మనసు పోకడలు

అంతర్యామి

మనసు పోకడలు

నిషి నడతలన్నీ మనసు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే మనకు గౌరవ మర్యాదలుంటాయి. వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే రోగం మందులతో శాంతిస్తుంది. తగిన చికిత్స చెయ్యడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం. ఇవన్నీ ఉన్నా శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది.

జ్ఞానం అంటే కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి అనుకోవచ్చు. బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం అవుతుంది. జ్ఞానిక్కూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దాన్ని యథాతథంగా స్వీకరించగల శక్తి అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాలకు అందిస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోతుంది. మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది.

జ్ఞానమూ అంతే. జ్ఞానమూలం పరమాత్మ. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా వేదాలు మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే స్మృతులు. అనేక వడపోతల తరవాత జ్ఞానం శుద్ధం, పరిశుద్ధం సుగ్రాహ్యంగా మారి జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది. 

మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలిని వదిలించాలనుకోడు. అసలు సమస్య అంతా మనసుతోనే. దాన్ని శూన్యం చేసుకోవాలంటారు జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు ‘మనోనాశ్‌’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే అసలైన భక్తుడు. అంతర్యామి అంటే ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం- ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దాన్ని దర్శించాలంటే మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనసు, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి. అంటే వాటి ప్రమేయం నశించాలి.

‘నేను’కు నిర్వచనాలు మనసు, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది అనంతుడు, అజేయుడు, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది యోగవాసిష్ఠం. అంటే, మనంకూడా బ్రహ్మస్వరూపులమే. కాని, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే మాయ. మన జీవితకాల యుద్ధం ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తు, భ్రమలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటోంది. ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం ముగిసినట్లే. ఇవి జరగాలంటే- మనసు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. తడబడకుండా, దారి తప్పకుండా...

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న