అన్నమయ్య సూక్తులు

అంతర్యామి

అన్నమయ్య సూక్తులు

సూక్తి అంటే మంచి మాట. ఎవరు చెప్పినా వినాలి. ఆ మాట విలువ చెప్పినవారి గొప్పదనాన్ని బట్టి ఉంటుంది. జ్ఞానులు, యోగులు తమ అనుభవసారాన్ని చిక్కని చక్కని పదజాలంతో గుదిగుచ్చి క్లుప్తంగా చెబుతారు. అచ్చ తెనుగులో మనం వాడుకునే ఈ పదజాలాన్ని సంస్కృతంలో సుభాషితం అంటారు.  వెంటనే భర్తృహరి మనకు గుర్తు వస్తాడు. ఆయన రాసిన శృంగార, నీతి, వైరాగ్య శతకాలు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.

వేమన, సుమతి శతకాలు తెలుగు తల్లికి చక్కని ఆభరణాలు. సంగీత సాహిత్యాలు సరస్వతీదేవికి ప్రీతి కలిగించేవే. కవుల అక్షర నీరాజనాలు, గాయకుల సంగీత సేవలు, చదువుల తల్లిని మరింత సుసంపన్నం చేశాయి. సంగీత సాహిత్యాలను మేళవించి సూక్తి రత్నాలను రచించిన వాగ్గేయకారులు త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య... మనం గర్వించదగ్గ తెలుగు బిడ్డలు. తాళ్లపాక అన్నమాచార్యులు దాదాపు ముప్ఫై రెండు వేల పద కవితలు రచించి, ఆలపించి, చరిత్ర సృష్టించారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటేనని గొంతు విప్పి ప్రపంచానికి చాటిచెప్పిన అన్నమయ్య పరబ్రహ్మ స్వరూపమే. అన్నమయ్య ప్రముఖంగా ఆధ్యాత్మిక, శృంగార పరంగా ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని గురించి సంకీర్తనం చేసినా, ఆణిముత్యాల వంటి సూక్తులెన్నో అందులో ఉన్నాయి.

మానవుడు అజ్ఞానం వల్ల తనను తాను తెలుసుకోలేక తహతహలాడుతున్నాడు. సామాన్యుడు ఇంద్రియాల ప్రలోభానికి బానిసగా మారతాడు. కనిపించని శత్రువుల జాడ కనిపెట్టలేక, చేయూత కోసం ఎదురుచూస్తాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే షడ్రిపుల పద్యవ్యూహాన్ని ఛేదించడానికి వివేక, వైరాగ్యం, శమదమాది షట్కం, ముముక్షత్వం అనే నాలుగు ఆయుధాలను కూడగట్టుకోవడానికి అడ్డుకట్టగా చుట్టూ ఉన్న ప్రకృతి పరిణామాలే కారణం. అలాంటి పరిస్థితిలో నామ, రూప, గుణ, సంకీర్తన వినసొంపుగా, మనసుకు ఇంపుగా సోకి హృదయాలను అలరిస్తుంది. ‘కడుపులోని పుండు కడలేని ఆశ’ అంటారు అన్నమయ్య. కోపాన్ని మించిన శత్రువు లేరంటారు. కోపిష్టిని కోపాగ్ని దహిస్తుంది. పరులకు పట్టెడు అన్నం పెట్టక, తిని చచ్చేవాడు లోభి అయితే- ఒకరికి పెట్టక, తానూ తినక మరణించేవాడు పరమ లోభి. వాడి జీవితం ఒక మురికి గుంటలా తయారవుతుంది.

మోహంలో మునిగితే నరుడి జీవితాన్ని ‘జగతి గట్టనికట్టు సంసారం’ అనడం సమంజసమే. ధనమే అన్నింటికీ మూలం. ఆ ధన బలమే మనిషిని మదమెక్కిన ఏనుగుగా మార్చేస్తుంది. ‘అతి సంపదలు దేహినజ్ఞానిని చేయు’, అలాంటి వాడిని మదాంధుడు అంటారు. మదానికి మాత్సర్యం ఒక తోక. తనను మించినవాడు కనిపించగానే రెచ్చిపోతాడు. ఈర్ష్య, అసూయలతో చచ్చిపోతాడు.

‘మత్సరము లేకున్నప్పుడు మనసే రామరాజ్యము’ కాకేమి?

‘మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుగాక.../ ధనికుడై ఫలమేది ధర్మం చేయుగాక.../ పావనుడై ఫలమేది భక్తి గలిగిన గాకా...’

మేటి వైరాగ్యం కంటే మిక్కిలి లాభం లేదు. జ్ఞాన, ఖర్మ, భక్తి, వైరాగ్యాలూ ఇలా ముల్లె కట్టడం అన్నమయ్యకే చెల్లు.

- ఉప్పు రాఘవేంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న