జ్ఞానోదయం

అంతర్యామి

జ్ఞానోదయం

ద్భుతాలను చూడాలనే కోరిక అందరికీ ఉంటుంది. నిజానికి మన చుట్టూ ఉండే మనుషులే ‘అద్భుతాలు’. ‘ఎందుకూ పనికిరాడు’ అనుకున్న వ్యక్తి ఒకరోజు హఠాత్తుగా విశిష్ట వ్యక్తిగా ప్రఖ్యాతి చెందవచ్చు. సంపన్నుడు నిరుపేదగా మారిపోవచ్చు.

జరాసంధుడు రాజు. అహంకారంతో ప్రజలను పీడించేవాడు. అతడి అనుచరులు సైతం ‘వీడి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా’ అని ఎదురు చూశారు. కృష్ణుడు ప్రజలకు హాని కలగకుండా, ఒంటరిగా, నిర్జన ప్రదేశంలో, భీముడితో యుద్ధం చేయించి, జరాసంధ వధ గావించాడు. శ్రీకృష్ణుడి అండ లేకపోతే పాండవుల విజయం సందేహాస్పదమే!

దేహంలో వికారాలేమీ లేకుండా, రోగాలు రాకుండా ఉండే మనుషులకు అంతకంటే ఏం కావాలి? చేతులు లేనివాళ్లను, కాళ్లు లేనివారిని, పక్షవాత బాధితులను చూసి మనమెంత అదృష్టవంతులమో గ్రహించవచ్చు. కొందరికి తృప్తి ఎప్పటికీ ఉండదు. వాళ్లు పుట్టుక చేత సంపన్నులే అయినా ఏదో కారణం చేత ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అత్యాశ క్లేశాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఆశ బలవత్తరమైనది. ఆశ లేకపోవడం గొప్ప సుఖం. సంపద లేనివాడు హాయిగా నిద్రపోతాడు. సంపన్నుల్లో కొందరు క్రోధ, లోభాలతో ఎండిపోయిన ముఖాలతో కనబడుతూ ఉంటారు. వాళ్లు తాము మానవ మాత్రులు కాదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అందరూ ధనసంపాదన కోసం ప్రయత్నించవచ్చు. కానీ అత్యాశ పనికిరాదు. బుద్ధిమంతుడికైనా, బుద్ధిహీనుడికైనా దైవబలం చేతనే సుఖం లభిస్తుంది. బుద్ధిమంతుడైనవాడు ధనవంతుడవుతాడని గాని, మూర్ఖుడు దరిద్రుడవుతాడని నియమం లేదు. ఆశ అనేది ఒక దుష్ట బుద్ధి. దుష్టులు ఆశను విడవలేరు. ప్రాణాలున్నంతవరకు పీడించే ఈ రోగం లేనివాళ్లు అదృష్టవంతులు. వాళ్లే సుఖంగా ఉంటారు!

మహాభారతంలో ఆచరణ యోగ్యమైన మంచిమాటలు ఎన్నో ఉన్నాయి. అసలు కథతో సంబంధం లేకపోయినా, విలువైన విషయాలు ఎన్నో వాటిలో కనబడతాయి. అందులో ‘మంకి గీత’ ఒకటి. మంకి ఒక పండితుడు. ధన సంపాదన కోసం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎలాగైనా ధనం సంపాదించాలనే పట్టుదల మాత్రం అతడిలో పెరిగింది. రెండు గిత్తలను కొన్నాడు. ఆ రెండింటి మెడలకు ఒకే తాడు కట్టి, వాటికి పనులు నేర్పడానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఒక ఒంటె కూర్చుని ఉంది. దాని రెండుపక్కల నుంచి రెండు గిత్తలు చెంగుచెంగున గంతులు వేస్తూ పరుగెత్తాయి. దాంతో కంగారుపడిన ఒంటె లేచి నిలుచుంది. గిత్తలు ఒంటెకు రెండు వైపులా వేలాడాయి. వాటి మెడలకు కట్టిన తాళ్లు బిగిసిపోయి, ఊపిరాడక ప్రాణాలు వదిలాయి. అతడికి అత్యంత ప్రియమైన గిత్తలు రెండు ఆ ఒంటె దేహం రెండు పక్కలా రెండు మణుల్లాగా ప్రకాశించాయి. ఆ దృశ్యం చూసిన మంకి పండితుడికి జ్ఞానోదయమైంది. స్వానుభవంతో అతడు గ్రహించిన సత్యాలు విలువైనవి. ‘వ్యర్థమైన కోరికలను కలుపు మొక్కల్లా పెరగనీయకుండా జాగ్రత్తపడాలి. కోరికలను అదుపులో పెట్టుకొనకపోతే తుదకు నిరాశ తప్పదు. విద్య వంటి నేత్రం లేదు. సత్యం వంటి తపస్సు లేదు. త్యాగం వంటి సుఖం లేదు. తమ కోరికలన్నీ తీరిన మన పూర్వులెవరైనా ఉన్నారా? లేరు. ఇకముందు కూడా ఉండరు. నాకు జ్ఞానోదయమైంది. కామం సంకల్పం నుంచి జనిస్తుంది. నేను ఇక సంకల్పమే చేయను...’ అనుకొంటూ మంకి పండితుడు కామాన్ని, లోభాన్ని విడిచిపెట్టి తుదకు బ్రహ్మైక్యం పొందాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న