించాడు. అది పామర వాక్యమని పట్టించుకోవద్దన్నా సీతను అరణ్యాలకు పంపించాడు. అతడి అటువంటి మనస్తత్వానికి అద్దం పట్టడానికే మహర్షి వాల్మీకి ఉత్తర రామాయణం రచించి ఉండవచ్చని విమర్శకులు కొందరు అభిప్రాయపడతారు. వాల్మీకి రామాయణం రామరాజ్యంలోని పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తుంది. అక్కడ జనం రోగభయం, మృత్యుభయం లేకుండా దీర్ఘాయుష్కులై జీవించేవారని, ఆకలి మరణాలు ఉండేవి కావని, చోరభయం లేదని, ప్రజల సుఖశాంతులే లక్ష్యంగా పాలన జరిగేదని... ఆ మహాకావ్యమంతటా ప్రస్తావనలుంటాయి.
యుగాలు మారినా యుగధర్మాలు మారిపోవు. ధర్మమంటేనే భగవంతుడు. అతడు మార్పులుండని స్థిర రాశి. ధర్మాన్ని మార్చగల శక్తి మనిషికి ఉండదు. కలియుగానికంటూ ప్రత్యేకమైన ధర్మమని ఉండదు. రామరాజ్యం ఆదర్శనీయమైన ప్రజాపాలనకు నిలువెత్తు ఉదాహరణ. పాలన వ్యవస్థలను పరిశీలనాత్మక దృక్పథంతో అధ్యయనం చేసే విద్యాలయాల్లో ప్రపంచమంతటా విశేషజ్ఞులు రామరాజ్యాన్ని సుపరిపాలనకు చెందిన విషయంగా  దాని ప్రతీకగా పరిగణిస్తారు. రాముడి ధర్మమేమిటన్న ప్రశ్నలు వేయలేదు.
సమదృష్టితో చూసినప్పుడు, రాముడు ఏ యుగానికి చెందిన పాలకుడైనా ఆయన నిర్మించిన పాలన వ్యవస్థతో పోలికలున్నది ఎక్కడున్నా, అది కలియుగమైనా- రామరాజ్యమే అవుతుంది. ధర్మ నిరపేక్షతకు నిజమైన అర్థం చెబుతుంది. వ్యక్తిగతమైన తన ఆధ్యాత్మికతకు, సుపరిపాలన జోడిస్తూ రాజ్యమేలినందుకే రాముడి రాజ్యానికి అంతటి విశిష్టత, ప్రాచుర్యం లభించాయని స్పష్టమవుతుంది.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న